బిజినెస్

దేశీయ స్టాక్ మార్కెట్లకు అంతర్జాతీయ భయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 6: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి అందుకున్న ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలపాలయ్యాయి. ఈ వారం ఆరంభం నుంచి నష్టాల్లోనే కొనసాగుతున్న సూచీలు.. సోమవారం భారీ స్థాయిలో పతనమైనది తెలిసిందే. మంగళవారం కూడా నష్టాలను అందుకోగా, బుధవారం అదే దారిలో నడిచాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 174.01 పాయింట్లు పడిపోయి 25,406.33 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 43.65 పాయింట్లు దిగజారి 7,741 వద్ద నిలిచింది. ఎఫ్‌ఎమ్‌సిజి, మెటల్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్, టెలికామ్, రియల్టీ రంగాల షేర్ల విలువ 1.57 శాతం నుంచి 0.85 శాతం క్షీణించింది. అయితే ఎనర్జీ, చమురు, గ్యాస్, ఐటి రంగాల షేర్ల విలువ 1.42 శాతం నుంచి 0.01 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.26 శాతం నుంచి 1.05 శాతం నష్టపోయాయి. చైనా సూచీ మాత్రం 2.25 శాతం లాభపడింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.72 శాతం నుంచి 0.88 శాతం కోల్పోయాయి. చైనా కరెన్సీ పతనం, ఉత్తర కొరియాలో అణు పరీక్ష వార్తలు, జర్మనీ చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్ కార్యాలయంలో అనుమానిత ప్యాకేజీని తనిఖీ చేసేందుకు ఆ దేశ పోలీసులు కార్యాలయాన్ని మూసివేయడం వంటివి అంతర్జాతీయ మార్కెట్లను కలవరపెట్టాయి.

పదకొండున్నరేళ్ల కనిష్టానికి
బ్రెంట్ చమురు ధరలు
లండన్, జనవరి 6: బ్రెంట్ చమురు ధరలు బుధవారం రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. బ్యారెల్ ధర 35 బిలియన్ డాలర్ల దిగువకు క్షీణించింది. గడచిన పదకొండున్నరేళ్లలో ఈ స్థాయికి ధరలు పడిపోవడం ఇదే తొలిసారి. 2004 జూలై 1 నుంచి గమనిస్తే ఇంత తక్కువగా ముడి చమురు ధరలు ఎన్నడూ లేవు. ప్రపంచవ్యాప్తంగా గల చమురు ఉత్పాదక దేశాల్లో కీలకమైన ఇరాన్, సౌదీ అరేబియా దేశాలు తమ ఉత్పత్తిని తగ్గించుకునే అవకాశాలు లేవన్న సంకేతాలుండటంతో డిమాండ్‌కు మించి సరఫరా ఉంటుందన్న అంచనాలు ధరల పతనానికి దారి తీశాయి.
రేపు బ్యాంకుల సమ్మె
ముంబయి, జనవరి 6: అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) ఈ నెల 8 (శుక్రవారం)న ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. అనుబంధ బ్యాంకులపట్ల ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా ఈ సమ్మెకు ఎఐబిఇఎ పిలుపునిచ్చింది. ఎస్‌బిఐకి అనుబంధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో అనుబంధ బ్యాంకుల ఉద్యోగులకు ఎస్‌బిఐ మేనేజ్‌మెంట్ తమ నియమనిబంధనలను రుద్దుతోందని అనుబంధ బ్యాంకర్లు ఆరోపిస్తున్నారు. దీనిపైనే తాజా సమ్మెకు దిగుతున్నారు.
పారిస్ సదస్సుకు రండి
కెటిఆర్‌కు సిసిఐఎఫ్‌ఐ ఆహ్వానం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 6: పారిస్‌లో ఈ నెల 18న జరగునున్న ఇండియా ఇనె్వస్ట్‌మెంట్ ఫోరమ్-2016 సదస్సుకు హాజరు కావాల్సిందిగా తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావుకు ఆహ్వానం అందింది. చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫ్రాన్స్-ఇండియా (సిసిఐఎఫ్‌ఐ) అధ్యర్యంలో జరగబోయే ఈ సదస్సుకు హాజరు కావాలని, ‘ఇనె్వస్ట్‌మెంట్స్ అండ్ న్యూ గ్రోత్ డ్రైవర్స్’ అనే అంశంపై కీలకోపన్యాసం చేయాల్సిందిగా ఆహ్వాన పత్రంలో మంత్రి కెటిఆర్‌ను సిసిఐఎఫ్‌ఐ కోరింది.
కాగా, ఫ్రాన్స్‌తోపాటు యూరోపియన్ యూనియన్‌లోని ప్రెంచ్ మాట్లాడే దేశాల మధ్య వాణిజ్య సంబంధాల అభివృద్ధి కోసం తమ ఫోరమ్ పని చేస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది.
చత్తీస్‌గఢ్ స్కౌట్స్-గైడ్స్
జంబోరిలో పాల్గొన్న సింగరేణి స్కౌట్స్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 6: చత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ‘స్కౌట్స్-గైడ్స్ జంబోరీ’లో సింగరేణి కాలరీస్‌కు చెందిన 41 మంది స్కౌట్స్ పాల్గొన్నారు. తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రైల్వేలకు చెందిన మొత్తం 10,600 మంది స్కౌట్స్, గైడ్స్ పాల్గొన్నారని సింగరేణి కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిలో క్యాంప్ క్రాఫ్ట్స్, మార్చ్ ఫాస్ట్, పయనీరింగ్ ప్రాజెక్టు, బ్యాండ్ డిస్ల్పే, కమ్యూనిటీ సర్వీసెస్, అడ్వంచర్ యాక్టివిటీస్ వంటి కార్యకలాపాలు జరుగుతాయని చెప్పింది. ఈ పోటీల్లో పాల్గొన్న సింగరేణి స్కౌట్స్ సింగరేణి కీర్తిపతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగురవేయాలని స్కౌట్స్-గైడ్స్ తెలంగాణ కార్యదర్శి ఎ చంద్రశేఖర్ తదితరులు ఆకాంక్షించారు.

ఎగుమతుల క్షీణతపై రేపు సమావేశం
న్యూఢిల్లీ, జనవరి 6: నానాటికి పడిపోతున్న దేశీయ ఎగుమతులను తిరిగి పెంచడంలో భాగంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఆయా రాష్ట్రాలు, పరిశ్రమల ప్రతినిధులతో ఈ నెల 8 (శుక్రవారం)న సమావేశం కానున్నారు. 2014 డిసెంబర్ నుంచి ఎగుమతులు నెలనెలా క్షీణిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ నేతృత్వంలో వాణిజ్య అభివృద్ధి, ప్రగతి మండలి తొలి సమావేశంలో భాగంగా శుక్రవారం ఎగుమతుల పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

ప్రత్యక్ష, పరోక్ష పన్నులు రూ. 9.5 లక్షల కోట్లు
న్యూఢిల్లీ, జనవరి 6: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) గడచిన తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్) పన్నుల రూపేణా 9.5 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. ఈ మేరకు రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. బడ్జెట్ అంచనాలో ఇది 66 శాతంతో సమానంగా ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో పన్నుల (ప్రత్యక్ష, పరోక్ష) ద్వారా మొత్తం 14.45 లక్షల కోట్ల రూపాయలను వసూలు చేయాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ప్రత్యక్ష పన్నులు 7.97 లక్షల కోట్ల రూపాయలుగా, పరోక్ష పన్నులు 6.47 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి.