మెయిన్ ఫీచర్

చిట్టి గువ్వా! చిరునామా ఎక్కడ? ( 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లోని చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసినా ఇంటి చూరుల్లో, గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్లు తెరవగానే కనిపించే ఈ జంట చిట్టి గువ్వలు చేసే కిచకిచలు నేడు పల్లెల్లోనే కరువైంది. అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చుకోవాలనే తాపత్రయంలో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటుచేస్తున్న సెల్‌టవర్లు ఈ చిన్నారి నేస్తాలకు మరణశాసనాన్ని రాస్తున్నాయి. పర్యావరణాన్ని తన శక్తిమేరకు కాపాడే పిచ్చుకలను రక్షించేందుకు పక్షుల ప్రేమికులు ప్రత్యేకంగా వీటికోసం అనే్వషించే పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఎంతో బాధాకరం. మన ఇంటిలో మనతో పాటు ఉండే ఈ చిట్టి గువ్వలు ఇంట్లో క్రిమికీటకాలు కనిపించాయంటే గుటుక్కున మింగేసి మనల్ని వీటిబారి నుంచి కాపాడతాయి. గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం తోడుంటామని మన చెంతనే ఉంటాయి. పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునేందుకు ప్రత్యేకంగా నడుం బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
సన్నగా ఉన్నవారిని ఊరపిచ్చుక ప్రాణమని, ఇంటిపై ఉన్న చిన్న గోడలను పిట్టగోడలని, చిన్న ప్రాయంలోనే ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తే, పిట్ట కొంచెం కూతఘనమని పొట్టి పొట్టి కథలు చెప్తుంటే పిట్టకథలని, డాబుసరి మాటలు చెప్తుంటే పిట్టలదొరని, ఆడవారి అందమైన నడుముని పిట్ట నడుమని, నవ్వుని కిలకిలారావాలని- ఇలా మానవుడు వల్లించడానికే కాని మన ఇంటి, ఊరి పక్షుల మనుగడను పట్టించుకునే తీరికేది. ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో కనిపించే పిచ్చుకలు నేడు అంతరించిపోతున్నాయి. కాలంతో పోటీపడడం, సాంకేతిక ఫలాలను అందిపుచ్చుకోవడం- ఇదే లక్ష్యంతో మానవులు చేస్తున్న పనులువల్ల పిచ్చుక జాతి పూర్తిగా అంతరించుకుపోయే పరిస్థితి నెలకొంది. మనిషి తన మనుగడ తాను చూసుకుంటూ మిగతా పరిసరాలను, జీవజాలాన్ని విస్మరిస్తున్నాడు. పిచ్చుకమీద మనం ప్రయోగిస్తున్న బ్రహ్మాస్త్రాలు పక్షి జాతి నిర్వీర్యం కాకుండా కాపాడుకోడమెలాగో చూద్దాం...
* పక్షులకు ఆవాసాల కొరతొచ్చి పడింది. నగరాలు, పట్టణాల్లో అపార్ట్‌మెంట్ల కారణంగా పెంకుటిళ్లు సాంప్రదాయ గృహాలు కనుమరుగవుతున్నాయి. దీంతో పిచ్చుకలు గూళ్లు పెట్టుకునేందుకు చోటే దొరకడంలేదు, ఇంతేకాదు చెట్లు కూడా అంతరించిపోతున్నాయి. రణగొణధ్వనులు, ఉరుకుల పరుగుల జీవితాలమధ్య ఇక పిట్ట గోడు ఎవరు పట్టించుకుంటారు? ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్లు పెంచితే పచ్చదనం, ఆరోగ్యం, పక్షుల కిలకిలరావాలు మన సొంతం అవుతాయి.
