సబ్ ఫీచర్

పరిపూర్ణ ఆహారం..పనస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మొన్న ఏకాదశి నాడు కటిక ఉపవాసం చేశాను.. ఒకేఒక్క పండు తిన్నా..’ అన్నాడట ఒక మహాభక్తుడు. పండు కూడా కటిక ఉపవాసం నాడు తినకూడదుకదా! అని మనసులో అనుకుని ‘ఏం పండు’ అని స్నేహితుడు అడిగాడట. అరటి పండో, బత్తాయి పండో అని చెప్తాడనుకున్నవాడికి కళ్లు తిరిగేలా ఆ భక్తాగ్రేసరుడు పనసపండు అని జవాబిచ్చాడట. ఉపవాసాలు చేశామని చెప్తూ శివరాత్రినాడు ఉప్పుపిండి, కొబ్బరి పచ్చడి తింటూ, వైకుంఠ ఏకాదశి నాడు పులిహోర, చక్రపొంగలి, దధ్యోదనం ఆరగిస్తూ భగవంతుడి ప్రసాదం తినడంలో తప్పులేదని తమనితాము మోసగించుకుంటూ ఉండేవారిని ఉద్దేశించినది పై సంభాషణ. అయితే, పనసపండు వైశిష్ట్యాన్ని గుర్తించడానికి కూడా ఆ సంభాషణ పనికి వస్తుంది.
ప్రపంచంలో అతిపెద్ద పం డు పనస. అయిదు నుంచి యాభై కిలోల దాకాతూగే పనసలో వందలాది గింజలుంటాయి. ప్రోటీన్లు, కాల్షియం, ఇనుము మొదలైనవాటికి ఇది ప్రసిద్ధం. బంగ్లాదేశ్‌లో జాతీయఫలం పనస. తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాలన్నీ పనసను పండిస్తున్నాయి. పూర్వం ఇళ్ళళ్లో ఏ మాత్రం చోటున్నా పనస చెట్టు వేసుకున్నారు. స్ర్తిలు నోచుకునే పదహారుపళ్ల నోములో పనసది ముఖ్యపాత్ర. పనసపండుతో నోము పూర్తయిన తోటివాళ్లు ‘హమ్మయ్య’ అనుకుంటారు. పోలాల అమావాస్య నాడు, మహాలయ అమావాస్య నాడు పనస ఆకులతో గినె్నలు(దొనె్మలు)కుట్టి వాటిలోఇడ్లీపిండి వేసి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నివేదిస్తారు. పనసపండులో చాలా తొనలుంటాయి. వీటిలో విటిమిన్-సి సమృద్ధిగా ఉంటుంది. గింజలో ప్రోటీన్లు, ఇనుము, కాల్షియం, పోటాషియం మొదలైనవి ఉంటాయి. వందగ్రాముల పండు తొంభై అయిదు కాలరీల శక్తినిస్తుంది. పనస పొట్టుతో దక్షిణాదిలో, పనస ముక్కలతో ఉత్తరాదిన కూరలు చేసుకుంటారు. కేరళలో పనసతో చేసిన చిప్స్ (పలాపళమ్ చిప్స్) చాలా పేరుపొందినవి.
పనస వల్ల ఇతర ఉపయోగాలూ ఉన్నాయి. పనస ఆకులు మేకల వంటి జంతువులకు ఆహారంగా పనికొస్తాయి. పనస చెక్కను ఇంటి నిర్మాణంలో ఫర్నిచర్ తయారీకి వాడవచ్చు. పనస జిగురును ఆధునిక ‘గమ్’ బదులు వాడవచ్చు. యంత్రాల తాకిడి లేనికాలంలో పనస బెరడుని ఉపయోగించి కాషాయరంగు తయారు చేసి బట్టలకు (ముఖ్యంగా సన్యాసుల వస్త్రాలకు) వేసేవారు. ఇంతగా ఉపయోగించగలిగిన పనసపండు విషయంలో భారతదేశ నిర్లక్ష్య ధోరణి విచారకరం. పనసతోటలే తక్కువ. పండించిన పంటలో మూడవ వంతు వృథా గా పోతున్నది. పండుని నిలువచేసే మార్గాలు తక్కువ. పాశ్చత్యదేశాలలో పండే పండ్లను నిలువచేసే మార్గాలను, అక్కడున్న శాస్తజ్ఞ్రులు కనిపెట్టినట్లుగా మనదేశంలో పరిశోధనలు జరగడం లేదు. ఇది ఒక కారణమైతే పనసపండు బీదవాళ్లు తింటారు. కానీ ధనవంతులు పరువునష్టంగా భావిస్తారు. ఇప్పుడు పేదలు కూడా ఏదోలా తంటాలుపడి ఆపిల్స్ కొనడం వైపే దృష్టిసారిస్తున్నారు. అటు రైతుకీ, ఇటు వినియోగదారుడికీ లాభం కలిగించే పనసపండు మీద శీతకన్ను వేస్తున్నారు. ఒక పనస చెట్టు ఏడాదికి సుమారుగా నూట యాభై పళ్లదాకా ఇస్తుంది. ఒక చెట్టుమీద తొమ్మిదివేల రూపాయల వరకూ సంపాదించవచ్చు. వాతావరణం బాగుంటే రైతు చెయ్యవలసిన పని పెద్దగా ఉండదు. వరి, గోధుమ, పప్పు్ధన్యాలు వలే ప్రతిఏటా కొత్త విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు వంటివి అవసరం ఉండవు.
