బిజినెస్

ఒడిదుడుకులకు ఆస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు చోటుచేసుకోవచ్చన్న అంచనాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయ. ప్రధానంగా త్రైమాసిక ఫలితాలపై, అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి నడుస్తాయంటున్న మార్కెట్ విశే్లషకులు.. మే నెలకుగాను డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండటంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చన్న అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.
కాగా, గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను గెయల్, టాటా మోటార్స్, లుపిన్, ఇండియన్ ఆయల్ కార్పొరేషన్, ఐటిసి, టెక్ మహీంద్ర, సన్ ఫార్మా వంటి దిగ్గజ సంస్థలు ఈ వారం తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయ. దీంతో వీటి ఆధారంగా మదుపరుల పెట్టుబడులు ఉంటాయంటు న్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 276.77 పాయంట్లు పుంజుకుంటే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 27 పాయంట్లు పెరిగింది. దీంతో సెనె్సక్స్ 30,464 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 9,427 వద్ద నిలిచింది. కాగా, కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం.. ఈ వారం కూడా మార్కెట్లను ఉత్సాహపరచవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ. ఎఫ్‌ఎమ్‌సిజి రంగానికి జిఎస్‌టి విధానం కలిసిరావడం తెలిసిందే. నాలుగు రకాల పన్నుల్లో తక్కువ రకం పన్నులకే ఎఫ్‌ఎమ్‌సిజి ఉత్పత్తులు పరిమితం కావడం మదుపరులను మెప్పించింది. దీంతో ఆ రంగానికి చెందిన షేర్లు ఇప్పటికే లాభాల్లో కదలాడుతున్నాయ. ఈ వారమూ మదుపరులను ఎఫ్‌ఎమ్‌సిజి షేర్లు ఆకట్టుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. జూలై 1 నుంచి ఈ పరోక్ష పన్నుల విధానం (జిఎస్‌టి) అమల్లోకి వస్తోంది. 5, 12, 18, 28 శ్లాబుల్లో వివిధ రంగాలకు చెందిన దాదాపు అన్ని వస్తువులకు కేంద్రం పన్ను రేట్లను కేటాయంచింది. కొన్ని ప్రధాన రంగాలకు మాత్రం మినహాయంపునిచ్చింది. ఇక ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా మార్కెట్‌ను రాజకీయ అనిశ్చితి ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రభావం భారత్‌సహా అన్ని ప్రధాన ప్రపంచ దేశాల మార్కెట్లపైనా పడవచ్చన్న అభిప్రాయాన్ని మార్కెట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయ.
జోరుగా విదేశీ పెట్టుబడులు

ఈ నెలలో భారతీయ మార్కెట్లలోకి రూ. 17 వేల కోట్ల రాక ౄ మదుపరులను ఆకట్టుకుంటున్న రుణ మార్కెట్లు

