బిజినెస్

‘రియల్’ వ్యాపారంపైనే రైతుల ఆశలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 6: తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి యోగ్యమైన ప్రదేశాన్ని గుర్తిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించటంతో రాజధాని గ్రామాల ప్రజలు తర్జనభర్జన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సచివాలయ నిర్మాణాలను చేపట్టేందుకు అవసరమైన మట్టి నమూనాలను సేకరించి భవన నిర్మాణాలకు పటిష్ఠమైన నేలను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. తుళ్లూరు మండలంలోని రాయపూడి, లింగాయపాలెం గ్రామాల్లో తాత్కాలిక సచివాలయం ఉంటుందని మంత్రి నారాయణ పేర్కొన్న నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు రియల్ ఎస్టేట్ మరలా పుంజుకుంటుందని భావిస్తున్నారు. రాజధాని నిర్మాణాలకు తొలుత భూములిచ్చిన తుళ్లూరు మండలం నేలపాడు రైతులు తాత్కాలిక సచివాలయ నిర్మాణాలకు భూములిస్తామని గతంలోనే ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తుళ్లూరు కేంద్రంగా రాజధాని ఉంటుందని ప్రకటించిన మరుక్షణం నుంచే భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా నేలపాడు గ్రామంలో ఎకరా 5 లక్షల రూపాయలు ఉండగా, కోటి 40 లక్షల రూపాయలకు బేరాలు జరిగాయి. దీంతో నేలపాడు రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవుడంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో భూముల విలువ తగ్గుతూ వచ్చింది. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజధాని నిర్మాణాలకు శంకుస్థాపన చేయటంతో మరలా భూముల ధరలు పెరిగాయి. కానీ రైతులు ఊహించినంత వేగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగకపోవటంతో రాజధాని నిర్మాణాలు చేపట్టాలనే డిమాండ్ గ్రామాల్లో పుంజుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందుగా రాజధాని ప్రాంతంలో రహదారులు నిర్మించాలనే ఆలోచనలతో ముందుకు వెళ్తోంది. అందువల్ల అసంతృప్తికి గురైన రైతులు తమ ప్రాంతంలోనే తాత్కాలిక సచివాలయం నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా సంసిద్ధత తెలియజేయటంతో మరలా భూముల రేట్లు పెరిగే అవకాశం ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణాలు త్వరిగతిన పూర్తయ్యే పరిస్థితి లేదనే ప్రచారంతోపాటు భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపులో స్పష్టత లేకపోవటంతో పొలాల ధరలు పెరిగితే అమ్ముకుని వేరొక ప్రాంతంలో కొనుగోలు చేయవచ్చుననే ఆలోచనలో గ్రామాల రైతులు ఉన్నారు. అందువల్లనే ప్రభుత్వం ఏదొక నిర్మాణం చేపట్టాలని పట్టుబడుతున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి అయిన పక్షంలో రైతులు ఆశ పడుతున్న విధంగా భూముల రేట్లకు రెక్కలు వస్తాయో, లేదో ఎదురుచూడాల్సి ఉంది. మొత్తానికి వ్యవసాయాన్ని నమ్ముకునే రైతన్నలు.. ప్రస్తుతం రియల్ వ్యాపారంపైనే గంపెడాశలు పెట్టుకున్నారు.