మెయిన్ ఫీచర్

ఈ కాలపు ‘శ్రీమంతులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఊరు నుంచి ఎంతో తీసుకున్నాం.. తిరిగి ఇవ్వకపోతే లావెక్కిపోతాం.. సొంత ఊరి బాగు కోసం ఎంతో కొంత త్యాగం చేయాల్సిందే..’ అంటూ ఇటీవల ‘శ్రీమంతుడు’ సినిమా గ్రామాలను దత్తత తీసుకోవాలంటూ గొప్ప సందేశం ఇచ్చింది. ఊరిని ఉద్ధరించేవారే అసలైన ‘శ్రీమంతులు’ అంటున్న ఆ సినిమా గురించి తెలియకముందే- కొంతమంది యువతీ యువకులు సేవాభావంతో ముందడుగు వేశారు. విదేశాల్లో భారీ సంపాదన, విలాస వంతమైన జీవితం, మంచి హోదా.. ఇవేవీ వారికి నిజమైన సంతృప్తిని ఇవ్వలేదు. మంచి జీతభత్యాలు, సుఖసంతోషాలను తృణప్రాయంగా వదిలేసి, సొంత ఊరుని బాగుపర్చాలన్న తపనతో వారు సొంతగడ్డకు చేరుకుని ఇతరులకు స్ఫూర్తిదాతలుగా నిలిచారు. ఉన్నత చదువులు చదివినప్పటికీ, ఊరిని బాగుపర్చడం కోసం వారు నడుం బిగించారు.
జీవితం అంటే ఇదే..
అయిదంకెల జీతం.. అవస్థలు లేని జీవితం.. అయినా అతడిలో ఏదో అసంతృప్తి.. ప్రభుత్వ యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఫర్మాన్ అలీ ఊరి జనం కోసం ఏదైనా మంచిపని చేయాలన్న సంకల్పంతో ఉద్యోగాన్ని వదిలేశాడు. రాజస్థాన్‌లో తన స్వగ్రామమైన అల్వార్‌కు చేరుకుని పేద విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఓ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించాడు. ఫర్మాన్ అలీ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఎంఎ హిందీ, ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి పూర్తి చేశాడు. మొదట ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ కళాశాలలో ఆ తర్వాత రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో హిందీ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ‘ఉన్నత చదువులకు, సిరిసంపదలకు లోటు లేదు.. అయినా ఏదో వెలితి.. జీవితం అంటే ఇది కాదు.. సొంత ఊరి కోసం ఏదో చేయాలి.. గ్రామంలోని మిగతావారు కూడా బాగుపడాలి..’ ఈ ఆలోచనలతో అతను ఉద్యోగానికి రాజీనామా చేసి అల్వార్‌లో అడుగుపెట్టాడు. విద్య, ఉపాధి రంగాల్లో వెనుకబడిన తన ఊరి యువత కోసం 2009లో ఫర్మాన్ ‘రాజస్థాన్ ఇనిస్టిట్యూట్’ పేరిట కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించాడు. మనసుకి నచ్చిన పనిచేయాలంటూ తండ్రి చూపిన మార్గంలో సొంత ఊరికి వచ్చిన ఫర్మాన్‌ను చూసి మొదట్లో కొందరు ఎగతాళి చేశారు. అయినా, అతను వెనుకంజ వేయకుండా తమ ఊరికి చెందిన యువతీ యువకులు మంచి ఉద్యోగాలు సంపాదించేలా కృషి చేయడం ప్రారంభించాడు. అనతికాలంలోనే ‘రాజస్థాన్ ఇనిస్టిట్యూట్’కు ఆ ప్రాంతంలో మంచిపేరు వచ్చింది. క్రమంగా విస్తరించడంతో ఇపుడు ఆ సంస్థలో 3,500 మంది విద్యార్థులు, 20 మంది అధ్యాపకులు, 32 మంది ఇతర ఉద్యోగులు ఉన్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తన వద్దకు భారీ సంఖ్యలో వస్తున్నప్పటికీ నామమాత్రపు ఫీజు వసూలు చేస్తూ పేద వర్గాలకు ఫర్మాన్ అండగా నిలిచాడు. ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు, కుటుంబ పెద్దలు లేని విద్యార్థులకు, వికలాంగులకు ఉచితంగా కోచింగ్ ఇస్తూ అతను తన సేవాభావాన్ని చాటుకుంటున్నాడు. పేద,్ధనిక,మతం,కులం వంటి భావజాలానికి అతీతంగా అన్ని వర్గాల పిల్లలకు కోచింగ్ ఇవ్వడం తన ధ్యేయమని అంటారు. తీరిక సమయాల్లో గ్రామాల్లో పర్యటిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను కలుసుకుంటూ చదువు, కెరీర్ గురించి సూచనలిస్తుంటారు. డబ్బు లేకపోయినా ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాలు పొందవచ్చన్న నమ్మకాన్ని పేద విద్యార్థుల్లో కలిగించడమే తన ధ్యేయమని ఫర్మాన్ చెబుతుంటారు. అతడి భార్య కూడా పల్లెలకు వెళుతూ మహిళలను చైతన్యపరుస్తుంటారు. ఆరోగ్యం, పరిశుభ్రత, ఆర్థిక క్రమశిక్షణ వంటి విషయాలపై గ్రామీణ మహిళలకు అవగాహన కల్పిస్తుంటారు. నిరుపేదల వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేస్తుంటారు. ఇంతగా సేవ చేస్తున్నప్పటికీ విరాళాలు సేకరించేందుకు ఫర్మాన్ ఏనాడూ దాతలను ఆశ్రయించలేదు. కోచింగ్ సెంటర్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేస్తుంటారు. గంటల తరబడి పాఠాలు చెప్పడం, గ్రామాలకు వెళుతూ జనం సమస్యలు తెలుసుకోవడం, బాధల్లో ఉన్నవారికి చేతనైనంత సాయం చేయడం తప్ప ఫర్మాన్‌కు మరో వ్యాపకం లేదు. చదువులు, ఉపాధి కల్పనకు ప్రభుత్వమే కాదు, సమాజంలో అందరూ బాధ్యత వహించాలని ఆయన సూచిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, ప్రమాణాలు లేనందున ప్రైవేటు విద్యాసంస్థల ఆధిపత్యం కొనసాగుతోందని, వీటిని అందుకోలేని పేదవర్గాల పిల్లలను ఆదుకోవడమే తన ఏకైక లక్ష్యమని ఫర్మాన్ అంటారు.
‘సాఫ్ట్‌వేర్’ నుంచి సాగుకు..
అమెరికాలో భారీ జీతం లభిస్తున్నప్పటికీ సొంత ఊరికి ఏదైనా చేయాలన్న తపనతో ఆమె ఉద్యోగాన్ని వదిలేసి మేలైన ఆహార ధాన్యాల ఉత్పత్తిపై దృష్టి సారించారు. కర్నాటకలోని విజయపుర జిల్లాకు చెందిన కవితకు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఎలాంటి సంతృప్తిని ఇవ్వలేదు. పల్లె ప్రాంతాల వారికి మంచి పోషకాలున్న ఆహారం దక్కాలన్న తలంపుతో ఆమె సొంతగడ్డకు చేరుకున్నారు. ఆధునిక పరిజ్ఞానం లేనందున తమ ప్రాంతంలో రైతులు ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతుల్లో పంటలు వేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని ఆమె చెబుతున్నారు. రైతులకు లాభంతో పాటు వినియోగదారులకు తక్కువ ధరలకు పోషకాలున్న ఆహార ధాన్యాలు దక్కాలన్నదే తన ఆలోచన అని అంటారు. తాను రూపొందించిన ఆహార ధాన్యాలను ‘అరోవిక’ పేరుతో కవిత విక్రయిస్తున్నారు. విజయపుర ప్రాంతంలో 30 రైతులను ప్రోత్సహిస్తూ పోషక విలువలున్న ఆహార ధాన్యాలను వారి నుంచి ఆమె కొనుగోలు చేస్తుంటారు. మంచి ధర లభిస్తుండడంతో రైతులు కూడా ఆమె చెప్పిన పద్ధతులను పాటిస్తుంటారు. బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఆహార ధాన్యాలను విక్రయించేందుకు తగిన మార్కెటింగ్ ఏర్పాట్లు చేసి, 40 మంది మహిళలకు ఆమె ఉపాధి అవకాశాలు కల్పించారు. మహిళా రైతులు ఆర్థిక సాధికారత సాధించేలా మరికొన్ని ప్రయోగాలు చేపట్టేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నారు. ఆమె పండించిన ఆహార ఉత్పత్తులు వ్యవసాయరంగ నిపుణులను సైతం ఆకట్టుకున్నాయి. సాయుధ దళాల్లో పనిచేసే వారికి పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలన్న ఆలోచన కూడా తనకు ఉందని కవిత చెబుతున్నారు. కేంద్ర ఆహార ఉత్పత్తుల పరిశోధనా సంస్థ సహకారం తీసుకుని మరికొన్ని ప్రాజెక్టులకు ఆమె రూపకల్పన చేస్తున్నారు.
