బిజినెస్

నెగెటివ్ జోన్‌లోనే ఐఐపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) వరుసగా రెండో నెలా నెగెటివ్ జోన్‌కే పరిమితమైంది. ఆగస్టులో -0.7 శాతంగా నమోదైంది. అయితే జూలైలో ఇది -2.5 శాతంగా ఉన్న నేపథ్యంలో ఆగస్టులో కొంత పురోగతి కనిపించినట్లైంది. తయారీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల ఉత్పాదక రేటు జూలైలో పడిపోగా, ఆగస్టులోనూ ఈ రెండు రంగాలు కోలుకోలేదు. వీటికితోడు గనుల రంగంలోనూ ఉత్పత్తి మందగించింది. అయినప్పటికీ ఐఐపి వృద్ధిరేటు పతనం మెరుగుపడింది. ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టులో ఐఐపి -0.3 శాతానికి దిగజారింది. నిరుడు ఏప్రిల్-ఆగస్టులో ఇది 4.1 శాతంగా ఉండటం గమనార్హం. ఐఐపిలో 75 శాతానికిపైగా వాటా ఉన్న తయారీ రంగం కార్యకలాపాలు ఈ ఆగస్టులో -0.3 శాతానికి క్షీణించినట్లు సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిరుడు ఆగస్టులో 6.6 శాతం వృద్ధి నమోదవడం విశేషం. ఇక క్యాపిటల్ గూడ్స్ ఉత్పాదక రేటైతే గణనీయంగా 22.2 శాతం పడిపోయింది. నిరుడు ఆగస్టులో ఇది 21.3 శాతం పురోగతిని కనబరిచింది. మైనింగ్ కార్యకలాపాలు కూడా నిరుడు ఆగస్టుతో పోల్చితే ఈ ఆగస్టులో దిగజారాయి. పోయినసారి 4.5 శాతం వృద్ధి చెందితే, ఈసారి 5.6 శాతం దిగజారాయి. అయితే విద్యుదుత్పత్తి గతంతో పోల్చితే దాదాపు యథాతథంగానే ఉంది. 5.6 శాతంగా నమోదైంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉత్పాదక రేటు 2.3 శాతంగా ఉంటే, నాన్-డ్యూరబుల్స్ ఉత్పత్తి యథాతథం. ఇక కన్జ్యూమర్ గూడ్స్ ఉత్పత్తి వృద్ధిరేటు ఈ ఆగస్టులో 1.1 శాతంగా, నిరుడు ఆగస్టులో 6 శాతంగా ఉంది. మొత్తంగా చూస్తే ఆగస్టులో నిరుడు ఆగస్టుతో పోల్చితే తయారీ రంగంలోని 22 పరిశ్రమల్లో ఏడింటి వృద్ధిరేటు దిగజారింది. ఈ ఆగస్టులో కేబుల్, రబ్బర్ ఇన్సులేటెడ్, షుగర్ మెషినరీ, వులెన్ కార్పెట్స్, రత్నాలు, ఆభరణాలు, బియ్యం ఉత్పత్తి పడిపోయింది. ఇదే సమయంలో ఫ్రూట్ పల్ప్, ఎయిర్ కండీషనర్, ఇన్‌స్టంట్ ఫుడ్ మిక్సెస్, షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్స్, స్కూటర్, మోపెడ్స్, స్టెయిన్‌లెస్/అలాయ్ స్టీల్, బాయిలర్స్ ఉత్పత్తి అధికంగా నమోదైంది.
ప్రోత్సాహకాలు అవసరం
పారిశ్రామికోత్పత్తి సూచీ ఆగస్టులో -0.7 శాతానికి దిగజారిన నేపథ్యంలో వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అవసరమని భారతీయ పరిశ్రమ అభిప్రాయపడింది. ‘క్యాపిటల్ గూడ్స్ రంగంలో నమోదైన భారీ క్షీణత ఆగస్టులో ఐఐపి వృద్ధికి భంగం కలిగించింది. దీంతో పెట్టుబడుల ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశాలున్నాయి.’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ అన్నారు. అయితే ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో ఖరీఫ్ పంటల ఉత్పత్తి గణనీయంగా ఉంటుందని, ఇది రాబోయే నెలల్లో వినియోగ సామర్థ్యాన్ని పెంచగలదన్న విశ్వాసాన్ని ఐసిఆర్‌ఎ ఉపాధ్యక్షురాలు, సీనియర్ ఆర్థికవేత్త అదితీ నాయర్ వ్యక్తం చేశారు. అలాగే వేతనాలు, పెన్షన్ల పెంపు కూడా వినియోగ సామర్థ్యం పెరగడానికి దోహదపడతాయన్నారు. ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు మందగించాయని, దేశ ఆర్థికవ్యవస్థలో నిలకడ పెంచే చర్యలు అవసరమని ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఎ దిదార్ సింగ్ అన్నారు. అయతే సమృద్ధిగా కురిసిన వర్షాలు, వడ్డీరేట్ల తగ్గింపు, పండగ సీజన్ అమ్మకాలు రాబోయే రోజుల్లో కలిసి రాగలవన్నారు.