ఈ వారం కథ

ఆటవిడుపు! ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోజు ఆదివారం. సూర్యుడు నులివెచ్చని కిరణాలు వెదజల్లుతున్నాడు వింతకాంతితో. మా ఇంట్లోనూ కొంగ్రొత్తగా వుంది. మా కుటుంబ సభ్యులందర్నీ టెక్నాలజీ ప్రభావం నుంచి తప్పించి, సాధారణ మనుషుల్లా మెలగాలని, ఆప్యాయంగా గడపాలని ఇందుకు ఆదివారం ఒక్కరోజైనా కేటాయించాలని వారిని ఒప్పించాను. మావారి కంప్యూటర్, లాప్‌టాప్, స్మార్ట్ఫోన్. టెన్త్ చదువుతున్న మా అమ్మాయి లాప్‌టాప్, మ్యాక్‌బుక్, నవలలు చదువుకునే కిండిల్, సెల్‌ఫోన్, టాబ్లెట్, సెవెన్త్ చదివే మా బాబీగాడి మాక్‌బుక్, కార్టూన్స్ చూసే ట్యాబ్ వంటివన్నీ కప్‌బోర్డులో పెట్టేసి తాళం వేసేశాను.
ఉదయం కాఫీ టైమయింది. శ్రీవారు-‘ఏమిటోయ్.. ఇంకా కాఫీ తయారవలేదా?’ అంటూ వడివడిగా వంటింట్లోకి వచ్చారు. వస్తూనే నా వెనుకనే నిలబడి నన్ను అనునయించసాగేరు. ‘ఏమిటీ.. వీక్‌గా కనిపిస్తున్నావ్. విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? లేదా? , ఫ్రూట్స్ కట్ చేసి మాకందరికీ పెడుతున్నావ్, నువ్వు తింటున్నావా? లేదా?’ అంటూ ఆయన నన్ను తాకి, నా వళ్ళు సవరిస్తూ మాట్లాడుతోంటే, నాకు మనసంతా ఆనందంతో నిండిపోయి ఆయన కళ్ళలోకి ఆప్యాయతానురాగాలతో చూస్తుంటే...
‘అదేమిటోయ్? చిత్రంగా చూస్తున్నావ్ నన్ను’ అని ఆయన చిరునవ్వుతో అంటోంటే..
‘మీరు వంటింట్లోకి వచ్చి ఎప్పుడైనా కాఫీ అడిగారా? నన్ను ఇలా ప్రేమగా తాకి మాట్లాడేరా? బ్రింగ్ కాఫీ.. అంటూ సెల్‌ఫోన్‌లో వంటింట్లో ఉన్న నాకు మెసేజ్ ఇచ్చేవారు కదూ..’ అని నేను అవ్యక్తానందంతో మాట్లాడుతోంటే...
‘నిజమేనోయ్.. టెక్నాలజీకి బానిసలైపోయిన మనం ఎన్నో అమూల్యమైన అనుభూతులు కోల్పోతున్నాం కదూ. ఇకనుండి రోజూ వంటింట్లోకి వచ్చి కాఫీ తాగుతా..’ అంటూ ఆయన అదోలా చూస్తూ మరలా నా భుజంపై చేయి వేశారు. ఆయన స్పర్శతో నా శరీరంలో ఆప్యాయతానురాగాల తరంగాలు ప్రసారం అవుతున్నట్లుగా ఝల్లుమంది నాకు. నా చేతిలో కాఫీ గ్లాసు తీసుకుని తాపీగా సేవించసాగేరు. ఇంతలో పిల్లలిద్దరూ నిద్రలేవడంతో వాళ్ల బెడ్‌రూమ్‌లోంచి మాటలు వినిపించసాగేయి.
కళ్ళు నులుముకుంటూ ఇద్దరూ ఒకేసారి బయటకు వస్తూ ‘అమ్మా మా..’’ అని ఏదో చెప్పబోతుంటే శ్రీవారు ముక్కుమీద వేలేసుకుని, సైలెన్స్ అన్నట్లుగా వాళ్ళిద్దరికీ సైగ చేశారు.
‘అమ్మా.. ఇందిరాగాంధీ గురించి వ్యాసం రాయమన్నారే ఎలాగే?’’ అంది అమ్మాయి.
