బిజినెస్

నోట్ల రద్దుతో స్తంభించిన పత్తి మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 9: దేశంలో నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని నియంత్రించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 500, 1,000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో అలజడి సృష్టించింది. నోట్ల రద్దుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతు న్నప్పటికీ.. బుధవారం సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో రైతులు భారీ ఎత్తున పత్తి సరకును మార్కెట్‌యార్డుకు తీసుకురాగా, వ్యాపారులు రూ. 500, 1,000 నోట్లను చెల్లించేందుకు ముందుకొచ్చారు. దీంతో రైతులు నిరాకరించారు. రద్దు నిర్ణయం నేపథ్యంలో తక్‌పట్టిపై పత్తితూకం, ధర, వ్యాపారులు చెల్లించాల్సిన నగదు చెల్లింపులపై రాతపూర్వకంగా రాసుకొని రైతులను తిప్పి పంపించారు. 1,000, 500 రూపాయలకు ప్రత్యామ్నాయంగా 100, 50 రూపాయల నోట్లు ఎక్కడా కూడా చలామణి కాకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొని ఖాళీ బండ్లతో తిరుగుముఖం పట్టారు. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో ప్రతిరోజు సాధారణంగా వెయ్యికిపైగా పత్తి వాహనాలు, 500 ఎడ్లబండ్లు వస్తుండగా, ఇదే తరహాలో భైంసా మార్కెట్ యార్డులోనూ పత్తి వ్యాపారం కొనసాగుతోంది. అయతే మంగళవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో బుధవారం వ్యాపార లావాదేవీలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. రోజుకు సుమారు 20 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే ఆదిలాబాద్ మార్కెట్‌లో డబ్బుల చెల్లింపులు స్తంభించిపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. తమ అవసరాల కోసం రైతులు వ్యాపారుల నుండి 1,000 నుండి 2,000 రూపాయలు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొని వెళ్లారు. ఇదిలా ఉంటే ఇచ్చోడ మార్కెట్ యార్డులో బుధవారం లాంఛనంగా పత్తి కొనుగోళ్లను ఎమ్మెల్యే బాపురావు ప్రారంభించగా, అక్కడ కూడా పత్తి సరకులకు సంబంధించి నగదు చెల్లింపుల్లో ప్రతిష్టంభన నెలకొంది. వారం రోజుల తర్వాత డబ్బులు తీసుకునేందుకు రైతులు అంగీకరించారు. మినుము, సోయాబీన్, పెసర పంట ఉత్పత్తులకు కూడా మార్కెట్‌లో ఓవైపు ధర లేక, డబ్బులు చేతికిరాక రైతులు ఇక్కట్లకు గురయ్యారు. మరోవైపు నేరడిగొండ జాతీయ రహదారి టోల్‌ప్లాజ వద్ద 500, 1,000 రూపాయల నోట్లు తీసుకోవడానికి నిర్వాహకులు నిరాకరించడంతో వాహనదారులు ఘర్షణకు దిగారు. అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో వందలాది వాహనాలు రెండు గంటల పాటు నిలిచిపోయాయి. ఆ తర్వాత కేంద్రం టోల్‌ట్యాక్స్ పన్నును మూడు రోజుల పాటు రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ యజమానులు మాత్రం యథేచ్ఛగా తీసుకోవడం గమనార్హం. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 1,000 రూపాయల నగదుకు ప్రత్యామ్నాయంగా 800 నుండి 900 రూపాయల నగదు బదిలీగా ఇవ్వడంతో కొందరు చిరు వ్యాపారులు ఎగబడి నగదును మార్పిడి చేసుకున్నారు. పెట్రోల్ బంక్‌లు ఉదయం నుండి రాత్రి వరకు వాహనాల రద్దీతో కిటకిటలాడాయి.