బిజినెస్

ఈసారికింతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 7: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అందరి అంచనాలను తలకిందులు చేసింది. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఇక్కడ నిర్వహించిన ద్రవ్యసమీక్షలో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి వెళ్లని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్.. నగదు నిల్వల నిష్పత్తినీ ముట్టుకోలేదు. సెప్టెంబర్‌లో రఘురామ్ రాజన్ నుంచి ఆర్‌బిఐ పగ్గాలు అందుకున్న పటేల్.. అక్టోబర్‌లో తన తొలి ద్రవ్యసమీక్షకే పావు శాతం వడ్డీరేట్లను తగ్గించి వ్యాపార, పారిశ్రామిక వర్గాలను ఆకర్షించారు. దీంతో డిసెంబర్‌లోనూ వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు వినిపించాయి. పాత పెద్ద నోట్ల రద్దు మధ్య ఈ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. దేశ, విదేశీ రేటింగ్ ఏజెన్సీలన్నీ కూడా ఈసారి ఆర్‌బిఐ రెపో రేటును 0.25 శాతం తగ్గిస్తుందన్న అభిప్రాయాలనే వినిపించాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకర్లు కూడా ఇదే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ అంచనాలను తారుమారు చేస్తూ వడ్డీరేట్లను ఎక్కడివక్కడే ఉంచింది ఆర్‌బిఐ. నిజానికి మంగళవారమే సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎమ్‌పిసి) పావు శాతం వడ్డీరేట్ల కోతకు సిఫార్సు చేయనుందన్న వార్తలు బలంగా వినిపించాయి. అయితే అవేవి నిజం కాదని ధ్రువీకరిస్తూ ఆర్‌బిఐ ఎలాంటి మార్పులకు దిగలేదు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినవేళ, పారిశ్రామిక ప్రగతి పడిపోయిన తరుణంలో ఆర్‌బిఐ తప్పక వడ్డీరేట్లను తగ్గిస్తుందని వివిధ పరిశ్రమలూ భావించాయి. కానీ వాటికి నిరాశే మిగిలింది. మరోవైపు పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలు దేశ ఆర్థిక వృద్ధిరేటును ప్రభావితం చేయవచ్చని అభిప్రాయపడ్డ ఆర్‌బిఐ.. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) జిడిపి వృద్ధిరేటు అంచనాను 7.1 శాతానికి తగ్గించింది. ఇంతకుముందు అంచనా 7.6 శాతంగా ఉండేది. ఇక సేవల రంగంలో నిర్మాణ, వాణిజ్య, రవాణా, హోటళ్లు, సమాచార రంగాలు పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం బారినపడ్డాయని, ముఖ్యంగా రిటైల్, వాణిజ్య, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, అసంఘటిత రంగం ఇబ్బందులకు గురవుతోందని తెలిపింది. అయితే ప్రజా పరిపాలన, రక్షణ, ఇతరత్రా రంగాలు 7వ వేతన సంఘం సిఫార్సు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌లతో ఉత్సాహపడ్డాయని ఆర్‌బిఐ ఈ సందర్భంగా తెలిపింది. అలాగే పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో రద్దయిన నోట్లు 11.85 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్లు ఆర్‌బిఐ తెలిపింది. రద్దు నిర్ణయం వెలువడే నాటికి మొత్తం 14.5 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నట్లు చెప్పింది.
chitram...
ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్

