లోకాభిరామం

పుస్తకాలతో పేచీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు భాష మీద, పుస్తకాల మీద తెలియకుండానే ప్రేమ ఉందని మిగతా వాళ్లు చెపుతారు. చిన్నప్పటి నుంచి ఉన్న కొన్ని పుస్తకాలతోనే సతమతమవుతుండేవాడిని. ఇప్పుడు కూడా ఉన్నవి తక్కువే. కానీ, అన్నీ నాకు ఇష్టమయినవి. అసలు నాకు పుస్తకం అంటేనే ఇష్టం. కాగితం మీద అచ్చయిన అక్షరాలంటేనే ఇష్టం. ఈ సంగతి వల్ల అప్పుడప్పుడు పేచీలు కూడా వస్తుంటాయి. కొంతమంది కాగితాలను నలిపి ముద్దచేసి పడేస్తారు. నాకు చచ్చే కోపం వస్తుంది. కాగితం గౌరవించవలసిన వస్తువని నా అభిప్రాయం. ఈ విషయం నేను ఇంట్లో వాళ్లతో సహా కొంచెం పేచీ పడతాను. ఇంతకూ పేచీ అన్న మాట తెలుగు కాదని మీకెవరికయినా తోచిందా? కాగితాన్ని చెత్తలాగ భావించి నిర్లక్ష్యంగా ముద్ద చేసి పడేయకూడదు. అది ఏ భాషలో ఉన్నా అందులో చదవదగిన ముక్కలు ఏమయినా ఉన్నాయేమో వెతకాలి. అప్పుడు గౌరవంగ మడతపెట్టి పడేయాలి.
పుస్తకం చదువుతాము. తెలిసి కాలక్షేపంగా చదివినా, ఆ పుస్తకం మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఆ అభిప్రాయం మరింత బలంగా ఉంటుంది. మరెవరికయినా చెపితే, వీలయితే చర్చిస్తే, బాగుండును అనిపిస్తుంది. నాకు ఈ భావం పుస్తకాల మీద మాత్రమే కాక, సినిమాలు, తిండి, మనుషులు, మరెన్నో రకాలుగా పుట్టేది. ఆశ్చర్యమేమో, కొంతకాలానికి ఆ అభిప్రాయాలను బయటపెట్టడానికి అవకాశాలు కూడా దొరికాయి. వ్యాసాలు రాస్తున్న నాకు పుస్తక సమీక్షలు రాసే అవకాశం వచ్చింది. కుర్రవయసులో కొంత దుడుకుతనంతో చిందులు వేసినట్టున్నాను.
పాపులర్ సైన్స్ అనుకుని రాసిన ఒక పుస్తకాన్ని నేను సమీక్షించాను. పాపులర్ సైన్స్ అంటే సైన్స్ టీచర్ అవసరం లేకుండానే, సైన్స్ గురించి తెలుసుకోవడానికి సహాయం చేసే రచన అన్నది అప్పటి నా అవగాహన. అది తప్పేం కాదు. కానీ, పాపులర్ సైన్సుకు మరిన్ని లక్షణాలు ఉండాలని, తరువాత అర్థమయింది. అది వేరే సంగతి. సమీక్షలో నా మొదటి అభిప్రాయాన్ని రాసి, అయితే ఈ పుస్తకాన్ని చదవడానికి సంస్కృతం పంతులుగారు అవసరమవుతారని రాశాను. పుస్తకంలోని తప్పులను వెతికి, వెలితీసి మరీ చూపించినట్టు చూచాయగా నాకు గుర్తుంది. సమీక్ష అంటే, విమర్శ కాదు. విమర్శ అంటే కూడా తప్పులు పట్టడం ఒకటే కాదు. పుస్తకాన్ని పాఠకులకు పరిచయం చేయాలి. పుస్తకం బాగుంటే, దాన్ని వాళ్లు చదివే ఉత్సాహం కలిగించాలి. పుస్తకం బాగులేదు అనుకుందాము. లేదా అందులో బాగుపరచడానికి అవకాశాలు ఉన్నాయి అనుకుందాము. ఆ సంగతి చెప్పవచ్చు. కానీ, అది ఒకటి మాత్రమే చెప్పకూడదు. ఈ సంగతి నాకు తరువాత అర్థమయింది. పాటించాను, పాటిస్తున్నాను కూడా!
