సబ్ ఫీచర్

ఆత్మస్తుతి, పరనింద.. రెండూ అనర్థాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనల్ని మనం అతిగా పొగుడుకోవడం, ఇతరులపై అకారణంగా నిందలు వేయడం.. రెండూ అత్యంత హేయమైన చర్యలని ధర్మశాస్త్రాల ప్రబోధం. విద్యావంతులైన వారిలో కూడా ఈ రెండు లక్షణాలూ కనిపిస్తాయి. తమను తాము గొప్పగా పదిమందిలో చెప్పుకోవడం, ఇతరులలో వుండే చిన్న చిన్న లోపాలను ఎత్తిచూపుతూ విమర్శించడం, ‘అన్నింటా తామే గొప్ప’ అని భావించడం కొంతమంది స్వభావం. ఏ రంగంలోనైనా ప్రతిభా పాటవాలు కలిగి వుండడం ఒక విశేషమైతే, వాటిని ఇతరులకు తగిన పద్ధతిలో తెలియజేయడానికి మెళకువలు తెలియాలి. చదువు, వృత్తి, ఉద్యోగ, సాంకేతిక, కళారంగాల్లో వున్నవారు ప్రతిభను ప్రదర్శించడం ద్వారా కీర్తిప్రతిష్ఠలు పొందాలని భావించడం సహజం. ఏ రంగంలోనైనా తగినంత నైపుణ్యం వున్నపుడే పోటీ వాతవారణంలో రాణించడం, గుర్తింపు పొందడం సాధ్యమవుతుంది అన్నది యథార్థం. ప్రతిభా పాటవాలను ప్రదర్శించడంలో అందరూ తెలివిగా వ్యవహరించలేరు. వివేకంతో వ్యవహరించేవారు ప్రతిభకు తగ్గ గుర్తింపు, గౌరవాన్ని పొందగలుగుతారు. పొగడ్తలు, ప్రశంసలు నూతనోత్సాహాన్ని ఇస్తూ ప్రావీణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి దోహదం చేస్తాయి. అయితే, పొగడ్తల కోసం అర్రులు చాచడం అవివేక లక్షణం. ప్రజ్ఞకు తగిన గుర్తింపు పొందే క్రమంలో కొందరు తమను తామే పొగడుకుంటూ , తమకున్న ప్రతిభ అసామాన్యమైనదని స్వోత్కర్ష చేసుకుంటారు. అటువంటివారు తమ ప్రతిభను వ్యక్తపరచడంలో వివేకవంతంగా వ్యవహరించలేరు. ఇలాంటివారు ఎనె్నన్ని నైపుణ్యాలు కలిగి వున్నా ఆశించిన గౌరవం పొందలేరు సరికదా ఒక్కొక్కపుడు అపహాస్యం పాలవుతారు కూడా. ఆత్మస్తుతి మితిమీరితే విమర్శలను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ నిర్వహణలో గానీ, కళా రంగాల్లో గానీ ఎవరైనా గుర్తింపును ఆశిస్తే- ముందుగా వాళ్ళ గురించి వాళ్లు చెప్పుకోవడం మానేయడం వివేకవంతమైన పని. ఇతరులు తమ ప్రతిభ గురించి మాట్లాడుకునేలా ప్రవర్తనను హుందాగా మలుచుకోవాలి. తమ నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా మాటల ద్వారా కాకుండా పరోక్షంగా ప్రకటించాలి. ఎలాంటి ప్రచారం లేకుండా ప్రతిభను ఇతరులు గుర్తిస్తే తప్పకుండా మంచి ప్రచారం లభిస్తుంది. క్రియారూపంలో తమ నైపుణ్యాన్ని చాటుకోవాలే తప్ప, మాటలతో తమను తాము కీర్తించుకోవడం అవివేకం, అసందర్భం. ఇలాంటి చర్యల వల్ల ఆశించిన ప్రయోజనం చేకూరదు. వాస్తవానికి విద్వత్సంపన్నులు, ప్రతిభావంతులు ఆత్మస్తుతి జోలికి పోరు. నిరంతరం వారు చేసే పనిలో నైపుణ్యాల్ని చూపాలనే ప్రయత్నం చేస్తారు. కీర్తికాంక్ష అధికంగా వున్నవాళ్ళు మాత్రం సొంత ప్రచారం చేసుకుని ఇతరులను ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటివారిని ఎవరూ మనస్ఫూర్తిగా మెచ్చుకోరు. మెప్పును ఆశించేవారు ఇతరుల్లో వుండే ప్రతిభను అభినందించే ఉదార స్వభావం, మంచి లక్షణాలు కలిగి వుండాలి. కొందరు ఇతరుల్లో వుండే సామర్థ్యాన్ని కొనియాడితే తామెక్కడ తక్కువ కాబడతామనో అనే భావనతో వుంటారు. ఈ సంకుచిత స్వభావం వున్నవాళ్ళు ఎప్పుడూ కీర్తిని పొందలేరు. ఇక, అదేపనిగా పరులను నిందించే మనస్తత్వం ఉన్నవారు క్రమంగా వ్యక్తిత్వం కోల్పోతారు. దీనిని ఒక మానసిక రుగ్మతగా చెప్పవచ్చు. అందుకే ఆత్మస్తుతి వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఈ మనస్తత్వం వున్నవాళ్ళు సమయం, సందర్భం లేకుండా తమ గురించి చెప్పుకుపోతూ, వినేవాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోరు. ఇది ఒక అజ్ఞానం. వీళ్ళకు మార్కుల కన్నా రిమార్కులే ఎక్కువ. వీళ్ళ సొంత డబ్బా విన్నవాళ్ళు వీళ్ళ సమక్షంలో అభినందించినట్టు వున్నప్పటికీ పరోక్షంలో విమర్శిస్తారు. సందర్భోచితంగా మాట్లాడటం, పరనిందకు దూరంగా వుండడం ఎవరికైనా గౌరవాన్ని, గుర్తింపుని తెస్తుందని తెలుసుకోవడం వివేకవంతుల లక్షణం.

-రాజ్‌కుమార్