‘అదేంటమ్మా.. నాన్నగారు ఇందిరాగాంధీ జీవిత చరిత్ర పుస్తకం కొనిపెట్టారు గదా. షెల్ఫ్‌లో చూడు. గంటసేపు అది చదివి ముఖ్యమైన పాయింట్స్ రాసుకుని చక్కని వ్యాసం రాయి తల్లీ! ఎంతసేపూ గూగుల్‌లో సెర్చ్ చేస్తే వచ్చే విషయాలతో వ్యాసం రాయడం వలన ప్రయోజనం లేదమ్మా. మీరు పుస్తకాలు చదవడం మానేసి, మాయదారి గూగుల్ సెర్చ్‌తో మీ బుర్రలను నిద్రపుచ్చేస్తున్నారే. కాస్త వాటిని నిద్రలేపండే బాబూ..’ అంటున్న నన్ను వింతగా చూస్తూ...
‘అమ్మా.. నీకు ఇవ్వాళ ఏమయిందే? కొత్తగా ప్రవర్తిస్తున్నావ్’ అంటోంది మా పాప. ఇంతలో బాబీగాడు అందుకుని-
‘అమ్మా.. కొన్ని కష్టమైన ఇంగ్లీషు మాటలకు అర్థాలు రాసుకురమ్మన్నారే? మరి ఎలాగే..’ అంటూంటే ముక్కుమీద వేలేసి, ఇక మాట్లాడవద్దని సైగ చేశారు మావారు.
‘బాబీ.. ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ నాన్నగారు కొన్నారు కదా. ఏయే పదాలకు అర్థాలు కావాలో తెల్లకాగితం మీద ఎ నుండి జెడ్‌వరకు అక్షరక్రమంలో వరుసగా రాసుకో. అప్పుడు డిక్షనరీ తీసుకుని ఒక్కో పదమూ వెతికి పట్టుకుని అర్థాలు రాసుకో. బుర్ర పనిచేసేట్లుగా చురుగ్గా తయారవ్వాలిరా.. లాప్‌టాప్‌లో డిక్షనరీ ఓపెన్ చేసి అదేపనిగా క్లిక్ చేసే అలవాటును తగ్గించుకోరా?’ అంటున్న నన్ను చూస్తూ ‘అమ్మా నీకు ఇవ్వాళ ఏదో అయిందే. మా బుర్రల్ని తినేస్తున్నావేమిటే మాబూ’’ అంటున్నాడు బాబీ.
సరిగ్గా అదే సమయానికి శ్రీవారు- ‘ఏమిటిరా.. అమ్మని ఏదో అంటున్నావ్’ అన్నారు.
‘చూడండి నాన్నగారూ.. ఇవ్వాళ అమ్మ విచిత్రంగా మాట్లాడేస్తోంది..’’ అంటున్న బాబీ వేపు సీరియస్‌గా చూస్తూ ‘బాబీ.. కూల్ డౌన్.. ఈ రోజు ఇంట్లో అందరం రిఫ్రెష్ అయి, మన మనసులను, శరీరాలను మేల్కొలపాలని అమ్మ అభిప్రాయం. వెళ్ళు.. షెల్ఫ్‌లో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ తీసుకుని నా గదిలోకి పద, పదాలు ఎలా వెతకాలో చెబుతాను’ అన్నారు శ్రీవారు. నన్ను సపోర్టు చేస్తున్నందుకు ఆయన్ను మెచ్చుకోలుగా అభినందన పూర్వకంగా చూడసాగేను.
రోజూ తొమ్మిది గంటలకల్లా టిఫిన్ చేసేస్తారు అందరూ వాళ్ల గదుల్లో. నేను వంటింట్లో పనులు చేసుకుంటూ గబగబా నోట్లో టిఫిన్ కుక్కేసుకుంటాను. ఈ రోజు మాత్రం అందుకు భిన్నం. ఎప్పుడూ వంటింట్లోకి రాని అమ్మాయి వచ్చి- ‘అమ్మా ఇవ్వాళ టిఫిన్ ఏమిటి?’ అంది. ‘పెసరట్టు-ఉప్మా చేస్తానే ఇవాళ, అందరికీ సెలవుకదా..’ అంటే- ‘ఓ మై గాడ్.. నాకు చాలా ఇష్టం. నేను కట్టర్‌తో వుల్లిపాయలూ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర తరుగుతానమ్మా. నాకు నేతితో పెసరట్టు వెయ్యాలి ఇవాళ’ అంటూ అవన్నీ తీసి, కట్టర్ పెట్టుకుని తరగసాగింది నేర్పుగా. ఎక్కడ టిఫిన్ ఆలస్యం అయిపోతుందోనని, రోజూ హడావుడిగా అన్నీ నేనే చేసుకుంటా. అలాంటిది ఈ రోజు నా పక్కనే నిలబడి నా కూతురు అట్లలోకి ముక్కలు తరుగుతూంటే నా మనసు పరవశంతో ఊగిసలాడింది. దాని భుజంమీద ఆప్యాయంగా నిమిరి ‘నా చిట్టికన్నా అమ్మకు సాయం చేయాలనిపించిందేమిట్రా..’ అంటూంటే అది నన్ను చిత్రంగా చూడసాగింది. నిజానికి అది తన రూమ్‌లో కూర్చుని కిండిల్‌లో బుక్స్ చదువుకోవడమో, స్నేహితులతో లాప్‌టాప్‌లో చాటింగ్ చేయడమో చేస్తుంది. కానీ ఇవాళ ఇలాగ.. నేను పెసరట్లు వేస్తోంటే డైనింగ్ టేబుల్ దగ్గర నాన్నకీ, తమ్ముడికీ తీసుకువెళ్లి ఇవ్వసాగింది. కాసేపట్లో డైనింగ్ టేబుల్ చుట్టూ అందరమూ చేరాము. కబుర్లు చెప్పుకుంటూ ఒకే చోట కుటుంబమంతా చేరి టిఫిన్ తింటూంటే ఎంత బావుందో..
