సాహితి

దాశరథిని స్మరించడం తెలంగాణను గౌరవించడమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

===పుస్తకమ్===

దాశరథి సాహిత్యం
ఐదవ సంపుటం
వెల: రు.175
పుటలు: 245
ప్రతులకు: నవచేతన
పబ్లిషింగ్ హౌస్
బండ్లగూడ (నాగోలు)
హైదరాబాదు- 68.
ఇంకా నవచేతన బుక్‌హౌస్ అన్ని బ్రాంచీలు
------------------------
నవచేతనగా మారిన విశాలాంధ్ర ప్రచురణాలయం వారు దాశరథి రచనలను గతంలో నాలుగు సంపుటాల్లో ప్రచురించి అభినందనీయులయ్యారు. ఇప్పుడు ఐదవ సంపుటాన్ని ప్రకటించి మరోసారి అభినందనీయులవుతున్నారు. తెలంగాణ వస్తే అవినీతి పోతుందా? నిరుద్యోగ సమస్య నిర్మూలింపబడుతుందా? అన్న ప్రశ్నలకు జవాబులు చెప్పలేం కాని ఆళ్వారుస్వామి, దాశరథి లాంటి వారి మీద సదస్సులు జరగకపోయేవి. దాశరథి కాళోజిల జయంతులు ఆధికారికంగా జరగకపోయేవి. ఈరోజు దాశరథి బతికుండి తన రచనల సంపుటాలను, తన మీద జరిగిన సదస్సుల పత్రాల బృహద్గ్రంథాలను (గంటా జలంధరరెడ్డి తెచ్చినవి) కళ్ళార చూసుకొని వుంటే ఎంత సంతోషపడేవాడో! 1951 జులై తెలుగు స్వతంత్రలో దాశరథి తెలంగాణలోని నూతనోత్తేజాన్ని విశే్లషిస్తూ రాసిన ఈ మాటలు అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువగా అన్వయిస్తాయి. ‘‘ఈ మహోద్యమం వలన మూగబోయి పడియున్న కంఠాల నుండి దివ్య శంఖనాదం వెలువడింది. తెలంగాణాలో కాళోజీ రచనలకు విలువ హెచ్చింది. నా అగ్నిధార, రుద్రవీణా సాహిత్యంలో నూతన వికాసం పొడకట్టింది. కవులూ కథకులూ ఇతర రచయితలు తమ జీరవోయిన గొంతులను సవరించుకుని కదిలారు. ఉత్తమ సాహిత్యం వెలువడింది. ప్రజల మెదడులకు మేత లభించింది. తెలంగాణీయుల సంస్కృతి, నాగరికత బారలు చాచుకొని వ్యాపించాయి. తెలంగాణా తన ఉత్తమ సాహిత్యకర్తలు లోకానికి సుపరిచితులైనారు.’’ దాదాపు ఒక లక్ష పేజీల తెలంగాణ సాహిత్యం ఈ పదేళ్ళలో వచ్చింది. ఇది తెలంగాణ మలిదశ ఉద్యమ ఫలితాంశమేననడం నిర్వివాదాంశం.
ప్రస్తుతం ఈ ఐదవ సంపుటంలో గత సంపుటాల్లో చేరని దాశరథి వ్యాసాలు, కథలు, కవితలు గేయాలు చేరాయి. 30 ఏళ్ళ యువ దాశరథిని చిత్రించిన ఫొటో ఒకటి చేర్చారు. ఫొటో కింద దానిని గీసిన ప్రముఖ చిత్రకారునికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. కానీ వారి పేరును స్మరించడం మాత్రం మరిచారు. వారు అంబాజీగారు.
ఈ వ్యాసాల్లో, కవితల్లో దాశరథి ముద్ర బలంగా కనిపిస్తుంది. కె.వి.మహదేవన్ 100 చిత్రాలకు సంగీత సారథ్యం పూర్తిచేసిన సందర్భంలో రాజమండ్రిలో జరిగిన పురస్కార సభలో దాశరథి చేసిన ప్రసంగం ఆత్మీయంగా కవితాత్మకంగా సాగింది. 23వ పుటలో దుక్కిపాటి మధుసూదనరావు మూడుసార్లు ఆదుర్తితో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దోషం ప్రూఫురీడర్లదే. దాశరథి కవిత్వాన్ని ఎంత కమ్మగా రాస్తారో వచనాన్ని కూడా అంతే కమ్మగా రాస్తారని ఈ వ్యాసాలు నిరూపిస్తాయి. వరూధిని, దమయంతి, సత్యభామ, గోదాదేవి, ప్రభావతి మొదలైన ప్రబంధ నాయికల గురించి సరళ సుందరంగా వచన రూపంలో ఆస్వాదయోగ్యంగా రచించారు.