విశ్వనాథ సత్యనారాయణగారు చాలా పుస్తకాలకే ముందు మాట రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒక ముందు మాట గురించి మాత్రం నాకు కలకాలం గుర్తు ఉంటుంది. చెప్పవలసిన నాలుగు ముక్కలు చెప్పి, ‘ఇంక ఆపెదను, లేకున్న ఏది చెప్పగూడదనుకొంటినో, అదియును చెప్పవలసి వచ్చును’ అన్నారాయన అక్కడ. అంటే, ఆ పుస్తకం గురించి ఇంకా ఏదో చెప్పవలసి ఉందని అది కొందరకు నచ్చదని, ఆ సంగతుల కోసం మనమే వెతుక్కోవాలని ఆయన చెప్పినట్టే కదా?
కొన్ని పుస్తక సమీక్షలను గురించి నాకు ఎప్పుడూ గుర్తు ఉంటుంది. ఒక పండితుడు, విమర్శకుడు తాను కూడా కథానికా రచన చేయాలని అనుకున్నాడు. చక్కని కథలు రాశాడు. ఆ ఊపుతో మరిన్ని కథలు రాశాడు. అప్పుడేమయిందో ఇక నేను చెప్పనవసరం లేదు. ఆగకుండా ఆయన ఉత్సాహంగా కథలన్నీ కలిపి పుస్తకం కూడా అచ్చేసుకున్నారు. అది నా చేతుల్లోకి వచ్చింది. సమీక్ష రాయాలి. నాకు ఆ రచయితతో పరిచయం లేదు. ఉన్నా సరే, నాకు పట్టదు. చెప్పవలసిన మాట చెప్పడమే. చెప్పేశాను కూడా. సాధారణంగా రచయితలు సమీక్షకులతో యుద్ధాలు పెట్టుకోరు. అది వారి మంచి మనసుకు గుర్తు. ఏదో ఒక రకంగా పుస్తకాన్ని పదిమంది పట్టుకుని చూస్తే, ఎవరికి వాళ్లే తేల్చుకుంటారని నాకు అనిపిస్తుంది. కనుకనే కొన్ని పత్రికలు సరిగ్గా నాలుగు లైన్లలో పరిచయాలు మాత్రమే రాస్తున్నారు. కొంతకాలమయింది. నా సమీక్ష వచ్చిన పత్రిక ఆఫీసులో ఉన్నాను. సంబంధించిన సంపాదక వర్గపు వ్యక్తి ముందు కూచుని ఉన్నాను. మాట్లాడుతున్నాము. ఒక పెద్ద మనిషి కేబిన్‌లోకి వచ్చాడు. నా పక్కనున్న కుర్చీలోనే కూచున్నాడు. మాటలు సాగుతున్నాయి. మేమిద్దరం మాత్రం మాట్లాడుకోవడం లేదు. కనీసం నమస్కారాలు కూడా జరగలేదు. సంపాదకునికి అనుమానం వచ్చింది. మాకు పరిచయం లేని సంగతి పసిగట్టి, పరిచయాలు చేశాడు. ఆ వచ్చిన మనిషి అన్ని రకాల పెద్ద మనిషి. ఎత్తు కూడా చాలానే ఉంది. అంత ఎత్తు మనిషి లేచి నిలుచున్నాడు. నన్ను లెమ్మన్నాడు. నాకు ఒక క్షణం భయమయింది. ఇది ఇప్పటి మాట కాదు. భయపడుతూనే లేచాను. ఆయన నన్ను వాత్సల్యంతో కావలించుకున్నారు. నిజం చెప్పడం, నిర్మొహమాటంగా చెప్పడం, మీకు బాగా చేతనయింది. నా కథల గురించి నా కళ్లు తెరిపించారు అన్నారాయన. ఆయన పెద్దతనం మరింత పెరిగిపోయింది. కనీసం నా దృష్టిలో. ఇవాళటివరకూ మేమిద్దరం స్నేహితులుగా కొనసాగుతున్నాం. నేను బాగులేదన్న కథాసంకలనం రచయిత ఆయనేనని వేరుగా చెప్పాలి.
ఎదుటివారు అందరూ ఒకేలాగ ఉంటారని అనుకుంటే, అది అమాయకత్వంకన్నా ఆరడుగులు ముందుకు పోయినట్టు అవుతుంది. నాకు పుస్తక సమీక్షలు రాసే అవకాశాలు, అవసరాలు ఇంకా ఎదురవుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మొహమాటం లేకుండా ఒక పుస్తకానికి సమీక్ష రాయనుగాక రాయను అని తెగేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అక్కడక్కడ అందుకు వ్యతిరేకమయిన సందర్భాలు ఉన్నాయి.