మామూలుగా ఐతే- ఈ సమయానికి శ్రీవారు ఆయన గదిలో లాప్‌టాప్ చూసుకుంటూ, అమ్మాయి మ్యాక్‌బుక్‌లో ఫిల్మ్ సాంగ్స్ చూస్తూ, బాబీగాడు ఐ ప్యాడ్‌లో గేమ్స్ ఆడుకుంటూంటే, నేను వెళ్లి టిఫిన్ ప్లేట్స్ అందిస్తే, ఏమీ ఆరాతీయకుండానే తినేస్తారు. ఏం తింటున్నారో కూడా పట్టించుకోరు. కానీ, ఇవ్వాళ ఎంత సంతోషంగా వుంది? టిఫిన్ తింటూన్నంతసేపు శ్రీవారు నా కళ్ళలోకి అనేక ప్రశ్నలు సంధిస్తూ చూస్తున్నారు. ఏమిటి.. ఇవాళ ఇంత సంబరంగా వుంది ఇల్లు అన్నట్లుగా. టిఫిన్లు అయ్యాక పిల్లలిద్దరూ వాళ్ళ గదుల్లోకి వెళ్లిపోయారు. శ్రీవారు షార్ట్,టీషర్ట్ వేసుకుని వంటింట్లో నా వద్దకు వచ్చి ‘ఏమోయ్.. ఇవాళ స్పెషల్స్ ఏమిటి? ఇవాళ వంటలో సాయం చేస్తానోయ్..’అంటూంటే...
‘చాల్లెండి.. అలా చూస్తూ కబుర్లు చెబుతూండండి. మీరు పక్కన నిలబడితే చాలు, పనులు చకచకా అయిపోతాయి. ఇవ్వాళ పువ్వూ గుత్తి వంకాయ కూర, నిమ్మకాయ కారం, టమాటా రసం చేస్తాను..’ అని నేను అంటోంటే, వంకాయలు మంచివి ఏరి, ఉల్లిపాయ ముక్కలు తరిగారు. నిమ్మకాయలు కోసి గినె్నలోకి రసం పిండారు. చారు గినె్నలో నీళ్ళు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు, టమాటా ముక్కలూ వేసి పక్కన పెట్టారు. ఆయన ఇవన్నీ ఎంతో నేర్పుతో చేస్తుంటే ఆశ్చర్యం కలిగింది. ‘ఈ పనులన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు స్వామీ?’ అని నేను చిలిపిగా అంటోంటే, ‘అప్పుడప్పుడు వంటింట్లోకి వచ్చినపుడు నువ్వు చేసే పనులు చూశానులే, పెళ్లి కానంతవరకూ నేను వండుకుని తినేవాడిని, పెళ్లయ్యాక నీ వల్ల సోమరిపోతునైపోయానుగా’ అంటూ మాట్లాడుతున్న ఆయన్ను అనురాగంతో చూడసాగేను.
ఈలోగా అమ్మాయి, అబ్బాయి వంటింట్లోకి వచ్చారు. ‘అమ్మా మా బుక్ షెల్ఫ్‌లు నీట్‌గా సర్దేశాం, చాలా డస్ట్ వుందమ్మా. వాటె వండర్ నాన్నగారు.. వంటింట్లోనా..?’ అన్నారిద్దరూ ఒకేసారి.
