Others

చుంబన సంబరాలపై కనె్నర్ర! (వార్త - వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ హైద్రాబాద్ విశ్వవిద్యాలయంలో ఆమధ్య రేకెత్తి జనాల్ని సంభ్రమాశ్చర్య చకితుల్ని చేసిన బహిరంగ చుంబన సంబరాల్ని నేరుగా ఖండించారు. ఈవారం అసెంబ్లీలో సి.ఎం. ఇలా ప్రస్తావించడంతో ఉలిక్కిపడ్డారంతా. మరొక్కసారి అందరి దృష్టీ అటు పడింది.
2014 చివరిలో ఈ ముద్దుల బహిరంగ ప్రత్యక్ష ప్రదర్శనలు- మొదట కేరళలోని కొచ్చి విశ్వవిద్యాలయం నుంచి మొదలై ఒక్క హైదరాబాద్ అనే కాదు ఢిల్లీ, ముంబాయి, కలకత్తా, చెన్నై, కాలికట్ మొదలైన ఉన్నత విద్యా సరస్వతీ నిలయాలన్నింటా ఒక అంటువ్యాధిలాగా చెలరేగిపోయింది.
ప్రేయసీ ప్రియులు కూడా కాని పరాయి యువతీ యువకులు జంటలుగా కొండొకచో గుంపులు గుంపులుగా నూతన ఆంగ్ల సంవత్సరాది వేడుకల జాతరలాగా చుంబన సంబరాలు చేసుకుంటూ- పోలీసుల్నీ, చట్టాల్నీ ధిక్కరించేస్తూ వుంటే ‘‘ఆ ‘ప్చ్.. ప్చ్..’ల ఘోషకి ‘ప్చ్ ప్చ్..’ అయ్యో..’’ అంటూ సభ్య ప్రపంచం ముక్కున వేలేసుకుని దూరంగా తొలగిపోయింది. నటీనటులు సినిమా తెరకోసం ముద్దులు కురిపిస్తేనే- సెన్సారు కత్తిరించేయాలి అంటూ గోలెట్టాం. ఈ లైవ్ షోలని ఏం చెయ్యాలి? అన్నది తల్లిదండ్రుల గుండెల్లో బడబానలమే అయింది. ‘ఎంజాయ్’ అన్నారు యువతరం కొందరు.
గత శతాబ్దంలో చివరి దశాబ్దాలలో విశ్వవిద్యాలయ జీవిత యదార్థ చిత్రణ చేస్తూ, నవలలు రాసి ప్రశంసల దండలతో మురిసి తడిసిన నాకే- యివాళ్టి యదార్థాల్ని లీల మాత్రంగానైనా నవలల్లో చిత్రించగలనా? ఎవరేనా గలరా? అలా చేస్తే అమ్మా నాన్నలన్న వాళ్లు ‘వీపు’ సాపు చేసేస్తారేమో నన్న భయం వేసింది. ‘‘వూరేగింపులు, ప్రదర్శనలు ఆడా మగా సాయిలా ఫాయిలా సాగించడానికేనా? విజ్ఞాన సముపార్జనకీ, సంక్షేమ సంఘానికీ ‘దీపధారులు’ కావడానికి తర్ఫీదు యిచ్చేవి కావా విశ్వవిద్యాలయాలు?’’ అంటూ అసెంబ్లీ లోపల తొలిసారి ప్రస్తావన రావడం ‘తర్జని’ చూబెట్టి మరీ మనల్ని లేపిన ఒక్క గొప్ప వార్తే-
‘‘విశ్వవిద్యాలయాలని శుభ్రం చేస్తాం’’ అంటూ ముఖ్యమంత్రి ‘తగిన వైస్ ఛాన్సలర్‌లను వేసుకొనే అనుమతి కూడా మా గవర్నర్ దగ్గరనుంచి తీసుకున్నాం. వి.సి.లకోసం వెదుతున్నాం’’ అంటూ ప్రకటించారు. సుదినం! ‘‘అసలు బహిరంగంగా మేం ముద్దు పెట్టుకుంటే తప్పా?’’ అని విద్యావంతులయిన పడుచు పిల్లలు నిస్సిగ్గుగా నిలదీస్తూ వుంటే?... అది సరే.. బహిరంగ ‘అశ్లీల ప్రవర్త’నని అరికట్టే చట్టం వుంది. జైలుశిక్ష, జరిమానాలు కూడా వున్నాయి. కాని పబ్లిక్‌గా ముద్దెట్టుకోవడం- అది ఏ యిద్దరిమధ్యనైనా జరిగితే దాన్ని ‘అశ్లీలం’ అనీ, ఒబ్సినిటీ అని నిర్ణయించి సదరు జంటల్ని- గ్రూపుల్ని మూసెయ్యవచ్చా? యిదీ నిఖార్సుగా లీగల్‌గా తేలాల్సిన ప్రశ్న- మోరల్ పోలీసులైనా, నిజం పోలీసులైనా, పేరెంట్స్ అయినా మీడియా అయినా ఈ సంగతి తేల్చుకోవాలి. కె.సి.ఆర్. రంగంలోకి దిగితే- ‘‘క్యాంపస్ లైఫ్ క్లాసు రూముల్లోకి మళ్లుతుందా?’’ అనడిగిందో వెర్రిబాగుల తల్లి.. ‘హోప్ సో’ అన్నాడో పిచ్చి తండ్రి. ‘‘అలా ప్రార్థిద్దాం’’ అన్నదో గడసు బామ్మగారు.
