సబ్ ఫీచర్

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ సరిహద్దుల్లో భద్రతను పర్యవేక్షించే కీలక బాధ్యతలను తొలిసారిగా ఓ మహిళ స్వీకరించబోతోంది. రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన 24 ఏళ్ల తనూశ్రీ పరీఖ్ సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) అధికారుల శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందేందుకు ఎంపికై సరికొత్త రికార్డును సృష్టించారు. శిక్షణ అనంతరం ఆమె అసిస్టెంట్ కమాండర్‌గా బాధ్యతలు చేపడతారు. బిఎస్‌ఎఫ్‌లో నేరుగా అధికారి హోదాలో ఓ మహిళ నియామకం పొందడం ఇదే ప్రథమం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం తనూశ్రీ టెకాన్పూర్ (గ్వాలియర్ జిల్లా, మధ్యప్రదేశ్)లోని బిఎస్‌ఎఫ్ అధికారుల శిక్షణ అకాడమీలో చేరారు. శిక్షణ కోసం ఎంపికైన 64 మంది సభ్యులున్న బ్యాచ్‌లో తనూశ్రీ ఒక్కరే మహిళ కావడం విశేషం. ఈ బ్యాచ్‌లోని వారంతా 52 వారాల పాటు శిక్షణ పూర్తి చేసిన తర్వాత సరిహద్దు భద్రతా దళంలో అసిస్టెంట్ కమాండంట్లుగా నియమితులవుతారు. సుమారు రెండున్నర లక్షల మంది సిబ్బంది ఉన్న బిఎస్‌ఎఫ్‌లో నేరుగా అధికారి స్థానాన్ని కైవసం చేసుకున్న తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.
ఎంచుకున్న రంగంలో...
ఉమ్మడి కుటుంబాల్లో పెరిగిన పిల్లలు విద్య, ఉద్యోగ రంగాల్లో బాగా రాణిస్తారని తనూశ్రీ చెబుతుంటారు. వెటర్నరీ వైద్యుడిగా పనిచేసే తన తండ్రికి అయిదుగురు సోదరులున్నారని, ఉమ్మడి కుటుంబం కావడంతో ఆత్మీయతానురాగాలు ఎంతో మధురంగా ఉంటాయని ఆమె అంటారు. బికనీర్, సుజన్‌గఢ్‌ల్లోని సోఫియా స్కూల్, ఆదర్శ్ విద్యామందిర్‌లో ఉపాధ్యాయులు తనను ఎంతగానో ప్రోత్సహించేవారని ఆమె అలనాటి జ్ఞాపకాలను వివరిస్తుంటారు. కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా తన తండ్రి ఎస్‌పి జోషి ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా తాను ఎంచుకున్న రంగంలో చేరేందుకు అండగా నిలిచారని ఆమె తెలిపారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉన్నపుడు పిల్లలు వారి కలలను సాకారం చేసుకునే వీలుంటుందని అంటారు.
బికనీర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాక యుపిఎస్‌సి 2013లో నిర్వహించిన ‘సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్’ (సిఎపిఎఫ్) పరీక్షలో నెగ్గి బిఎస్‌ఎఫ్‌కు ఆమె ఎంపికయ్యారు. బిఎస్‌ఎఫ్‌లో కమాండంట్ పోస్టుకు ఎంపిక కావడం ఆనందం కలిగించినప్పటికీ, ‘తొలి మహిళ’ అంటూ కీర్తించడం కొంత ఇబ్బందికరంగా ఉందని ఆమె అంటున్నారు. ఏ మహిళ ఎంతటి ఘనతను సాధించినా సమాజం అందుకు గర్విస్తుందని ఆమె అంటారు. ముందుగా మనమంతా మానవులమని, మహిళలు, పురుషులు అంటూ విడదీసి చూడడం భావ్యం కాదని తనూశ్రీ తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు. సమాజంలో ఇలాంటి భావజాలం అంతం కావాలని, శారీరక, మానసిక బలంలో మహిళలు పురుషులకు ఎంతమాత్రం తీసిపోరని ఆమె అంటారు. దేశసేవ చేసేందుకు అసిస్టెంట్ కమాండంట్ హోదా మంచి అవకాశం అని, భవిష్యత్‌లో ఐపిఎస్‌లో చేరాలన్నదే తన చిరకాల వాంఛ అని ఆమె చెప్పారు. తన కుమార్తె బిఎస్‌ఎఫ్‌లో చేరడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, సరిహద్దు సమస్యలున్న రాజస్థాన్‌లో ఆమె సేవలందిస్తే సొంత రాష్ట్రం రుణం తీర్చుకున్నట్లవుతుందని తనూశ్రీ తండ్రి జోషి అంటున్నారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా విద్య, ఉద్యోగ రంగాల్లో మగపిల్లలతో సమానం వారిని ప్రోత్సహించాల్సి ఉందని తనూశ్రీ విజ్ఞప్తి చేస్తున్నారు. ‘బిఎస్‌ఎఫ్‌కు ఎంపికైన తొలి అధికారిణి’ అంటూ ఎవరైనా ప్రశంసిస్తే ఇబ్బంది పడతానని, పేద కుటుంబాల్లో ఆడపిల్లల్ని చదివిస్తే ఎంతగానో సంతోషపడతానని ఆమె అంటారు.
సరిహద్దు భద్రతా దళంలో మహిళలను నియమించేందుకు 2013లో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానిస్టేబుల్ వంటి కింది స్థాయి ఉద్యోగాల్లో మహిళలు చేరుతున్నా నేరుగా కమాండంట్ స్థాయి పోస్టులకు ఇంతవరకూ ఎవరూ ఎంపిక కాలేదు. ప్రస్తుతం బిఎస్‌ఎఫ్‌లో సుమారు రెండువేల మంది మహిళా కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. గత ఏడాది ఐపిఎస్ అధికారిణి సత్వంత్ అత్వాల్ త్రివేది సరిహద్దు భద్రతా దళంలో డిప్యుటేషన్‌పై డిఐజి హోదాలో చేరారు. బిఎస్‌ఎఫ్ సిబ్బంది ప్రధానంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను నివారించేందుకు కృషి చేస్తుంటారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోను, దేశ అంతర్గత భద్రతకు సవాళ్లు ఎదురైన చోట్ల కూడా బిఎస్‌ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) 2014లో నిర్వహించిన రాతపరీక్షలో ఉత్తీర్ణత పొందిన తనూశ్రీ బిఎస్‌ఎఫ్ అకాడమీలో శిక్షణ పొందేందుకు అర్హత సాధించారు.
chitram...
తల్లిదండ్రులు, సోదరితో..

-లలిత