‘్భలేవాడివిరా బాబీ, మీరిద్దరూ పుట్టక మునుపు అమ్మ ఊరెళితే నేనే వంట చేసుకుని తినేవాడిని తెలుసా?’ అని శ్రీవారు అంటోంటే ‘మీరు రూమ్‌లోంచి ఒక్క క్షణం కూడా బయటకు వచ్చేవారు కాదు, ఇదేం వింత నాన్నగారూ?’ అంటోంది అమ్మాయి.
వెనుకటి రోజుల్లో కంప్యూటర్, లాప్‌టాప్, టాబ్లెట్స్, కిండిల్, సెల్‌ఫోన్లు వంటివి వుండేవా? స్కూళ్లు ఆఫీసులు వున్నపుడు ఎవరి దారిన వారు వెళ్లిపోవడం, సాయంత్రం ఇంటికివచ్చాక అందరం సరదాగా కబుర్లు చెప్పుకోవడం, పరస్పరం అభిప్రాయాలు తెలుసుకోవడం, పిల్లలు చదువుల్లో సందేహాలు నివృత్తి చేసుకోవడం, కాస్సేపు టెలివిజన్ చూడడంతో కాలక్షేపం జరిగేది. ల్యాండ్‌ఫోన్ మాత్రం ఒకటి రెండుసార్లు పలకరించేది. మరి ఇప్పుడు? మనుషుల చుట్టూ ఈ టెక్నాలజీ చుట్టుముట్టేసి మనసులను, అనుబంధాలను మాయం చేసేస్తున్నాయి. ఒకరినొకరు సంప్రదించుకోవడం, సలహాలు, సూచనలు ఇచ్చిపుచ్చుకోవడం, అప్పుడప్పుడు ఆనందంతో ‘హగ్’ చేసుకోవడం, శుభవార్తలు ఉంటే అభినందించుకోవడం జరిగేది. ఇప్పుడైతే అంతా యాంత్రికం. ఒకే ఇంట్లో తండ్రి తన గదిలోంచి తల్లికి ‘టిఫిన్ అయిందా? ఏం కూరలు చేస్తున్నావ్’అని మెసేజ్ పెడితే, తల్లికి- కొడుకూ కూతురూ వాట్స్‌అప్‌లో ‘అమ్మా ఇవ్ళా స్కూలుకు తొందరగా వెళ్లాలి, టిఫినూ, కేరేజీలు త్వరగా సర్దేయాలి’ అని మెసేజ్ పెడతారు. ఎవరి గదిలో వారు బందీలవుతున్నారు. బయట ప్రపంచంతో వారికి సంబంధం లేదు. తల్లి తెచ్చే టిఫిన్ తింటూనే కళ్ళన్నీ సెల్‌ఫోను మీదనో, లాప్‌టాప్‌మీదనో ఉంచడం, టిఫిను బావుందా? లేదా? అనే స్పృహ లేకపోవడం.. హృదయస్పందన ఉందా? లేదా? అనిపించే స్థాయికి వచ్చేసింది పరిస్థితి.
మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నాం నలుగురమూ. ‘అమ్మా.. గుత్తివంకాయ కూర ఎంత రుచిగా వుందో. నెయ్యి, పప్పు, అన్నంలో ఎంత రుచిగా వుందో. యూ ఆర్ గ్రేట్’ అంటోంది అమ్మాయి. నా మనసు గెంతులేస్తోంది సంబరంతో.
‘నిమ్మకాయ కారం చాలా బావుందోయ్. ముక్కలన్నీ ఊరిపోయి పప్పూ నెయ్యి అన్నంలో నంజుకుంటుంటే అమృతంలా వుందోయ్, టమాటా రసం సూపర్..’ అంటూ శ్రీవారు లొట్టలేసుకుంటూ తింటూంటే నా మనసు గతి తప్పింది. ‘అమ్మా నేను వొట్టి వంకాయలే తినేస్తున్నానే, ఎంత బావున్నాయో’’ అని బాబీగాడు అంటోంటే ‘‘అన్నంతో తిను బాబూ కడుపులో గాబరా పెడుతుంది’ అని నేను అంటోంటే శ్రీవారూ, అమ్మాయి నన్ను అదేపనిగా చూస్తున్నారు.
‘నువ్వు కూడా మాతో తినేసెయ్’ అంటూ శ్రీవారు నాకో ప్లేట్ పెట్టి అన్నీ వడ్డించేశారు. చాలా రోజుల తరువాత ఈ అపురూపమైన మా కుటుంబ సంగమం- కనుల పండువగా ఉండడంతో నాకు అంబరాన్నంటింది సంబరం.
