సబ్ ఫీచర్

జ్ఞానదంతం తీస్తే జ్ఞానం పోదు.. పోయేది నొప్పే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రింది దవడ కుడివైపు వాపు, నోరు తెరవలేనంత నొప్పి, ఇది ఒక పేషంట్ పడుతున్న బాధ. నొప్పితో కూడుకున్న పని అయినా అతని నోరు తెరచి పరీక్షించాల్సి వచ్చింది. క్రింద దవడ కుడివైపు ఉన్న ఆఖరి దంతం అడ్డంగా పడుకుని ఉన్నట్టు ఉంది. దానిమీద వాచిన చిగురు ఎర్రగా ఉంది. మందులు వాడి రెండు రోజుల తర్వాత వస్తే ఆ పన్ను తీసేద్దాం అని చెప్పా. ఆ పేషెంట్ తండ్రి తన జేబులోనుండి ఒక చీటి తీసి నాకు ఇచ్చాడు. అది మరొక డాక్టరు రాసిన మందుల చీటి. మందులు వాడినా నొప్పి, వాపు తగ్గలేదని ఆ తండ్రి వాపోయాడు. వెంటనే పన్ను తీసేయమని బాధితుడు అడిగాడు. వైద్య రంగంలో మందులకి కూడా లొంగని మొండి నొప్పులకు కొన్ని సందర్భాలలో శస్తచ్రికిత్స ఉపశమనం కలిగించవచ్చు. అలాంటి ఓ సందర్భమే ఈపైన వివరించబడిన సంఘటన. నోరు పూర్తిగా తెరవలేక పోవడంవల్ల కష్టంతో కూడుకున్న పని అయినా వెంటనే మత్తు ఇచ్చి అతనికి ఆ పన్ను తీసివేయాల్సి వచ్చింది.
పంటి సమస్యలను చులకనగా చూసేవారికి, వాటి ఫలితాలు అప్పుడప్పుడు ఇలా భరించలేనంతగా ఉంటాయి. అదీ, జ్ఞానదంతం సమస్య అయితే ఆ బాధ వర్ణనాతీతం. తలనుండి మెడ వరకు చెవి నుండి ముక్కువరకు నొప్పి నదిలా పాకుతుంది. వాపు, జ్వరం, నోరు తెరుచుకోలేకపోవడం లాంటివి సహజం. పన్ను తీసిన వారానికి ఆ పేషంట్ కుట్లు తీయించుకోవడానికి వచ్చాడు. కుట్లు తీసిన తర్వాత, ఆ పేషంట్ నన్ను అడిగిన కొన్ని ప్రశ్నలు, వాటికి నేను ఇచ్చిన సమాధానాల సంభాషణ ఈ విధంగా జరిగింది.
జ్ఞాన దంతం అంటే ఏమిటి?
మనకి పాలపళ్ళు పడిపోయాక వచ్చే శాశ్వత పళ్ల సంఖ్య 32, వాటిలో ఆఖరికి, అంటే 17-24 సంవత్సరాల మధ్య వయస్సులో వచ్చే దంతాలు జ్ఞాన దంతాలు.
వాటిని జ్ఞాన దంతం అని ఎందుకు అంటారు?
మనం భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నామో, దాని గురించి జ్ఞానాన్ని సంపాదించే రోజుల్లో (కాలేజీ రోజుల్లో) వస్తాయి కాబట్టి, వాటిని జ్ఞాన దంతాలు అంటారు.
అసలు ఈ జ్ఞాన దంతం ఎందుకు సమస్యలా మారుతుంది?
నూటికి పది మందిలో ఈ జ్ఞానదంతాలు ఉండవు. 70% మందిలో ఇవి ఉన్నా అవి సరైన రీతిలో బయటకి రావు. దానికి కారణం ఏంటంటే కాలంతోపాటు జరిగే మార్పులలో, మానవుడి క్రింది, పైన దవడ పరిమాణం తగ్గిపోతూ ఉంది. ఆఖరుకు వచ్చే జ్ఞాన దంతాలకు చోటు సరిపోక అవి బుగ్గప్రక్కకి, లేక నాలుక ప్రక్కకి రావడం, లేకపోతే ఒక ప్రక్కకి ఒరిగి ఉండడం, లేక మొత్తానికీ బయటకి రాకుండా పూర్తిగా దవడ ఎముక లోపల ఉండిపోవడం లాంటివి జరుగుతుంటాయి.
సరైన రీతిలో బయటకి రాని దంతాలవల్ల వచ్చే సమస్యలు ఏమిటి?
నాలుక లేక బుగ్గ పక్కకి వచ్చిన దంతాలు, నాలుక లేక బుగ్గ మీద అసహజమైన ఒత్తిడిని కల్గించడంవల్ల అక్కడ పుండుఅయ్యే ప్రమాద ఉంది. ఇంకా నోరు తెరుచుకోడానికి ఉపయోగపడే కండరాల మీద ఒత్తిడి కలిగించి, నోరు తెరవలేనంత నొప్పి రావచ్చు.
ఒక ప్రక్కకి ఒరిగిన జ్ఞాన దంతాలలో, ఒరిగిన జ్ఞాన దంతానికి దాని ముందు దంతానికి మధ్యలో ఆహారం ఇరుక్కుని, రెండు పళ్లకీ పుచ్చు వచ్చి భరించలేనంత నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. సరిగ్గా బయటకు రాని దంతాలని, చాలా శాతం వరకు చిగురు కప్పేస్తుంది. ఆ భాగంలో మనం తినే పదార్థాలు చిగురు క్రింద ఇరుక్కుని వాపు వచ్చే ప్రమాదం ఉంది.
