సబ్ ఫీచర్

సామర్థ్యానికి పదును.. విజయానికి పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సృష్టిలో బుద్ధిజీవి అయిన ప్రతి మనిషిలోనూ శక్తి సామర్థ్యాలకు ఏ మాత్రం కొదవలేదు. కాకుంటే అది ఏ పనిలో, ఏ రంగంలో, ఎంత శాతం అన్నది మాత్రం వాళ్ళ వాళ్ళ అభిరుచి, తెలివితేటలు, సాధన బట్టి విభిన్నంగా ఉంటుంది. కొంతమంది శారీరక శక్తిని ఉపయోగించి యుక్తితో కొన్ని పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ వుంటారు. మరికొంతమంది హస్త నైపుణ్యంతో సృష్టికి ప్రతి సృష్టిలాంటి అద్భుతమైన కళాత్మక వస్తువులను, శిల్పాలను, చిత్రాలను తయారుచేస్తూ ఉంటారు. చతుష్షష్టి కళలో నాట్యం, గానం, అభినయం, రచనా వ్యాసంగం ఇలా ప్రతిదీ కళాకారుని సామర్థ్యాన్ని బట్టే విలువను సంతరించుకుంటాయి. ‘చూసి నేర్చింది విద్య అయితే నేర్పుతో చేసింది కళ’ అన్నాడు ఓ ఆలంకారికుడు. ఈ రెండింటికీ సామర్థ్యం అవసరమే.. దాన్ని సాధించాలంటే నిరంతర కృషి, సాధన, పట్టుదల అవసరం. వీటినే పుస్తక భాషలో ప్రతిభ, ఉత్పత్తి, అభ్యాసం అన్నారు.
చేస్తున్న పని అది చిన్నదైనా, పెద్దదైనా, గొప్పదయినా అందలో రాటుతేలడానికి తగిన శిక్షణ అవసరం. ఫుట్‌పాత్‌మీద కూర్చుని చెప్పులు కుట్టేవానికి ఆ పనిలో మెలకువలు, సులువులు నేర్చుకోవడానికి ఆ పని మీద ఆసక్తి, శ్రద్ధ ఉన్న అతనివల్లే సాధ్యం అవుతుంది. కుండలు చేయటం, కమ్మరి కొలిమిలో వ్యవసాయ పనిముట్లు చేయడం, వడ్రంగి పనితో చెక్క సామాన్లు, గృహోపకరణ వస్తువులు చేయడం ఆయా వృత్తిపనులను దైవంగా భావించగల అంకితభావం ఉన్నవాళ్లతోనే అయ్యే పనులు. అందులోనూ మళ్లీ ఒకరి పనికి మరొకరి పనికీ వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి అనుభవాన్ని బట్టి తేడాలు ఉంటాయి. అదే సామర్థ్యం అంటే..! డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవర్ పని చేసేవాళ్ళకు.. స్వంతగా తమ వాహనాలను తామే నడుపుకొనేవాళ్లకు కూడా డ్రైవింగ్ మెలకువలు, అనుభవం గణనలోకి వస్తాయి. లేకుంటే బండి అదుపు తప్పి ప్రమాదాలు జరిగి డ్రైవర్ ప్రాణాలకే కాక అందులో వున్న ఇతర ప్రయాణికులకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం వుంటుంది.
శారీరక శక్తితో చేసే పనులతోపాటు మేథాశక్తితో చేసే పనులకు కూడా శిక్షణ, సాధన, అంకితభావం అనేవి పని నైపుణ్యానికి, సామర్థ్యానికి తోడ్పడమే కాదు అవి అత్యంత ఆవశ్యకం కూడా. ‘కష్టే ఫలి’ అన్నారు. ఏదైనా కష్టపడితేనే ఫలితం దక్కేది. ఆ కష్టానికి కూడా ‘ఇన్ని రోజులు, ఇంతకాలం’ అన్న లెక్కలు, కొలబద్దలు ఉండవు. ఒకవేళ సోమరితనంతోనో, అహంకారంతోనో అలా లెక్కలేసుకుని ఉన్నదానితో తృప్తిపడి ‘ఇక చాలు’ అనుకుంటే.. అలా అనుకున్న వాళ్ళ ఎదుగుదల కూడా అక్కడే ఆగిపోయి సామర్థ్యం చతికిలబడిపోతుంది. తెలివితేటలకు ‘ఆది’ మాత్రమే కానీ ‘అంతం’ అనేది ఉండదు. సముద్రమంత జ్ఞానంలో ఇంతవరకూ నాకు నచ్చింది ఒక్క నీటి బిందువంత కూడా లేదు’ అన్న తనను గురించిన ఎరుక తనకు ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక జీవితకాల