Others

చీకటి కూపంలో వెలుగు నింపేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యభిచార కూపంలో మగ్గిపోతున్న స్ర్తిలకోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్న సునీతా కృష్ణన్‌కి పద్మశ్రీ అవార్డు వచ్చిన సమయంలోనే ఇంకో వాదం కూడా తెరపైకి వచ్చింది. వాస్తవానికి కొంతకాలంగా తెరమీద ఉన్న వాదమే. మహిళా సంఘ నేతలు కూడా ఈ వాదాన్ని బలపరచడం ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ కొంత బాధపెడుతుంది. వేశ్యావృత్తిని చట్టసమ్మతం చేయాలని కొందరంటున్నారు. సుప్రీంకోర్టు కొంత మేరకు సానుకూలమైన తీర్పుని కూడా ఇచ్చింది.
వాదానికి అనుకూలంగా కారణాలు కూడా చెప్తున్నారు. వ్యభిచారిణిగా జీవించే స్ర్తికి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. తన వద్దకు వచ్చే విటుడి విషయంలో ఆమె జాగ్రత్తపడే పరిస్థితులు లేవు. ప్రాణాంతకమైన ఎయిడ్స్‌తో సహా అనేక రోగాల బారిన ఆమె పడవచ్చు. వేశ్యావృత్తి చట్టబద్ధమైన పక్షంలో ఆమె తన ఆరోగ్య విషయంలో బహిరంగంగా శ్రద్ధ తీసుకుంటుంది.
రెండవ కారణం పోలీసు వ్యవస్థకు సంబంధించినది. నెలకు లెక్క ప్రకారంగా కేసులు చూపించాలనే కారణంతో పోలీసులు బ్రోతల్స్‌లోని అమ్మాయిలను పట్టుకుపోయి బంధించి, నానా హింసలపాలు చేస్తారు. ఆ పోలీసులే తమకు అవసరమైనప్పుడు అమ్మాయిల శరీరాలను వాడుకోవడమూ జరుగుతుంది. వేశ్యావృత్తిలో ఉన్న వారికి శిక్ష పడినట్టుగా విటులను శిక్షించడం అరుదు.
మూడవ కారణం సెక్స్‌ట్రాఫికింగ్. చట్టవిరుద్ధమైన వృత్తిలో ప్రవేశించడానికి స్ర్తిలు ఇష్టపడరు. ఆడపిల్లలను ప్రేమ పేరుతోనో, ఉద్యోగం పేరుతోనే ప్రలోభపెట్టి మోసగించి వేశ్యావాటికలలో అమ్మివేసే వారికి కావాల్సినంత ఆదాయం. అవసరానికో, అత్యాశతోనో అమ్మాయిలను అమ్మే తల్లిదండ్రులు ఉన్నారు. (ఆడపిల్లలను అమ్మిన డబ్బుతో టీవీ కొనుక్కున్న తల్లిదండ్రుల గురించి వార్త కొనే్నళ్ల క్రితం వచ్చింది). సెక్స్‌ట్రాఫికింగ్ వృత్తిలో స్ర్తిలు కూడా ఉండడం చాలా విషాదకరమైన విషయం.
వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయాలనే వారు చెప్పని విషయం ప్రభుత్వాలకు నచ్చేదొకటున్నది. విజయనగర సామ్రాజ్యంలో వేశ్యలు చెల్లించే పన్ను రక్షక భటులకిచ్చే జీతాలకు సరిపోయేదట. ప్రస్తుతం మద్యం మీద వచ్చే ఆదాయమే ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్న ప్రభుత్వాలకు ‘వెలది’ మీద కూడా సంపాదించవచ్చునంటే సంతోషమే కదా!
ప్రభుత్వం ఆదాయ వనరుల సంగతి పక్కన పెట్టేయాలి. వేశ్యావృత్తి చట్టబద్ధమైతే అనేకమంది నిస్సహాయ స్ర్తిలకు న్యాయం జరుగుతుందంటున్నారు. నిజమేనా? వేశ్యావృత్తినీ, వ్యభిచారాన్నీ నిర్మూలించే చట్టం రాకముందు స్ర్తిల జీవితమెలా ఉండేది? ఆనాటి విషయాల గురించి మా అమ్మ చెప్తూ వుండేది. వేశ్యల జీవితం ఎలా ఉండేదో కానీ సాధారణ గృహిణుల జీవితం దుర్భరంగా ఉండేది. వివాహాలలో మేజువాణీలు అని జరిగేవి. వేశ్యలను పిలిచి గానా బజానాలు చేయించేవారు. ఆ సమయంలోనే సంపన్నులను తమ వలలో పడేసుకోవడం వేశ్యలకు ఆనవాయితీ. ఆలా ఒక వేశ్య పట్ల ఆకర్షితుడైన గృహస్థు ఇక ఇంటి మొహం చూడలేదు. ఇల్లాలు భర్తకోసం అల్లాడిపోయింది. ఆఖరుకి ఆమె మరణశయ్యపై ఉండి ‘ఒక్కసారి చూడాలని ఉంది’ అని కబురు చేసినప్పుడు కూడా ఆ రసిక శిఖామణి రాలేదుట. చివరకు ఏమైంది? ఆస్తి మొత్తం వశమయ్యాక వేశ్య అతన్ని గెంటేసింది.
