మెయిన్ ఫీచర్

వృద్ధాశ్రమాల్లో సాంత్వనకు చోటేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నవనాగరిక యుగంలో నగరాల్లోనే కాదు, చిన్న పట్టణాల్లో సైతం వృద్ధాశ్రమాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కుటుంబ వ్యవస్థలో అనివార్యమవుతున్న మార్పుల కారణంగా కొందరు పయోధికులు వృద్ధాశ్రమాలను ఆశ్రయించక తప్పడం లేదు. నిజానికి ఈ వృద్ధాశ్రమాలు ముసలివారికి వరమా? లేక శాపమా? అన్న ప్రశ్నకు రెండూ సరైన జవాబులే అంటే- ఆశ్చర్యంగా వుంటుంది. సాధారణంగా ఏ ప్రశ్నకైనా జవాబు అవుననో లేక కాదనో ఉంటుంది. కానీ, వృద్ధాశ్రమాల విషయంలో ఈ రకమైన విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే ఈ ఉదాహరణను పరిశీలించాల్సిందే. ఆమె ఎవరైతేనేం? వయసు అరవై ఏళ్ల పైమాటే. రెండేళ్ళ క్రితం ఆమె భర్త ఈ లోకాన్ని విడిచివెళ్లాడు. వారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పిల్లలు ప్రయోజకులై, పెళ్లిళ్లు చేసుకుని ఎవరిబతుకు వారు బతుకుతున్నారు. అనునిత్యం పిల్లల క్షేమం గురించే ఆలోచించి ఆ దంపతులు తమ బాధ్యతలు నెరవేర్చారు. వృద్ధాప్యంలో తమ జీవితాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని వారు ఆలోచించనే లేదు. భర్త ఉన్నన్నాళ్లూ పెన్షన్ డబ్బుతో వారు బాగానే జీవించారు. తండ్రి మరణించాక పెద్దకొడుకు అమెరికా నుంచి వచ్చి కర్మకాండలు ముగిశాక, తన పని పూర్తయినట్లు భావించి తిరిగి వెళ్లిపోయాడు.
‘అమ్మా.. నాకూ, నీ కోడలికి సెలవుల్లేవు. మేం వెళ్లిపోవాలి..’ అని అన్నాడు రెండో కొడుకు.
‘బాబూ.. నాన్నగారు బతికిఉన్నంత కాలం మీకు బరువు కాకుండా మేం కాలక్షేపం చేస్తూ వచ్చాం. ఒంటరిగా వదిలేస్తే ననె్నవరు చూస్తారు?’ అంది ముసలి తల్లి. ఆ అబ్బాయి భార్య వంక చూసిన అనంతరం ఏమీ మాట్లాడలేక పోయాడు.
‘అమ్మా.. మా సంసారాలు మాకున్నాయి. మాతో పాటు నిన్ను తీసుకెళ్ళలేం. అన్నయ్య అమెరికాలో వున్నాడు. అంతదూరం నువ్వెలాగూ వెళ్ళలేవు. వాడు మాటవరసకైనా నీతో ఏమీ అనలేదు. తల్లిదండ్రులను ముసలితనంలో పోషించవలసిన బాధ్యత మగపిల్లలది. తమ్ముడితో పాటు నువ్వు ఢిల్లీ వెళ్ళు. వాడి జీతం తక్కువేమీ కాదు. పైగా నీకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది’ అని పెద్ద కూతురు అనడంతో చిన్నకూతురు వంత పాడింది. అంతవరకూ వౌనంగా ఉన్న చిన్న కోడలు తారాజువ్వలా లేచింది. ఆడపిల్లలు మగ పిల్లలతో సమానమంటారు. మీ చదువులకు, పెళ్ళిళ్ళకు ఖర్చుచేశారు. మీ అమ్మ బాధ్యత మీకు లేదా? మీకు సొంత ఇళ్లున్నాయి. మేం చిన్న అపార్టుమెంటులో అద్దెకుంటున్నాం. మాకెలా కుదురుతుంది. మీలో ఒకరు అమ్మను తీసుకెళ్ళండి. కావాలంటే వెయ్యో, రెండువేలో నెలనెలా పంపిస్తాం’ అందామె.
అంతా విన్న ఇరుగుపొరుగు వాళ్లు అబ్బాయికి గడ్డిపెట్టారు. ‘మీకు సాధక బాధకాలుంటాయి. తల్లిదండ్రుల బాధ్యత మగ పిల్లలది, ఆడపిల్లలదెలా అవుతుంది? ఆమెను ఒంటరిగా వదిలేయకండి. మీతో తీసుకెళ్ళండి’ అన్నారు పెద్దమనుషులు.కోడలికి అత్తగారి పొడ గిట్టదు. ఆమెను రాచి రంపాన పెడుతుంది. అత్తగారి పరిస్థితి మగ్గంలో కండెలాగైంది. వేరే దారి లేక కష్టాలను భరిస్తూ లోలోన విలపించేది. అలాంటి సమయంలో ఇరుగుపొరుగు ఆమెకొక సురక్షిత స్థానం గురించి చెప్పారు. అదే- వృద్ధాశ్రమం!
‘పిల్లల చేత నిర్లక్ష్యానికి గురైన మీలాంటి వారికి కల్పవృక్షం లాంటివి ఈ వృద్ధాశ్రమాలు. అక్కడ మీకు వేళకి తిండి పెడతారు. వసతి వుంటుంది. మీ చేత ఏ పనులూ చేయించుకోరు. మీ యోగ క్షేమాలు అడుగుతూ ఉంటారు. మీలాంటి వారు చాలామంది ఉంటారు గనుక కాలక్షేపానికి కొదువలేదు. ఈ నరకం ముందు అది మీ పాలిట స్వర్గం’ అన్నారు.