ఒక పుస్తకం వచ్చింది. అది నిజంగా సాహిత్య రంగంలో ఒక చక్కని ప్రయోగం. నాణ్యత కూడా అన్ని రకాలా బాగుంది. విషయ సేకరణ పద్ధతి, వివరించిన తీరు విలక్షణంగా ఉన్నాయి. ఒక చిన్న సమీక్ష రాస్తే, పుస్తకానికి అన్యాయం అవుతుందని అనిపించింది. సంపాదకులతో అదే మాట అన్నాను. పుస్తకం గురించి ఒక పెద్ద వ్యాసం రాస్తానన్నాను. పెద్ద మనసుతో వాళ్లు కూడా సరేనన్నారు. చక్కని వ్యాసం వచ్చింది. పుస్తకం గురించి చాలా మందికి తెలిసింది. వ్యాసం నేను రాశాను కనుక చక్కనిది కాదు. చక్కని విషయం దొరికింది కనుక, చిక్కగా రాశాను కనుక, అది చక్కనిది. చిక్కగా రాయకుంటే, అది ఆ పుస్తకం మీద ఒక చిన్న విమర్శ గ్రంథంగా మారేదేమో! పత్రికలో రాసే వ్యాసాలకు పరిధి ఉంది కనుక వ్యాసం చిక్కగా రావలసి వచ్చింది. వచ్చింది కూడా! రచయిత గురించి, రచన గురించి నేనేదో పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న భావం ఎవరికయినా కలిగిందేమో. కానీ, నాకు మాత్రం ఆ రకం సూచనలు అందలేదు. తరువాతి కాలంలో ఆ రచయితతో పరిచయమయింది. అతను కూడా సమీక్ష కాని సమీక్షగా వచ్చిన నా వ్యాసం గురించి ఎక్కువ ఏమీ అనలేదు. అది నాకు మరింత నచ్చింది. అదే రచయిత ఆ తరువాత మరో పుస్తకం రాశాడు. నాకు అది మొదటి పుస్తకం వలె కనిపించలేదు. కనుక ఈసారి ఊరుకున్నాను.
ఆ మధ్యన మరో పుస్తకం గురించి కొంచెం వివరంగానే రాశాను. ఒక రచయిత మిత్రుడు ఫోన్‌లో పిలిచి, ఆ మనిషిని అంతగా పైకెత్తి చూపించడం నీకు అవసరమా? అని సూటిగా ప్రశ్నించాడు. నాకు ఏ మనిషినీ ఎంతగానూ ఎత్తి చూపవలసిన అవసరం లేదు. అలవాటూ లేదు. వినయంగా నేను విషయాన్ని ఎత్తి చూపించాను. రచయితను మాత్రం ఎత్తలేదు, అన్న సంగతి గుర్తు చేశాను. ఫోన్ చేసిన మిత్రుడికి నిజంగా నా జవాబు నచ్చినట్టుంది. ఆ తరువాత ఆ విషయం గురించి అతను మాట్లాడలేదు. పుస్తకాలను గురించి రాయడంలో రచయితల గురించిన మన స్వంత అభిప్రాయాలు అడ్డు రాకూడదు. రాయవలసింది కేవలం పుస్తకం గురించి మాత్రమే.
ప్రపంచం పుస్తకాలను పట్టించుకోవాలంటే, వాటి పరిచయం పదిచోట్ల కనిపించాలి. సమీక్షలు చదివి పుస్తకాలు కొనేవారి గురించి మనకన్నా ప్రచురణకర్తలకు బాగా తెలిసి ఉంటుంది. సమీక్ష వచ్చిననాడు మొదలు ఒక పుస్తకం కొంతకాలంపాటు డిమాండులో ఉండడం తెలిసిందే. పనిగట్టుకుని పుస్తకాలను చంపే ప్రయత్నం కూడా జరగడానికి వీలుంది. కనుకనే పత్రికల వారు మరీ నెగెటివ్ సమీక్షలను అచ్చువేయరు. వాళ్లు మంచివాళ్లు. నాలాంటి వాళ్లు నిజం చెప్పవలసి వస్తే ఆ నిజం మరీ కటువుగా ఉండే పరిస్థితిలో సమీక్ష రాయకుండా పరిస్థితిని దాటేస్తారు.
ఈ ప్రపంచంలో చాలామంది పుస్తకాలు పట్టకుండానే బతుకుతారు. పట్టించుకునే వాళ్లకే ఈ ప్రశ్నలన్నీ.

కె.బి. గోపాలం