మా అమ్మకు ఆశ్చర్యం కలిగించే విషయమొక్కటి ఎప్పుడూ తల్చుకునేది. వేశ్యాలోలుడి కుమార్తె మా అమ్మకు స్నేహితురాలు. ఆవిడ ఎప్పుడూ చిప్ప చేతికి వచ్చిన తండ్రిని విప్రనారాయణతో పోల్చుకుని బాధపడేది కానీ తల్లి గురించి దుఃఖించేది కాదట. ఈ మనస్తత్వాన్ని ఏమనాలి? తల్లికి అన్యాయం జరిగిందని కూతురే అనుకోకపోతే స్ర్తి జాతికి గతేమిటి?
ఇంకొక సంగతి కూడా మా అమ్మ చెప్పేది. వివాహమై సంతానం కూడా ఉన్న ఒకడు ఒకామెను ‘ఉంచుకున్నాడు’. అనేకమంది వేశ్యలవలె కాకుండా ఆమె డబ్బుతో సంబంధం లేకుండా అతనికే అంకితమైంది. అంతవరకూ సరే. ఇంటి ఇల్లాలి సంగతి ఏమిటి? వేశ్య కాలధర్మం చెందాక కానీ భర్త ఇంట్లో ఉండడం జరగలేదు. ఆ మాత్రానికే ఆమె పొంగిపోయింది.
తమ వద్దకు వచ్చే విటుల సర్వస్వం దోచుకునే వేశ్యలకు కొదవ ఉండేది కాదు. ‘ముక్కారుంబండు నఖండ సేతున్నతముల్ కాశ్మీర ఖండంపుకేదారంబుల్’ తెగనమ్మితిని కదా అని తమ్ముడు నిగమశర్మ విషయంలో అక్క బాధపడిందట. విల్లుపుత్తూరి వేశ్యలు పాపం చాలా మంచివాళ్లు. తమ వద్దకు వచ్చే విటులు దివాలా తీస్తే ఆదుకునే వారు. వేశ్యలవల్ల సంసారాలు సర్వనాశనం కావడం గమనించిన వీరేశలింగం పంతులు గారి వంటి సంఘసంస్కర్తలు మేజువాణీలకు వ్యతిరేకంగా పోరాడారు. ఎందరో కష్టపడ్డ తర్వాతనే సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఆక్ట్ వచ్చింది. ప్రస్తుతం ఆ చట్ట నిర్మూలన కోసం కొందరు ఉద్యమిస్తున్నారు.
ఇక్కడే స్ర్తిలందరు ఆలోచించాల్సిన విషయముంది. వేశ్యావృత్తిని చట్టబద్ధం చేస్తే ధైర్యంగా హాయిగా వేశ్యలు విటులనుంచి ఆర్థిక లాభం పొందవచ్చును. ఇంటి ఇల్లాళ్లు కృంగి కృశించిపోతారు. వేశ్యావృత్తిని చట్టవిరుద్ధం చేస్తే అమాయకపు ఆడవాళ్లు నిస్సంకోచంగా బ్రోతల్స్‌లో మగ్గిపోతారు. ఏ పద్ధతిలోనైనా విటులకు నష్టంలేదు.
ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? వృత్తిలో ఉన్న వేశ్యలను వదిలిపెట్టి వారి వద్దకు వచ్చే విటులకు మాత్రమే శిక్షపడే చట్టం ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి చట్టం రావడానికి మగవాళ్లు ఇష్టపడరు సరే మహిళలైనా ఇష్టపడతారా? ‘ఆకాశంలో సగం’ అయిన ఆడవాళ్లలో సగం సతీసుమతిని ఆరాధ్య దేవతగా చూస్తారు. మిగిలిన సగమో, పావో, పరకో అయిన స్ర్తివాదులు ఏకపత్నీ వ్రతుడైన శ్రీరామ చంద్రుని దూషించడమే జీవిత ధ్యేయంగా పెట్టుకుంటారు.‘రాయవేశ్యా భజంగ’ అన్న బిరుదముండడం, ఆదిల్షాను గెలవడం కన్న ఆడదాన్ని గెలవడం గొప్ప అనుకునే పాలకులేలిన భూమి మనది. చట్టబద్ధమైనా, చట్టవిరుద్ధమైనా స్ర్తి జాతికే నష్టమని స్ర్తిలందరూ గుర్తించిన నాడే కొత్త చట్టాలు రాగలవు.

-పాలంకి సత్య