* నిజానికి రైతన్నకి పిట్ట తినే పిడికెడు గింజలు ఏపాటి నష్టం కలిగిస్తాయి. పైగా పొలాల్లో క్రిమికీటకాలపై వాలి సహాయమే చేస్తాయి. పొలాల్లో పురుగు మందులు క్రిమి సంహారకాలు జల్లేస్తున్నారు. ఇక ఆ కళ్లాలలో స్వచ్ఛమైన గింజలెలా దొరుకుతాయి. ఇక క్రిమి కీటకాలు సరేసరి. ఖాళీ స్థలాల్లో పచ్చిక మైదానాలున్నా అందులో పురుగు పుట్రా వెతుక్కుంటూ కాలం గడిపేసేవి పిట్టలు- కానీ రియల్ ఎస్టేట్ రంగం దూకేసిందిగా.
* మనం అలవాటుపడ్డ ఇన్‌స్టెంట్ ఆహార పదార్థాలు, వంట సరుకులు వెరసి పిట్ట కడుపు కొట్టాయి. ఆశ్చర్యంగా వున్నా ఇది వడ్లగింజలో బియ్యం గింజ ఉంటుందన్నంత నిజం. ఇదివరకు కిరాణా షాపు నుంచి తెచ్చుకున్న బియ్యం, పప్పుల్ని చేటతో చెరిగి శుభ్రం చేసేవారు. ఇప్పుడు సూపర్ మార్కెట్ల పుణ్యమా అని అలాంటి పనులేవీ లేనప్పుడు ఇక పిచ్చుకలకు నాలుగు గింజలెలా దొరుకుతాయి? అంగీకరించేవారు రోజూ గుప్పెడు గింజలను ఇంటి వాకిట్లో, బాల్కనీలో లేదంటే డాబా మీదో పిచ్చుకల కోసం వేస్తే ఆ మూగ జీవాలను కాపాడినవాళ్ళమవుతాం.
* నగరాలు, పట్టణాలు శరవేగంగా విస్తరిస్తున్నందున పక్షులకు గూళ్లు పెట్టుకునేందుకు జానెడు జాగా కూడా కరువైపోతోంది. పైగా కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవం వీటి చావుకొచ్చింది. సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ పక్షులకు ఉరితాళ్లు బిగుస్తున్నాయి. ఎక్కువగా బలవుతున్నవి కాకులు, గబ్బిలాలు, పిచ్చుకలే.
* వాహన కాలుష్యం, దుమ్మూ ధూళితో ఈ మూగజీవిని దేవుడు కాదు మనిషే కాపాడాలి. ఈ రోజు ‘ప్రపంచ ఊరపిచ్చుకల దినోత్సవం’ సందర్భంగానైనా మనం చేయాల్సిందల్లా...
* మన నివాసం చుట్టూ ఎక్కడ అనువుగా వున్నా మొక్కలు, చెట్లు పెంచడం.
* ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లలో పక్షుల ఆశ్రయం కోసం ఆవాసాలు, బర్డ్ ఫీడర్లు ఏర్పాటుచేయడం. మూగజీవాల కోసం గుప్పెడు ధాన్యం గింజలు జల్లడం
* ముఖ్యంగా వేసవిలో పక్షులు తాగేందుకు మట్టికుండీల్లో కాసిని నీళ్లు పోసి అమర్చడం.
కాంక్రీట్ భవనాలతో నిండిన పట్టణాలలో పిచ్చుకలను చూసి కొనే్నళ్లు అయిందంటే అతిశయోక్తి కాదు. పల్లెలకు సైతం విస్తరించిన సెల్‌టవర్ల వల్ల అక్కడ కూడా అడపాదడపా ఎక్కడో చెట్లకు గూడుకట్టుకుని మనుగడ సాగిస్తున్నాయి. మన పిల్లలకు చూపించటానికి సైతం ఈ చిట్టి నేస్తాలు కరువైపోయాయి. చివరకు పిల్లలకు బొమ్మలను చూపించి పిచ్చుక ఇలా ఉంటుందని తృప్తిపడే రోజులు రావద్దని కోరుకుందాం.

-హర్షిత