న్యూఢిల్లీ, మే 21: భారతీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయ. నిరుడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభ నెలైన జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పిఐలు.. ఫిబ్రవరిలో మాత్రం తీరు మార్చుకున్నారు. మార్చి, ఏప్రిల్‌లోనూ అదే పోకడ కనబరిచారు. ప్రస్తుత మే నెలలోనూ పెట్టుబడులు వస్తూనే ఉన్నాయ. కాగా, మార్చిలో రికార్డు స్థాయలో 57 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ మదుపరులు పట్టుకొచ్చారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో దాదాపు 23 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు తెచ్చారు. ఈ నెల మొదలు ఇప్పటిదాకా 17 వేల కోట్ల రూపాయలు వచ్చాయ. అయతే స్టాక్ మార్కెట్ల కంటే కూడా రుణ మార్కెట్లలో పెట్టుబడులకు ఎఫ్‌పిఐలు అమితాసక్తిని కనబరుస్తుండటం విశేషం. స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు 4,157 కోట్ల రూపాయలుగా నమోదైతే, రుణ మార్కెట్లలోకి వచ్చినవి 12,941 కోట్ల రూపాయల పెట్టుబడులు. దీంతో అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల విలువ 17,099 కోట్ల రూపాయల (2.66 బిలియన్ డాలర్లు)కు చేరింది. కాగా, వరుసగా నాలుగు నెలలు పెట్టుబడులను లాగేసుకున్న విదేశీ మదుపరులు.. ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్లలోకి 9,902 కోట్ల రూపాయల పెట్టుబడులను, రుణ మార్కెట్లలోకి మరో 5,960 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో క్యాపిటల్ మార్కెట్లలోకి ఫిబ్రవరిలో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 15,862 కోట్ల రూపాయలకు చేరింది. అయతే మార్చిలో ఈ విలువ మూడు రెట్లకుపైగా పెరిగింది. స్టాక్ మార్కెట్లలోకి 31,327 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్లలోకి మరో 25,617 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఫలితంగా మొత్తం మార్చి నెలలో దేశీయ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 56,944 కోట్ల రూపాయలకు చేరింది. ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్లలోకి 2,394 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురాగా, రుణ మార్కెట్లలోకి 20,364 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. దీంతో మొత్తం 22,758 కోట్ల రూపాయల (3.5 బిలియన్ డాలర్లు) విదేశీ పెట్టుబడులు వచ్చినట్లైంది. మరోవైపు ఈ మార్చి 31తో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లలోకి 56,000 కోట్ల రూపాయలు రాగా, రుణ మార్కెట్ల నుంచి 7,000 కోట్ల రూపాయల ఉపసంహరణ జరిగింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం దేశంలోకి వచ్చిన నికర విదేశీ పెట్టుబడుల విలువ 49,000 కోట్ల రూపాయలుగానే ఉంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి లక్ష కోట్ల రూపాయలకుపైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయ. కాగా, 2016లో భారతీయ మార్కెట్ల నుంచి 3.2 బిలియన్ డాలర్ల (23,079 కోట్ల రూపాయలు) విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేవలం నవంబర్‌లోనే సుమారు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న మదుపరులు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు మధ్య డిసెంబర్‌లో దాదాపు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను లాగేసుకున్నారు. అంతకుముందు అక్టోబర్‌లోనూ 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను గుంజేశారు. దీంతో నిరుడు చివరి మూడు నెలల్లో భారతీయ మార్కెట్ల నుంచి తరలిపోయన ఎఫ్‌పిఐ పెట్టుబడుల విలువ 12 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది జనవరితో కలుపుకుని 80,310 కోట్ల రూపాయలకు చేరింది. నిరుడు జూలై-సెప్టెంబర్‌లో విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్లలోకి 46,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఇక జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. 2016 సంవత్సరం మొత్తంగా స్టాక్ మార్కెట్లలోకి 20,566 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్ల నుంచి 43,645 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయతే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్థానాన్ని బిజెపి ఒంటరిగా గెలుచుకోవడం మదుపరుల విశ్వాసాన్ని చూరగొంది. దీంతో ఈ సంవత్సరం పెట్టుబడులు పోటెత్తుతున్నాయ.
ఎల్‌ఐసి పెట్టుబడులపై రూ. 1,80,117 కోట్ల ఆదాయం
మరోవైపు ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి.. తమ పెట్టుబడులపై గత ఆర్థిక సంవత్సరం (2016-17) 1,80,117 కోట్ల రూపాయల ఆదాయం అందుకుంది. దేశంలోనే అతిపెద్ద సంస్థాగత మదుపరిగా ఉన్న ఎల్‌ఐసి.. 2016-17లో 24,69,589 కోట్ల రూపాయల పెట్టుబడులు వివిధ సంస్థల్లో, ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్లలో పెట్టింది. 2015-16లో 21,09,253 కోట్ల రూపాయల పెట్టుబడులనే పెట్టింది.

భూ కేటాయంపులపై
టిఎస్‌ఐఐసి ‘ఆరా’

గత ప్రభుత్వాల హయాంలో
పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో గృహ నిర్మాణాలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 21: గత ప్రభుత్వ హయాంలో ధారాదత్తం చేసిన సర్కారీ భూములపై తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, వౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిఎస్‌ఐఐసి) ‘ఆరా’ తీస్తున్నది. పరిశ్రమల పేరిట భూములు తీసుకుని గృహసముదాయాలు నిర్మించడం, కర్మాగారాల స్థాపన పేరిట లీజుకు తీసుకున్న భూములు నిరుపయోగంగా ఉండటంతో వాటన్నిటి వివరాలను టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు సేకరిస్తున్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సూచన మేరకు బాలమల్లు నాచారం, కుషాయిగూడ, చెర్లపల్లి, పాశ మైలారం, పటాన్‌చెరువు తదితర ప్రాంతాలను సందర్శించనున్నారు.
మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న నేతలు సుమారు 300 ఎకరాలు తమ అనుయాయులకు కేటాయించడం జరిగింది. అయతే అటువంటి భూములు వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. అందుకు కారణం అవన్నీ అధికారికంగా రిజిస్ట్రేషన్ కావడమే. కాగా, గత పాలకుల హయాంలో పెద్దఎత్తున అవినీతి, కుంభకోణాలు జరిగాయని, అందుకే ఆ భూముల్లో పరిశ్రమలు రాకుండా గృహాలు, గోడౌన్లు వెలిశాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నాచారంలో రహేజా తదితర సంస్థలు ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుని, గృహా సముదాయాలను నిర్మించడం, ఇతరత్రా అవసరాలకు వినియోగిండంపై గత ప్రభుత్వ హయాంలో, ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి కూడా. రహేజా భూములపై అసెంబ్లీలో దుమారం చెలరేగిన సంగతీ తెలిసిందే. ప్రభుత్వ భూములను తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని విపక్షాలు నాటి ప్రభుత్వాన్ని కడిగేశాయి. ఆ సంస్థలు యధేచ్చగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నందున మిగతా భూములనైనా కాపాడాలన్న సంకల్పంతో చైర్మన్ బాలమల్లు ఉన్నారు. ఈ మేరకు చైర్మన్ బాలమల్లు టిఎస్‌ఐఐసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇవి నర్సింహారెడ్డితో చర్చించారు.
అన్ని పారిశ్రామికవాడలను బోర్డు సభ్యులతో, ఉన్నతాధికారులతో రేపోమాపో సందర్శించేందుకు చైర్మన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా రహేజా నిర్వాహకంపట్ల ఆయన సీరియస్‌గా ఉన్నారు. పరిశ్రమల స్థాపన పేరిట ప్రభుత్వ భూములను లీజుకు తీసుకున్నదెంత?, ఎవరెవరికి కట్టబెట్టారు?, అవి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో తనకు వారం, 10 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా చైర్మన్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
కాపాడాల్సింది ప్రభుత్వమే
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ (టిఐఎఫ్) సీనియర్ జాయింట్ సెక్రటరీ మిరుపాల గోపాల్ రావు అన్నారు. పరిశ్రమల పేరిట భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటేనో లేదా గోడౌన్లు నిర్మించుకుంటే, ఇతరత్రా అవసరాలకు ఉపయోగించుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదివారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పారిశ్రామిక అవసరాలకు కాకుండా ఇలా ఇతరత్రా అవసరాలకు వినియోగించుకుంటే కొత్తగా పరిశ్రమలు ఎలా వస్తాయి? నిరుద్యోగ సమస్య ఎలా తీరుతుంది? అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో టిఎస్‌ఐఐసి కఠినంగా ఉండాల్సిందేనని, అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాతే భూములు కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

