మెయిన్ ఫీచర్

అందగత్తెల సందడి ఇలా మొదలైంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాలోని హైనన్ ద్వీపం వద్ద సాగర తీరాన కాంతులీనే ‘సాన్యా’ నగరం.. అక్కడి విలాసవంతమైన బీచ్ రిసార్టులు, ఆహ్లాదకరమైన వాతావరణం, నయన మనోహరమైన ప్రకృతి దృశ్యాలు ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి.. ‘వాటర్ స్పోర్ట్సు’కు నిలయమైన ఆ ప్రాం తం- సందర్శకులకు నిజం గా స్వర్గ్ధామం.. మేటి పర్యాటక ప్రాంతమైన ‘సాన్యా’ నగరం ఇపు డు- వివిధ దేశాలకు చెందిన అందగత్తెలకు విడిది కేంద్రంగా మారింది.. ‘మిస్ వరల్డ్-2015’ పోటీలకు వేదిక అయిన ‘సాన్యా’ నగరానికి 110 దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు ఇప్పటికే చేరుకున్నారు.. సుందరీమణులకు ఆతిథ్యం ఇస్తున్న ఆ ప్రాంతంలో ఇపుడు ఎటు చూసినా కోలాహలమే.. వచ్చే నెల 19న జరిగే ‘మిస్ వరల్డ్’ పోటీలకు ఈ భామలంతా అన్ని విధాలా సమాయత్తమవుతున్నారు. వీరంతా ఒకరినొకరు కలుసుకుంటూ అందాల పోటీలకు సంబంధించి తమ మనోభావాలను, అనుభవాలను పంచుకుంటున్నారు. నగరంలోని వీధుల్లో తిరుగుతూ, బాలలను కలుసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. కిరీటం సంగతలా ఉంచితే, ‘మిస్ వరల్డ్’ పోటీలకు ఎంపిక కావడం జీవితంలో మరచిపోలేని మధురానుభూతిని కలిగిస్తోందని వీరు తమ అంతరంగాల్ని ఆవిష్కరిస్తున్నారు.
సాన్యా నగరంలో 28 రోజుల పాటు బస చేసే అందగత్తెలందరికీ ‘మిస్ వరల్డ్’ నిర్వాహకులు పలు పోటీలు నిర్వహిస్తారు. శారీరక సౌందర్యమే కాదు, వారి సమయ స్ఫూర్తి, మేధో నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం, సమకాలీన పరిస్థితులకు సంబంధించి వారి ప్రతిభను వివిధ దశల్లో అంచనా వేస్తారు. ప్రతి పరీక్ష కూడా వీరికి ఓ సవాల్‌గానే ఉంటుంది. ఇలా ఈ పరీక్షలన్నీ ముగిశాక వచ్చే ‘మిస్ వరల్డ్’ పోటీ తుది ఘట్టానికి చేరుకుంటుంది. సాన్యాలోని ‘బ్యూటీ క్రౌన్ గ్రాండ్ థియేటర్’లో డిసెంబర్ 19న తుది పోటీలో నెగ్గిన భామను ‘మిస్ వరల్డ్’గా ప్రకటిస్తారు. సాన్యా నగరంలో జరిగే 65వ ‘మిస్ వరల్డ్’ పోటీలకు చైనా ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసింది. అందగత్తెలు విడిది చేసిన హోటళ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, పర్యాటకులకు ఆహ్లాదం కలిగించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తుది పోటీలకు ‘మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్’ అధినేత్రి జూలియా మోర్లే (76) న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారు. దక్షణాఫ్రికాకు చెందిన రోలెన్ స్ట్రాస్ గత ఏడాది ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని కైవసం చేసుకోగా, ఈ ఏడాది విజేతగా నిలిచేందుకు 117 దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు బరిలో నిలిచారు.
‘బికినీ రౌండ్’ రద్దు...
‘మిస్ వరల్డ్’ పోటీల్లో అందరినీ ఆకట్టుకునే ‘బికినీ రౌండ్’ను 63 ఏళ్ల అనంతరం తొలిసారిగా రద్దు చేశారు. కురచ దుస్తుల్లో అందగత్తెలు అందరి ముందు హాజరు కావడం మహిళలను అగౌరవపరచడమేనని, ఇది చైనా సంస్కృతికి విరుద్ధమని ఈ నిర్ణయం తీసుకున్నారు. లోదుస్తుల్లో నడచి రావడమన్నది అందాల పోటీకి కొలబద్ద కాదని ‘మిస్ వరల్డ్-2015’ నిర్వాహకులు గతంలోనే ప్రకటించారు. చైనా సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేసేలా సాంస్కృతిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘బికినీ రౌండ్’ వల్ల అందగత్తెలకు కొత్తగా వచ్చే నైపుణ్యం ఏమీ ఉండదని, అశ్లీలం తప్ప ఎలాంటి ప్రయోజనం లేనందునే దాన్ని రద్దు చేశామని ‘మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్’ అధినేత్రి జూలియా తెలిపారు. ‘ఆశయం కోసం అందాల పోటీలు’ అన్న నినాదమే తమకు ముఖ్యమని ఆమె చెబుతున్నారు. కాగా, 1951లో తొలిసారిగా జరిగిన మిస్ వరల్డ్ పోటీలో విజేత అయిన కికీ హకన్సన్ (స్వీడన్) బికినీ దుస్తుల్లో ఉండగానే కిరీటాన్ని అలంకరించారు. బహిరంగ వేదికపై బికినీ రౌండ్ నిర్వహించరాదని 2001లో నిర్ణయించారు. 2013లో ఇండోనేషియాలో మిస్‌వరల్డ్ పోటీల సందర్భంగా ముస్లిం మతస్థుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో బికినీ రౌండ్‌ను రద్దు చేశారు. స్ర్తివాద సంఘాలు, వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ ఏడాది నుంచి బికినీ రౌండ్‌ను పూర్తిగా తొలగించారు. ‘బికినీ రౌండ్’ను రద్దు చేయడం పట్ల స్పాన్సర్ల నుంచి గానీ, ప్రకటనకర్తల నుంచి గానీ ఎలాంటి వ్యతిరేకత రాలేదని ‘మిస్ వరల్డ్-2015’ నిర్వాహకులు చెబుతున్నారు. మహిళల గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా ఉన్నందునే ‘బికినీ రౌండ్’కు స్వస్తి పలికినట్లు, తమ నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించిందని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు.