సాయంత్రం త్వరగా తయారై అందరం కారులో మంచి కుటుంబ కథ వున్న సినిమాకు వెళ్ళాం. ఆయన పక్కన అమ్మాయి, నా పక్కన బాబీ కూర్చుని చిప్స్ తింటూ సినిమా చూశాం. ఇలాగ సకుటుంబంగా సినిమా చూసి ఎన్ని సంవత్సరాలైందో. ఇంట్లో టీవీలోనో, కంప్యూటర్‌లోనో, యూ ట్యూబ్‌లోనో ఎవరికి ఇష్టమైన సినిమా వాళ్ళు ఒక్కరే చూసేయడమే. అందరూ కలిసి ఒకే సినిమాను ఆస్వాదించడం ఎంతటి అపూర్వమైన అనుభూతి?
ఇంటికి వచ్చాక, మేం చూసిన సినిమాలోని కామెడీ సీన్లు తలచుకుని నవ్వుకుంటూ డిన్నర్ చేశాం. ఎప్పుడూ పిల్లల బెడ్‌రూమ్‌లో వాళ్ళు, మా బెడ్‌రూమ్‌లో మేమూ కాకుండా, అందరమూ మా బెడ్‌రూమ్‌లోనే ఒకరిమీద ఒకరు చేతులు వేసుకుని పడుకున్నాం. పిల్లలు నిద్రపోయారు. కానీ, మా ఇద్దరి మనసుల్లో గూడు కట్టుకున్న అనుభూతులు, ఆనందాలు, ముద్దుల మురిపాలు కళ్ళల్లో మెదలుతూ, నిద్ర పట్టడం లేదు మాకు.
‘ఏమోయ్ నువ్వు మన ఇంట్లో వున్న ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ రోజంతా దాచేసి, మనం మనంగా ఎంజాయ్ చేద్దామని అంటే ఏమిటో అనుకున్నాను. భలేగా కంట్రోల్ చేశావ్ పిల్లల్నీ, నన్నూ. పిల్లలు ఏదో ఒక సందర్భంలో లాప్‌టాప్‌లు, కిండిల్‌లూ, సెల్‌ఫోన్లూ కావాలని మారాం చేస్తారేమోనని భయం వేసింది సుమా! ఏం మాయ చేశావ్ డియర్’ అంటూ శ్రీవారు నా బుగ్గపై చిటిక వేస్తోంటే నేను ఆయన్ను ఒక విధమైన మైమరపుతో చూస్తూ...
‘ఇదంతా మీ గొప్పే కదూ. మీరు సహకరించకపోతే నేనేం చేయగలను? కుటుంబంలో భార్యాభర్త ఒకటైతే ప్రపంచాన్ని జయించవచ్చును కదండీ. మన పిల్లలు మారాం చేసే రకం కాదు. ఇవాళ నిజంగా మన ఇంట్లో అందరం ఆప్యాయతానురాగాలతో మనుషుల్లా జీవించాం. ఇలాగే నెలకు ఒక రోజు ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా వుండాలండీ’ అంటున్న నాతో ‘ల్యాండ్‌లైన్‌తో సహా ఫోన్లన్నీ కనిపించకుండా చేసేశావ్ కదా. మనకు ఏదైనా అర్జెంట్ ఫోన్ వస్తే ఎలా?’ అన్నారు శ్రీవారు.
‘‘్భలే వారే. నా సెల్‌ఫోన్ సైలెంట్‌లో పెట్టేసి నేను ఎన్ని ఫోన్ కాల్స్ అటెండ్ అయ్యానో తెలుసా? పిల్లలకు ఎన్ని ఫోన్ కాల్సో చెప్పలేను. ఇక మీ స్నేహితులు అయితే మావాడికి ఏదైనా సిక్ చేసిందా? ప్లీజ్ చెప్పండి అని ఒకటే గోల. చాలా ఇబ్బంది అయిపోయిందనుకోండి. ఏది ఏమైనా చాలా రోజుల తరువాత హేపీ డే ఫరెవ్వర్!’ అంటున్న నన్ను చూసి చిలిపిగా నవ్వసాగేరు శ్రీవారు. ‘నువ్వు చెప్పినట్లు చేశా.. నాకేమిస్తావ్?’ అన్న భావం వుంది ఆ చిలిపి నవ్వులో.. వెంటనే ఆయన చేయి అందుకుని, ఆయన చేతి వేలు నా ముక్కుమీద పెట్టి ‘‘తప్పుకదూ..’’ అన్నట్లుగా కొంటెగా నవ్వసాగేను. *

-కె.బి.కృష్ణ