కారున్న ‘‘ముష్టి మారాజు!’’
‘‘పాపం! ముష్టివాడు ఓ కుక్కనీ, బొచ్చనీ పెట్టుకుని అడుక్కుంటూ వున్నాడు’’ అని నైరుతి లండన్‌లో ఖరీదైన ‘న్యూక్వే’ ప్రాంతంలోని రెస్టారెంట్లనుంచి బయటకు పోయేవాళ్లంతా అతనికి కాసులు, కానుకలు, తిండి పదార్థాలు కూడా యిస్తున్నారు. జాలిపడుతూ వెళ్తున్నారు.. సాయంకాలానికి ఆ ముష్టివాడు పైకం అంతా సర్దుకుని ‘పార్కింగ్ జోన్’లోకి వెళ్లి తన ఆడి కారుని బయటకు తీసి, కుక్కని కూడా ఎక్కించుకుని యించక్క డ్రయివ్ చేసుకుపోతాడు రోజూ! ఆడీ కారుతో రుూ యాచక చక్రవర్తి ఫొటో తీసి ఎవరో ఫేస్‌బుక్‌కి ఎక్కించారు. కోటి రూపాయల ఖరీదు చేసే కారున్న ఆసామి ఫుట్‌పాత్‌మీద భిక్షాటనం చేస్తూ జనాల్ని ‘దోపిడీ’ చేస్తున్నాడనీ, మోసపోయామనీ అనుకున్న కొందరు అతని కారు అద్దాలు పగులగొట్టారు. అతణ్ణి నాలుగు పీకారు.. పోలీసులొచ్చారు.
‘‘సార్! కటిక బిచ్చగాణ్ణి సార్! ఈ కారుని మా నాయనమ్మ నాకు బహుమతిగా యిచ్చింది సార్’’ అన్నాడు.
‘‘జనం చావగొడతార్రా’’ అని పోలీసులు వార్నింగ్ యిచ్చారు. అయితే వారానికి రెండు వేల అయిదొందల పౌండ్ల ఆదాయం వున్న ముష్టి ‘వృత్తి’ని వదలలేక మాథ్యూ బ్రింటన్ రుూమధ్య కారు లేకుండా వచ్చి, ఫుట్‌పాత్‌ని దర్జాగా ఆక్రమించుకున్నాడు. ‘‘కారు దొంగలెత్తుకుపోయారన్నాడు’’. మళ్లీ కథ మామూలే.
‘‘పోనీలే ముష్టివాడు, గంజాయి దమ్ముకి అలవాటు పడ్డ పిచ్చోడు’’ అంటూ జనాలు వాడికి బొచ్చెలో నాణాలు వేస్తూనే వున్నారు. కారేదిరా? అంటే దొంగలెత్తుకుపోయారు అంటాడు. ఇటువంటి ఘరానా ముష్టివాళ్లు ఇండియాలోనైతే మరీ యిదిగా వుంటారు. వడ్డీ వ్యాపారం చేస్తారు. బ్యాంకు అకౌంట్‌లు పెట్టుకుంటారు. కొంచెం అంగవైకల్యం వున్నా లేకపోయినా- తెచ్చిపెట్టుకుని దోచేసుకుంటున్నారు జనాల్ని. అరవై నాలుగు కళల్లో ముష్టి ‘కళ’ ఒకటి మన వాళ్లకి- అవునా?’’ కానీ ఇంగ్లాండులో కూడా రుూ బ్రింటన్‌ని ‘ప్రొఫెషనల్ బెగ్గర్’ అనే అంటున్నారు. టాక్స్‌లేని బిజినెస్ అనొచ్చా? వాడిది. వాడో సెలబ్రిటీ యిప్పుడు.