సేంద్రియ సాగుకు సాయం..
మైసూరుకు చెందిన ఆనంద్ ఓ టెలికమ్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తన ప్రాంత రైతులకు అండగా నిలిచాడు. వ్యవసాయరంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిందించడం తప్ప, ఎవరికివారు సొంతంగా ఆలోచించడం లేదని ఆయన అంటారు. వ్యవస్థ బాగులేదని విచారించడం కన్నా, రైతులను వీలైనంతమేరకు ఆదుకోవడం ఉత్తమమని భావించి ఆయన సేంద్రియ పద్ధతుల్లో సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. భారీగా ఖర్చు చేసి రసాయన ఎరువులు, పురుగుమందులను వాడడం వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, సేంద్రియ పద్ధతులో సాగు చేస్తే ఖర్చులు కలిసి వస్తాయని, పోషకాలున్న ఆహార ఉత్పత్తులు వినియోగదారులకు లభిస్తాయని ఆనంద్ వివరిస్తున్నారు. పంటల సాగులోనే కాదు మార్కెటింగ్ సౌకర్యాలను అందించడంలోనూ ఆయన రైతులకు అండగా నిలుస్తున్నారు. తొలుత ఆయన మైసూరు సమీపంలోని షాదనహల్లి వద్ద ఆరు ఎకరాల భూమిని తీసుకుని సేంద్రియ పద్ధతుల్లో పంటలు వేశారు. రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి ఈ పద్ధతులపై చైతన్యం కల్పిస్తున్నారు. ఆహార ధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేసి భారీ లాభాలు గడించాలన్న తపన తనకు లేదంటున్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మార్కెటింగ్ సౌకర్యాలను ఉపయోగించుకుని, ఈ ప్రాంత రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే తన తపన అంటారు.
అన్నదాతలకు అండగా..
గత ఏడాది ఆగస్టు వరకూ భార్య, ఏకైక కుమార్తెతో కాలిఫోర్నియాలో ఉన్న ఆ యువకుడిలో ఏదో అసంతృప్తి మొదలైంది.. ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే మధుచందన్‌కి అంతులేని సంపాదన, అత్యంత విలాసవంతమైన జీవితం.. అయినప్పటికీ సొంత ఊరి కోసం ఇంటిముఖం పట్టాలని భావించి కాలిఫోర్నియా (అమెరికా)లో ఉద్యోగానికి స్వస్తి పలికాడు. తన సొంతగడ్డ అయిన మాండ్యా జిల్లా (కర్నాటక)లో ఆర్థిక సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిసి సొంతగడ్డకు చేరుకున్నాడు. తాను పుట్టి, పెరిగిన చోట కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. పంటల సాగులో ఆధునిక పద్ధతులను పాటిస్తూ, స్థానిక రైతులకు వాటిపై అవగాహన కల్పించాడు. సొంత గ్రామానికి అతను రావడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా జీతభత్యాలు పెరుగుతాయే తప్ప ఆత్మసంతృప్తి ఉండదని భావించి సొంత ఊరికి చేరుకున్నానని మధుచందన్ చెబుతుంటారు. సుమారు 300 మంది రైతులకు ఆత్మీయుడిగా నిలిచి వారిచేత ‘మధుఅన్న’గా పిలిపించుకుంటున్నాడు. తనతో పాటు ఇంజనీరింగ్ చదివిన భార్య అర్చన తన ఆలోచనలకు అండగా నిలిచిందని, కుటుంబ సభ్యులు సైతం ప్రోత్సహించడంతో ఇపుడు తన ప్రాంతానికి పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నానని ఆయన చెబుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పంటలు వేస్తే రైతులకు లాభాలే కాదు, వినియోగదారులకు ఆరోగ్యం కూడా లభిస్తుందని ఆయన అంటున్నారు.

అయిదంకెల జీతం..
అవస్థలు లేని జీవితం.. అయినా
అతడిలో ఏదో అసంతృప్తి.. ప్రభుత్వ
యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఫర్మాన్ అలీ ఊరి జనం కోసం ఏదైనా మంచిపని చేయాలన్న సంకల్పంతో ఉద్యోగాన్ని వదిలేశాడు. రాజస్థాన్‌లో తన స్వగ్రామమైన అల్వార్‌కు
చేరుకుని పేద విద్యార్థులను తీర్చి
దిద్దేందుకు ఓ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించాడు.

ఫర్మాన్ అలీ

-రమ