ఎవరేమన్నారు

‘ప్రస్తుత తరుణంలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్‌బిఐ చాలా తెలివైన నిర్ణయం తీసుకుంది.’
- ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్
‘వేచిచూసే ధోరణి ఇప్పుడు అవసరం. దానే్న ఆర్‌బిఐ చేస్తోంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష ముందున్న క్రమంలో ఇలాంటి ధోరణి కీలకం.’
- ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్
‘పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పడిపోయిన వ్యాపారానికి ఊతమిచ్చేలా ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గిస్తే బాగుండేది.’
- ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటియా
‘పారిశ్రామిక రంగానికి నిధుల లభ్యత పెరిగేలా ఆర్‌బిఐ నిర్ణయం ఉంటుందని భావించాం. కానీ నిరాశే మిగిలింది.’
- అసోచామ్ అధ్యక్షుడు సునీల్ కనోరియా
‘పాత పెద్ద నోట్ల రద్దుతో స్తంభించిన దేశీయ మార్కెట్‌లో పునరుత్తేజం తేవాల్సిన అవసరం ఉంది.’
- ఇఇపిసి ఇండియా చైర్మన్ టిఎస్ భాసిన్
‘మా అంచనాలకు తగ్గట్లే ఆర్‌బిఐ నిర్ణయం ఉంది. కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకపోవడమే ఇప్పుడు ముఖ్యం.’
- ఇండియా రేటింగ్స్ ఆర్థికవేత్త సునీల్ కుమార్ సిన్హా
‘ఆర్‌బిఐ నిర్ణయంతో మార్కెట్ కొంతమేర అసంతృప్తికి లోనైంది.’
- ఎస్‌బిఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య
‘ద్రవ్యోల్బణం మరింత కట్టడి కావాల్సిన అవసరం ఉందని ఆర్‌బిఐ భావించింది. అందుకే వడ్డీరేట్ల జోలికి వెళ్లలేదు.’
- ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఒ చందా కొచర్
‘వడ్డీరేట్లను తగ్గించకపోవడం ఆశ్చర్యం కలిగించింది.’
- కొటక్ మహీంద్ర బ్యాంక్
‘వడ్డీరేట్లు తగ్గుతాయని అనుకున్నాం. కానీ ఆర్‌బిఐ వేచిచూసే ధోరణిని అవలంభించింది.’
- బంధన్ బ్యాంక్ చైర్మన్ చంద్ర శేఖర్ ఘోష్
‘ఆర్‌బిఐ నిర్ణయం అసంతృప్తికి గురిచేసింది. ప్రభుత్వమైనా పన్ను రేట్లను తగ్గించి మార్కెట్‌ను ఉత్సాహపరచాలి.’
- నరెడ్కో చైర్మన్ రాజీవ్ తల్వార్
‘వడ్డీరేట్లు తగ్గకపోవడం దురదృష్టకరం. దేశీయ నిర్మాణ రంగానికి ఆర్‌బిఐ నిర్ణయం నిజంగా ప్రతికూలమే.’
- క్రెడాయ్ అధ్యక్షుడు గీతాంబర్ ఆనంద్
‘రెపోరేటును యథాతథంగా ఉంచుతూ ఆర్‌బిఐ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.’
- సిబిఆర్‌ఇ భారత, ఆగ్నేయాసియా చైర్మన్ అన్షుమన్

ముఖ్యాంశాలు
ౄ 6.25 శాతం వద్దే రెపో రేటు
ౄ 5.75 శాతం వద్దే రివర్స్ రెపో
ౄ 4 శాతం వద్దే నగదు నిల్వల నిష్పత్తి
ౄ 7.6 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గిన జిడిపి వృద్ధి అంచనా
ౄ మార్చి 2017 నాటికి 5 శాతానికి ద్రవ్యోల్బణం కట్టడి
ౄ పాత పెద్ద నోట్ల రద్దుతో ధరల్లో క్షీణత
ౄ ఈ నెలాఖరుకల్లా 10-15 బేసిస్ పాయింట్లు
తగ్గనున్న ద్రవ్యోల్బణం
ౄ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచేందుకే
ఓటేసిన ఎమ్‌పిసి సభ్యులు
ౄ నోట్ల రద్దు నిర్ణయంతో నగదు ఆధారిత రంగాలు ప్రభావితం
ౄ ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులతో
ద్రవ్యోల్బణ లక్ష్యాలకు ఇబ్బంది
ౄ డిసెంబర్ 2 నాటికి ఆల్‌టైమ్ హైకి విదేశీ మారకద్రవ్య నిల్వలు
ౄ ఈ ఆర్థిక సంవత్సరం ఒఎమ్‌ఒతో
1.1 లక్షల కోట్ల నగదును తెచ్చిన ఆర్‌బిఐ
ౄ ఫిబ్రవరి 8న తదుపరి ద్రవ్యసమీక్ష

ఇక బుధవారం ద్రవ్యసమీక్షలు
ముంబయి, డిసెంబర్ 7: రఘురామ్ రాజన్ నేతృత్వంలో మంగళవారం జరిగిన ఆర్‌బిఐ ద్రవ్యసమీక్షలు ఉర్జిత్ పటేల్ నాయకత్వంలో బుధవారం జరుగుతున్నాయ. రాజన్ వారసుడిగా సెప్టెంబర్‌లో ఆర్‌బిఐ పగ్గాలు చేపట్టిన పటేల్.. తన తొలి ద్రవ్యసమీక్షను పాత షెడ్యూల్ ప్రకారం మంగళవారమే జరిపినప్పటికీ, రెండో ద్రవ్యసమీక్ష నుంచి మాత్రం బుధవారాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుత ద్రవ్యసమీక్ష బుధవారమే జరగగా, తర్వాతి ద్రవ్యసమీక్ష కూడా బుధవారమే జరుగుతుందని ప్రకటించారు. దీంతో రాజన్‌కు మంగళవారం సెంటిమెంటైతే, పటేల్‌కు బుధవారం సెంటిమెంట్ కాబోలు అన్న ప్రచారం జరుగుతోంది.