దుర్గమ్మ కొండమీద
డ్రెస్ కోడ్!
ఆర్.ఎస్.ఎస్. డ్రస్ కోడ్ మారింది. ‘టైలర్లు కావలెను’ అంటూ పరుగులు తీస్తున్నారు వాళ్లు. అదే సమయంలో అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక బెజవాడ దుర్గమ్మ వారి దేవాలయ ప్రాంగణం మొత్తం - ఇంద్రకీలాద్రి మీది అర్చకులు, సిబ్బందీ, నౌకర్లు, చాకర్లూ- అంతా అధికారులు పురమాయించిన దుస్తులను మాత్రమే ధరించి గుర్తింపు కార్డులతో గర్భగుడిలోనూ, బయటా కూడా విధులకు హాజరు అగుడు’’ అన్నది తాఖీదు సారాంశం!
‘‘రెడ్ లేదా యెల్లో కలర్స్ నహీ నహీ’’ అంటూ ధవళవస్త్ర దుస్తులే మగాళ్లు, ఆడాళ్లు సీదా సాదా చీరలే.. పూజారులకు తెల్లని ధోతీ, కండువా తప్పనిసరి. క్షురకులైనా తెల్ల పంచె తెల్ల బనీను మస్టు, సానిటరీ స్ట్ఫాకి కూడా అలాగే దుస్తులున్నాయి. ఇక భక్తులకా? తమిళనాడు కాదు కదా యిది ఆంధ్ర గదా? సో ‘నో డ్రెస్ కోడ్!’

బెడిసికొట్టిన ‘నిప్పుల నడక’
శ్రీరామనవమి పందిళ్ళలో, పీర్ల పండగ సందర్భాలలో భక్తులు పరవశంతో అగ్గిగుండాలు తొక్కుతూ అట్నుంచి యిటు నడకలు సాగించటం యిప్పటికీ చూస్తూనే వుంటాం. ఇటువంటి నిప్పులమీద నడక కర్నాటకాలోని ‘మారమ్మ’ అనే గ్రామదేవత జాతరలో బెడిసికొట్టింది.
బెత్తినహెళ్లి అనే గ్రామంలో వేలాది భక్తులు రద్దీలో తెల్లారగట్ల నాలుగున్నర గంటలవేళ ‘అగ్గిగుండం’ మీద నడక మొదలైంది. ఏకంగా మూడు వందలమంది మారెమ్మ పూనకంతో బారులు తీసి నిప్పులమీద నడకకి సన్నద్ధం అయ్యారు. ‘గుండం’ ఎనిమిది అడుగుల లోతు, నలభై అడుగుల పొడవూ వుంది. కణకణమండే నిప్పు కణికలమీదకు దిగి- భక్తులు తడికాళ్ళతో అవతలి తట్టుకి దుముకుతూ వుండగా, కొందరు పెరుగు, తేనె తెచ్చిన ప్లాస్టిక్ సంచుల్ని గుండంలో పడేశారు (ఇది మనకి అలవాటేగా?). అవి కాలి, కరిగి భక్తుల పాదాలకు అంటుకుపోయి, వాళ్లు నిప్పులమీదే తడబడి పడిపోయారు. వెనుక ‘క్యూ’లో వున్న వాళ్లు వీరి మీదికి వేగం ఆపుకోలేక తూలి కుప్పగా పడిపోయారు. డెబ్భయి, ఎనభై మంది భక్తుల ఒళ్లు కాలిపోయింది. టుంకూరు ఆసుపత్రి ‘మారమ్మా మారమ్మా’ అంటూ క్షతగాత్రులు ‘హా హా కారాలతో’ నిండిపోయింది. జాతరలలో, అగ్గిగుండంలో అడ్డమైన చెత్తా పడేయరాదు. అంతేగాని అమ్మవారి మహిమ పోయి కాదు. యిలా జరిగింది అన్నారు చాలామంది. అవును మరి, లేకపోతే సజీవ దహనం అయిపోయేవాళ్లే అన్నారెందరో- నమ్మకమేగా? దేవుడు అంటే!

-వీరాజీ