అద్భుత అవకాశం..
‘మిస్ వరల్డ్-2015’ పోటీకి భారత్ తరఫున ఎంపిక కావడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందని, మన దేశానికి విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చేందుకు ఇది ఓ అద్భుత అవకాశమని అదితి ఆర్య (21) చెబుతోంది. ‘ఫెమినా మిస్ ఇండి యా-2015’, ‘మిస్ ఇండియా వరల్డ్-2015’ పోటీల్లో విజేతగా నిలిచిన ఆమె ఇపుడు ‘మిస్ వరల్డ్’ పోటీలోనూ సత్తా చూపుతానని ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తోంది. విజేతగా నిలిచి భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నదే తన ఆకాంక్ష అని తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. ఇప్పటికే చైనాలోని సాన్యా నగరానికి చేరుకున్న ఆమె ‘మిస్ వరల్డ్’ పోటీ సందర్భంగా వివిధ దశలను అధిగమించి తుది పోటీకి చేరుకుంటానని ధీమా వ్యక్తం చేస్తోంది. టాలెంట్ రౌండ్, మల్టీమీడియా, డిజైనర్ డ్రెస్, ఫిట్‌నెస్, క్రీడలు, నృత్యం, మోడలింగ్, మేధో నైపుణ్యం వంటి అంశాల్లో రాణించి తుది పోటీకి అర్హత సాధిస్తానని ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. కాగా, ‘మిస్ వరల్డ్’ టైటిల్‌ను మన దేశం నుంచి ఇప్పటి వరకూ అయిదుగురు అందగత్తెలు కైవసం చేసుకున్నారు. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా విజేతలుగా నిలిచారు. వీరిలో ఐశ్వర్య, యుక్తాముఖి, ప్రియాంకా చోప్రా సినీరంగంలోనూ ప్రవేశించి సత్తా చాటుకున్నారు. ఈ ఘనతను అదితి ఆర్య సాధిస్తే- పదిహేనేళ్ల విరామం తర్వాత ‘మిస్ వరల్డ్’ కిరీటం భారత్‌కు మరోసారి దక్కినట్లవుతుంది.

-ఎస్‌ఆర్