ఆమె వారి మాటలు వింది. వెంటనే కొడుకుతో అంది. ‘అదేదో వృద్ధాశ్రమం ఉందట. నాలాంటివారి కోసమే ఏర్పాటుచేసారట. మీకూ చీకూ చింతా ఉండదు. కృష్ణా రామా అనుకుంటూ అక్కడ శేష జీవితాన్ని గడుపుతాను’. తల్లి బాధను పిల్లలు అర్థం చేసుకుంటే ఈ ప్రశ్న తలెత్తేది కాదు. వెంటనే ఫారాలు నింపి తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు ఆ తనయుడు. అక్కడ ఎలాంటి రుసుము తీసుకోకపోవడం అతనికి మరింత ఆనందాన్ని చేకూర్చుంది. పిల్లలున్నా ఆమె వృద్ధాశ్రమంలో చేరక తప్పలేదు. వృద్ధాశ్రమం వల్ల
తృప్తి దొరికింది ఆ పిల్లలకా? తల్లి కా?స్వాతంత్య్రం రాకముందు మన దేశంలో వృద్ధాశ్రమ వ్యవస్థ లేదు. సంతానం లేని వృద్ధులెవరైనా వుంటే ఎవరో ఒకరు వారి బాధ్యతలను తీసుకునేవారు. ఉమ్మడి కుటుంబాలు బీరపాదుల్లా అల్లుకుపోయేవి. అత్తాకోడళ్ల విభేదాలున్నా సర్దుకుపోయేవారు. ముసలి తల్లిదండ్రులకు శుశ్రూషలు చేయడం తమ బాధ్యత అని సంతానం భావించే రోజులవి. నేడు ఉమ్మడి కుటుంబాలు అరుదుగా ఉంటున్నాయి. చాలామంది దంపతులు వృద్ధుల గురించి బాధ పడడం తగ్గించేశారు. ఇరుకైన ఇళ్లలో, ఇరుకైన మనస్తత్వాలతో గిరిగీసుకుని బతికేస్తున్నారు. ఆలుమగలు ఉద్యోగాలకు, పిల్లలు చదువులకు పోవడంతో వృద్ధులకు ఇళ్లలో స్థానం కరువైంది. కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతున్న ఇలాంటి తరుణంలో వృద్ధాశ్రమాలే శరణ్యమవుతాయి.గతిలేక వృద్ధాశ్రమాల్లో చేరుతున్నవారు సుఖంగా ఉంటున్నారా? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. పిల్లాపాపలను వదిలి అనాథలుగా ఎక్కడో బతకాలని ఏ వృద్ధులూ కోరుకోరు. కన్నబిడ్డలకు దూరంగా ఉంటున్నవారు నిజమైన సంతృప్తిని ఎక్కడా పొందలేరు. అవసాన దశలో బిడ్డల చెంత వుండాలనే వారు మనసారా కోరుకుంటారు. పిడికెడు అన్నం, కాస్త ఆదరణ తప్ప వారు ఇంకేమీ ఆశించరు. వృద్ధాశ్రమాల్లో ఎన్ని ఆధునిక సౌకర్యాలున్నా వారు మనశ్శాంతితో ఉండలేరు.
నిజానికి వృద్ధాశ్రమాల వ్యవస్థ మన సంప్రదాయం కానేకాదు. ఏ ధర్మగ్రంథాలతోను, ఇతిహాసాలతోనూ దీని ఊసే లేదు. విదేశీ సంస్కృతులను గుడ్డిగా అనుకరించడంవలననే ఈ వ్యవస్థ నేడు మన దేశంలో విస్తరిస్తోంది. వృద్ధాశ్రమాల్లోనూ రెండు రకాలున్నాయి. సేవాభావంతో స్వచ్ఛంద సహాయ సంస్థలు (ఎన్‌జివోలు) నడిపేవి కొన్ని, కేవలం లాభాపేక్షతో నడిచేవి మరికొన్ని. కొన్నిచోట్ల ప్రభుత్వ రంగంలో రిటైరైన ఉద్యోగుల కోసం ప్రత్యేక వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయి. మొదటిరకం వృద్ధాశ్రమాలు ఉచితంగానే సేవలను అందిస్తున్నాయి. ఇక రెండో రకానికి చెందినవి ‘హైటెక్’ ఆశ్రమాలు. ఇక్కడ దండిగా డబ్బులు వసూలు చేస్తారు. అందుకుతగ్గట్టుగానే ఆరోగ్యం, ఆహారం, వసతి వంటి విషయాల్లో సకల సౌకర్యాలుంటాయి. ఇవి సామాన్య ప్రజలకు గగన కుసుమాలే. ప్రస్తుతం మన దేశంలో వృద్ధాశ్రమాల సంఖ్య వేలల్లోనే ఉన్నట్లు ‘హెల్పేజ్ ఇండియా’ సంస్థ చెబుతోంది. కేరళలో అత్యధికంగా రెండు వందలకు మించి వృద్ధాశ్రమాలు ఉండగా, పంజాబ్‌లో తక్కువ సంఖ్యలో ఇవి ఉన్నాయి. వృద్ధాశ్రమాల సంఖ్య నానాటికీ పెరగడాన్ని చూసి మనం ఆనందించాలా? బాధపడాలా? అన్నది సమాధానం దొరకని సందేహమే. ఎవరూ లేని అనాథ వృద్ధులకు జీవిత చరమాంకంలో ఆసరా కల్పించడం అవసరమే. అయితే, అయినవాళ్లంతా ఉండికూడా నిరాదరణకు గురయ్యే వృద్థులకు ఇవి ఎలాంటి సాంత్వన కలిగించలేవనే చెప్పాలి.

-గుమ్మా నిత్యకళ్యాణమ్మ