ఇక వినియోగదారుల వైపు నుంచి చూస్తే పనసపండు సంపూర్ణమైన ఆహారం. శరీరానికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్సు, మినరల్స్, విటమిన్స్ అన్నిటినీ అందిస్తుంది. తొమ్మిది, పది తొనలు తింటే ఒకపూట వేరే ఆహారం అవసరం ఉండనే ఉండదు.
పనసకు జన్మభూమి భారతదేశం. కానీ, పనసపంట తక్కువే. పండిన పళ్ళలో డెబ్భై అయిదుశాతం కుళ్ళిపోతున్నాయి. మన ఇరుగుపొరుగున ఉండే బంగ్లాదేశ్, మలేషియా మొదలైన దేశాలలో పనసపండుని రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు. కూరలు, వేపుళ్లు, జ్యూస్, చిప్స్, ఐస్‌క్రీమ్, చాక్‌లెట్స్ తయారీలో పనసను విరివిగా వాడుతున్నారు. మనదేశంలోనే ఒకవైపు ఆహారం కొరత ఉంది, మరోకవైపు లభ్యమవుతున్న ఆహారం వాడుకోకుండా వృథా అవుతున్నది. ఇందుకు కారణమేమిటి? ఖరీదైన తిండి మాత్రమే సరైన తిండి అన్న నమ్మకం ఎందుకో తెలియదుకానీ మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. శ్రీనాథుని చాటువులు ఈ మనస్తత్వాన్ని చాటి చెప్తాయి, సజ్జ జొన్నకూళ్లను ఆయన వెక్కిరించి ‘సన్నన్నము సున్న సుమీ’ అని వాపోయాడు. ప్రస్తుతం మనకు వరితో వండిన వంటకం తప్ప ఏదీ సయించదు. ఆ అన్నం కూడా తెల్లగా మల్లెపువ్వులా మెరిసిపోవాలి. ఏ మెతుక్కి ఆ మెతుకు విడిగా కన్పించాలి. కూరలూ, పప్పులూ ఖరీదైనవి కావాలి. అకస్మాత్తుగా డాక్టర్లు వరికన్నా చిరుధాన్యాలు మంచివని చెప్తే ఆస్ట్రేలియా నుంచి ఓట్సు, అమెరికా నుంచి క్వినోవా దిగుమతి చేసుకుంటాం తప్ప దేశయమైన ఆహారం మనకి గుర్తుకిరాదు. వరితో వండిన అన్నమే గొప్పది అన్నభావం శ్రామికవర్గాలకు కూడా ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల వ్యా పించింది. పోటీపడి రాజకీయ పార్టీలు రేషన్‌లో బియ్యం సరఫరా చేస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం మా త్రమే వండాలన్న నియమం కూడా ఉంది. బియ్యం నిజంగా అంతగొప్ప ఆహారంకానే కాదు. బియ్యమే తినడం వల్ల ఎవరూ శ్రమజీవనం చేయ్యలేకపోతున్నారు. ప్రభుత్వ పథకాలలో దుర్వినియోగం జగద్విదితం.
ఉపవాసం నాడు ఓకేఒక్క పండు తిన్నానన్న హాస్యోక్తిని పక్కన పెడితే, ఒక్క పనసపండుతో ఒక కుటుంబం రెండురోజులుగా గడుపుకోవచ్చు. గ్యాస్, కిరోసిన్, కరెంటు వంటి ఇంధనాలు అవసరం లేదు. స్కూళ్ళలో పిల్లలకు మధ్యాహ్నం పనసతొనలు (సీజన్లో) ఇస్తే వాళ్లకి కడుపునిండుతుంది. బలంగా, ఆరోగ్యాంగా పిల్లలుంటారు. టీచర్లు వంట పని చేయకుండా పాఠాలు చెప్పవచ్చు. తెలివిమీరిన టీచర్లు ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యాన్ని ఇంటికి తరలించుకునే అవకాశం ఉండదు.
ఇటు రైతుకీ, అటు సామాన్యునికీ పనికివచ్చే పనసపంట విషయంలో ప్రభుత్వం పూనుకుంటే బాగుంటుంది. కానీ, సాధ్యాసాధ్యాల విషయమే అనుమానాన్ని కలిగిస్తుంది. ‘పేదవాళ్ళకి పేద ఆహారమా?’ అని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టవచ్చు. ‘మా పిల్లలకు ఇలాంటి తిండి పెడతారా?’ అని సామాన్య ప్రజలు ప్రశ్నించవచ్చు. ఈ విషయంలో ఇంటిని పొదుపుగా గడపవలసిన మహిళలు ముందడుగు వేస్తే బాగుంటుంది. ఖరీదైనదే ఆహారం కాదు. ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చేదే అసలైన ఆహారం. మిగిలిన రకాలు డాక్టర్లని బతికిస్తాయి కానీ మనల్ని చంపేస్తాయి. బతకడానికి తిండికానీ తినడానికి బతుకు కాదు. ‘మా ఇంట్లో ఫలానాది వండుతున్నాం’ అని ఒకరి దగ్గర ఒకరు గొప్పలు చెప్పుకుంటూ, ‘్ధరలు పెరిగాయి, పండుగ చేసుకోలేకపోతున్నాం’ అని టివిలో వాపోతూ ఉండడం మానేసి ఆహారం ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే అటు అన్నదాతనీ, ఇటు కుటుంబాన్నీ కాపాడినవారవుతారు.

-పాలంకి సత్య