దాశరథి గొప్ప కవే కాదు. గొప్ప కథకుడు కూడ అనడానికి నిప్పు పూలు కథ నిదర్శనం. రజాకార్లుగా చెలరేగిపోయి చరిత్ర హీనులైన వారిలో ఒకడి భార్య అంతరంగ జగత్తు నావిష్కరించిన ఉత్తమ కథ ఇది. తెలంగాణ అమరవీరుని రక్తాంజలి కథ జైలు జీవితానుభవాలకు అక్షరాకృతి. నారింజ పండ్లు, మారువేషం లాంటి కథలు ఎంతో అలరిస్తాయి. ఖబడ్దార్ చైనా, నవమంజరి పేరుతో రాసిన సంగీత రూపకాలు, పాటలు అన్నీ అలరించేవే. అనుబంధంలో దాశరథి కవి సమ్మేళనం మీద రాసిన వ్యాసానికి వెల్దండ ప్రభాకరరావు రాసిన స్పందన, పులిజాల హన్మంతరావు రాసిన ప్రతిస్పందనాత్మక వ్యాసాలు సమకాలీన విశేషాల అవగాహనకు తోడ్పడుతాయి. రెండవ అనుబంధంలో దాశరథి జీవిత విశేషాలు-గ్రంథాల విశేషాలు కాలక్రమంలో పేర్కొన్నారు. రెండుమూడు పుటల తర్వాత దాశరథి సాహిత్యం పేరిట మళ్ళీ రచనలు వస్తాయి. దాశరథి అసంకలిత రచనలు ఆయా పత్రికల నుండి సేకరించినవి అని 54 అంశాల పట్టిక ఇచ్చారు. వాటినేం చేస్తారో చెప్పలేదు. బహుశా తర్వాతి సంపుటంలో వేస్తారనుకోవాలి.
దాశరథి అంకితం పొందిన కావ్యాల పట్టికల సినారె జలపాతం, బుచ్చిబాబు ఆశాప్రియ కథల సంపుటి, ఎం.కృష్ణారెడ్డి దివ్యదీపం అనే మూడు పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఉడయవర్లు, ఆచార్య తిరుమల, అక్కిరాజు సుందర రామకృష్ణ (దాశరథి మీదనే కావ్యం రాశాడు), ఎస్. వెంకటరంగారెడ్డి, మేడిచర్ల ప్రభాకరరావు లాంటి దాశరథికి అంకితమిచ్చినవారు ఒక నూరు మంది దాక గాలిస్తే దొరకవచ్చు. ప్రముఖ కవి, దాశరథి సన్నిహితులు తిరునగరిగారు తమ అక్షరధార కావ్యాన్ని అంకితమిచ్చినట్లు నాకు గుర్తు. అసలు తిరునగరి, ఉడయవర్లు లాంటి పెద్దలను సంప్రదిస్తే తప్పక మరికొందరి వివరాలు తెలుస్తాయి. ఈ మూడు పుస్తకాల తర్వాత మళ్ళీ దాశరథి రచనల పట్టిక చోటుచేసుకోవడం విచిత్రం. ఈ వ్యాసాలు ఎక్కడెక్కడినుండి తీసుకోబడ్డవో రిఫరెన్సులు సక్రమంగా ఇచ్చి వుంటే బాగుండేది. 15, 226 పుటలు అచ్చుతప్పులకు విహర రంగాలయ్యాయి. చివరి ఇరవై పుటల్లో ప్రూఫురీడింగ్ అనే బాధ్యతే నిర్వహించలేదు. హుతభుక్తులు (హుతభుక్కులు కరెక్ట్. విషయ సూచికలో కరెక్ట్‌గా ఉంది) అనే పేరుతో ఉన్న శ్రీశ్రీ మీది తిట్టు కవిత్వం దీనిలో చేరింది. దీపావళి ప్రత్యేక సంచిక నుంచి అన్నారు. పత్రిక పేరు లేదు. అది జ్యోతి మాసపత్రిక. కవి రవీంద్రుడు అనే రవీంద్రనాథ ఠాగూరు స్తుతికవిత (పుటలు 189-191) గతంలో దాశరథి కవితా పుష్పకంలోనూ, ప్రథమ సంపుటంలోనూ వచ్చింది. అట్లాగే మీర్ కవితా మాధుర్యం (పుట 201-203) కూడ కవితా పుష్పకంలో ఉన్నదే.
కేవలం పుస్తక ప్రచురణ మీదనేకాక దాన్ని ప్రామాణికంగా, నిర్దుష్టంగా వెలువరించడంపై కూడ పట్టుదల, ఆసక్తి ఉండాలని పాఠకుడు ఆశించడంలో తప్పులేదు.
దాశరథిని స్మరించడమంటే తెలంగాణ గౌరవ ప్రతిష్ఠలు పెంచే ఏదో ఒక చిన్నదో పెద్దదో పనిని చేసి చూపెట్టడమే. దాశరథి 1951లో తెలుగు స్వతంత్రలో చెప్పిన ఆయన మాటలతోనే ముగిస్తారు.
తెలంగాణమందలి ప్రతి కవీ, కథకుడూ, పత్రికా రచయితా. నటుడూ, గాయకుడూ, చిత్రకారుడు ఈ సదవకాశాన్ని జారవిడువక సంఘటిత శక్తితో కదలి తెలంగాణ గౌరవ ప్రతిష్ఠలను పెంపొందిస్తారని ఆశిస్తున్నాము. తెలంగాణాన్ని మాతృమూర్తిగా భావించి ఆరాధించే వారందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతమొనర్చవలెనని కోరుతున్నాము.

- వెలుదండ నిత్యానందరావు, 9441666881