విద్యార్థిగా ఉంటూ ఇంకా ఇంకా ఎదగటానికే ప్రయత్నిస్తారు. జ్ఞాన పిపాస ఉన్నవాళ్ళ మనసులోకి అణకువ తప్ప అహంకారం వచ్చి చేరదు.. ఎంత ఎదిగినా ఒదిగే తత్వమే తప్ప కళ్ళు నెత్తికెక్కవు. అలా అని సమర్థులు ఆత్మన్యూనతకు కూడా లొంగిపోకూడదు.. ఆత్మవిశ్వాసం, తన పనిమీద తనకు ఇష్టం, ప్రేమ తప్పక ఉండాలి. మన ఆత్మవిశ్వాసాన్ని ఇతరులు అహంకారం అని భ్రమపడినా, పొరబడినా ఆ తప్పు మనది కాదు. పని సామర్థ్యం ఉండే తన ప్రతిభను తను గుర్తించలేక ఆత్మన్యూనతకు గురికావడం వ్యక్తిత్వ వికాసానికి ఎంతటి గొడ్డలిపెట్టో.. ప్రతిభ తగినంత లేకపోయినా ఎంతో ఉన్నట్టు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో గర్వించటం కూడా అంతే చేటు! అందుకే జీవితంలో ప్రతి పనిలోనూ సమతూకం అవసరమని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే జీవితంలో ఎదిగి ఉన్నత శిఖరాలను చేరుకోవటానికి.. అప్పటికే అంత ఎత్తుకు ఎదిగిన అత్యంత ప్రతిభావంతుల జీవిత విశేషాలను, వాళ్ళ పనితీరును, వాళ్ళు ఎదుర్కొన్న ఒడిదుడుకులను, వ్యక్తిత్వ తప్పిదాలను మనం చదవడం, అడిగి తెలుసుకోవడం ముఖ్యం. వాళ్ళను మార్గదర్శకులుగా చేసుకోగలిగితే ఇక ఆ దారి అంతా రహదారి అయి మన గమనాన్ని సుగమం చేస్తుంది.
విద్యానైపుణ్యాలు అనేవి ఇతరులకు పంచినకొద్దీ పెరిగేవే కానీ ఇసుమంత కూడా తరిగేవి కావు. అందుకే నిత్య విద్యార్థి ‘శిక్షణ’ను కూడా తన శిక్షణలో భాగం చేసుకోవాలి. కొంతమంది తనకు వచ్చింది ఇతరులకు నేర్పాలంటే తనకన్నా వాడెక్కడ ముందుకెళ్ళిపోతాడోనని భయపడతారు. విద్యలో సహ విద్యార్థితో స్పర్థ, పోటీ ఉండాలిగానీ.. తన శిష్యునితో కాదు. గురువును మించిన శిష్యునిగా తన విద్యార్థి భవిష్యత్తులో ఎదిగితే చూసి గర్వించగల సహృదయం గురువుకు ఉండాలి. అతనికి విద్య నేర్పిస్తున్న సమయంలో తను ఎన్ని విషయాలను నేర్చుకున్నాడో అది మర్చిపోకూడదు. కొంతమంది తమ తెలివితేటలను, తమ శక్తి సామర్థ్యాలను తప్ప ఎదుటివాడి శక్తిని అస్సలు నమ్మరు. అలాంటివాళ్ళు ‘ఈ ప్రపంచం తనతోనే పుట్టి తనతోనే అంతమవుతుందన్న’ భ్రమల నుంచి భయటపడే ప్రయత్నం చేయాలి. మేథాశక్తితో పనిచేసే తన కింది ఉద్యోగుల పని సామర్థ్యాన్ని నమ్మి.. వాళ్ళకూ ఆ సంస్థలో పని భాగం పంచిపట్టి.. వాళ్ళని వాళ్ళు నిరూపించుకునే అవకాశాన్ని వాళ్ళకూ ఇవ్వాలి. దాచుకున్న సొమ్మును ఎప్పటికప్పుడు బయటికి తీసి వాడకపోతే... అది చెదలు పట్టి పాడైపోవడమో... అసమర్థుల పాల్పడి అన్యాక్రాంతమై దుర్వినియోగమవడమో, ఆ కాలానికి వర్తించని అవుట్‌డేటెడ్ సరుకులా నిరుపయోగం అవడమో జరుగుతుంది. అలాగే విజ్ఞానం కూడా! ఎప్పటికప్పుడు సానపెడుతూ పదును తేలేలా చూసుకోవాలి.. అడిగిన వాళ్ళకు, అడగనివాళ్ళకు కూడా పంచిపెడుతూ తన జ్ఞాన సంపదను మరింత వృద్ధి చేసుకోవాలి. కాలానుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకుంటూ కాలాతీతమైపోకుండా దాన్ని ఉపయోగించగలగాలి. అలా చేయగలిగినప్పుడు వ్యక్తి తనకు తానుగా సమర్థుడిగా ఎదగటమే గాక తనతోపాటు పదిమంది సమర్థులను తయారుచేయగలుగుతాడు.

- వాణీ చలపతిరావు