ప్రతీ జ్ఞాన దంతాన్ని ఇలా ఆపరేషన్ చేసే తీయాలా?
అన్ని దంతాలకు ఆపరేషన్ చేసి తీయవలసిన అవసరం లేదు. జ్ఞాన దంతం నిలువుగా 50%కన్నా ఎక్కువ చిగురులోనుండి బయటకి వస్తే వాటిని మామూలుగా తీసే ప్రయత్నం చేయవచ్చు. ఒక ప్రక్కకి ఒరిగి ఉన్నా లేక 50%కన్నా ఎక్కువ పన్ను భాగం ఎముకలో ఉండిపోయినా వాటిని చిన్న ఆపరేషన్ చేసి బయటకి తీయాల్సి ఉంటుంది. చిగురుని, ఎముకని కోసి, పంటిని చిన్న ముక్కలుగాచేసి తీసే ప్రయత్నం చేస్తాం. ఇలా జ్ఞాన దంతం తీసే క్రమంలో కుట్లుపడతాయి. ఆ కుట్లని వారంలో తొలగిస్తారు.
ఈ ఆపరేషన్ అందరు పళ్ల డాక్టర్లు చేయగలరా?
జ్ఞాన దంతాన్ని తీయడానికి బలం కాదు, నేర్పు అప్పుడప్పుడు ఓర్పు కూడా కావాలి. బలంతో తీసే ప్రయత్నం చేస్తే క్రింద దవడ విరిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ ప్రక్రియలో నేర్పు ఉన్న ఓరల్ సర్జన్స్‌తో తీయించుకోవడం మంచిది.
నాకు క్రింద జ్ఞానదంతంతోపాటు, పైన జ్ఞాన దంతం కూడా ఎందుకు తీసేసారు?
జ్ఞాన దంతం ఎప్పుడు తీసినా, పైన మరియు క్రింద దంతాలను కలిపి తీసేస్తాం. అలాకాకుండా ఒక్కటే తీస్తే, మిగిలిన పైనా లేక క్రింద దంతం ఇంకా బయటకువచ్చి బుగ్గకు పుండుచేసే ప్రమాదం ఉంది. పైన ఇంకా క్రింద పళ్లు ఒక దానిని ఒకటి తాకినప్పుడే, అవి నవలడంతో సహాయ పడతాయి. అటువంటిది ఆ జతలో ఒక పన్ను లేనప్పుడు, ఇంకొక పన్ను ఉన్నా అది వ్యర్థం.
జ్ఞాన దంతాలని తీసినప్పుడు ఇలా వాపు అందరికీ వస్తుందా?
ఆపరేషన్ చేసి తీసిన వారిలో మాత్రం క్రొద్దిగా వాపు వస్తుంది. అది 3-5 రోజులలో తగ్గిపోతుంది. ఇంతేకాకుండా నోరు ఎక్కువగా తెరుచుకోదు. మెత్తటి ఆహారం తినాల్సి ఉంటుంది.
పనికి ఎప్పటినుండి వెళ్లవచ్చు?
పన్ను తీసిన తరువాత 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఆ తరువాత వాపు ఇబ్బంది కాకపోతే పనికి వెళ్ళవచ్చు. లేకపోతే వాపు తగ్గాక వెళ్ళవచ్చు. ఇంటి పనులు రెండవరోజే చేసుకోవచ్చు. సాధారణ జీవన శైలికి అంటే, పూర్తిగా నోరు తెరుచుకోవడం, తినడం లాంటివి చేయడానికి, ఒక వారం పడుతుంది. పన్ను తీసినచోట ఉన్న గుంట పూర్తిగా మానడానికి 6వారాలు పడుతుంది.
తీయించుకున్న తరువాత తిరిగి అక్కడ పన్ను పెట్టించుకోవాలా?
అవసరం లేదు.
ఓసారి ఓ పదిహేడేళ్ళ అమ్మాయి పంటి నొప్పితో నా దగ్గరికి వచ్చింది. పరీక్షించి చూస్తే అది జ్ఞానదంతం. తీసేయాలని చెప్పా పదివేళ్లలో ఆరువేళ్ళకి రాళ్ల ఉంగరాలు తొడుకున్న ఆ అమ్మాయి, మెడికల్ పరీక్ష రాసి డాక్టరు అవ్వాలి అనుకుంటోంది. ‘‘జ్ఞానదంతం తీస్తే జ్ఞానం పోతుందని, ఇంకా కళ్ళకి మంచిదికాదని వాళ్ళ బామ్మ చెప్పిందట’’ ససేమిరా తీయించుకోను అంది. నాకు నవ్వొచ్చింది. ఆమెతో ఇంతే చెప్పా. ‘‘నగరంలో ఉంటూ, పై డాక్టరు అవ్వాలనుకుంటున్న నువ్వు ఈ మూఢ నమ్మకాలని నమ్ముతున్నావా?’’ జ్ఞాన దంతం తీసినంత మాత్రాన నీ జ్ఞానం పోదు, నీ చూపుకీ ఏమీకాదు. చదివే చదువుని నమ్ము. నీకు చదువుచెప్పే గురువుని నమ్ము. ఈ రాళ్ళని, ఇంకా మూఢ నమ్మకాలని కాదు. *

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com

-డా. రమేష్ శ్రీరంగం