స్టాక్ మార్కెట్లలో ‘మోదీ ర్యాలీ’

గడచిన మూడేళ్లలో రూ. 50 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద

ముంబయి, మే 21: కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరుల సంపద దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. గడచిన మూడేళ్లలో టాటా, బిర్లా, అంబానీ, బజాజ్, అదానీ, హెచ్‌డిఎఫ్‌సి, హిందుజా, ఎల్‌అండ్‌టి, వేదాంత, ఐసిఐసిఐ, గోద్రెజ్, అడాగ్, ఐటిసి, భారతీ ఎయిర్‌టెల్, మహీంద్ర గ్రూప్ సంస్థల షేర్ల విలువ అత్యధికంగా పుంజుకుంది. ముఖ్యంగా టాటా, బిర్లా, అంబానీ, బజాజ్ గ్రూప్‌ల్లోని సంస్థల షేర్ల విలువ ఈ మూడేళ్లలో ఒక లక్ష కోట్ల రూపాయలకుపైగానే పెరిగింది. ప్రభుత్వరంగ సంస్థల షేర్లూ సుమారు 22 శాతం ఎగబాకి 3.65 లక్షల కోట్ల రూపాయల విలువను పెంచుకున్నాయి. 2014 మే నెలలో ఎన్‌డిఎ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినది తెలిసిందే. దీంతో నాడు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోని సంస్థల మార్కెట్ విలువ 75 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే, నేడు 125 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. టాటా గ్రూప్‌లోని టిసిఎస్ ఒక్కదాని మార్కెట్ విలువే 92,000 కోట్ల రూపాయలకుపైగా పెరగడం గమనార్హం. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ మార్కెట్ విలువ సైతం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఎగిసింది. అదానీ గ్రూప్ 1.1 లక్షల కోట్ల రూపాయలు, బిర్లా గ్రూప్ దాదాపు లక్ష కోట్ల రూపాయలు, బజాజ్ గ్రూప్ 1.7 లక్షల కోట్ల రూపాయలు, హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ 3 లక్షల కోట్ల రూపాయలకుపైగా విలువను పెంచుకున్నాయి. వేదాంత 75,000 కోట్ల రూపాయలు, ఎల్‌అండ్‌టి 60,000 కోట్ల రూపాయలు, గోద్రెజ్ 50,000 కోట్ల రూపాయలు, మహీంద్రా సంస్థల విలువ 35,000 కోట్ల రూపాయలు పెరిగింది.
సాహసోపేత సంస్కరణలు: సీతారామన్
న్యూఢిల్లీ: గత మూడేళ్లలో సాహసోపేత సంస్కరణలు తెచ్చామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది. వ్యాపార నిర్వహణ సులభతరం కావడానికి 7 వేలకుపైగా చర్యలు తీసుకున్నామని పిటిఐతో అన్నారు.
జిఎస్‌టితో ద్రవ్యోల్బణానికి చెక్: అధియా
కాగా, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో ద్రవ్యోల్బణం 2 శాతం తగ్గుతుందని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా అభిప్రా యపడ్డారు. మోదీ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా జిఎస్‌టిని అభివర్ణించింది పారిశ్రా మిక సంఘం అసోచామ్.

రూ. 4 వ్యాట్‌పై మరో పోరు!
ఏపిలో ఆందోళన దిశగా లారీ యజమానులు ౄ డీజిల్ ధర భారం మోయలేమంటూ ఆవేదన ౄ సిఎం తీరుపట్ల నిరసన

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 21: అనూహ్య రీతిలో పెరుగుతున్న థర్డ్ పార్టీ బీమా ప్రీమియం, విడిభాగాల రేట్లు, ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులతో దేశంలో రవాణా రంగం సతమతమవుతుంటే ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్‌పై లీటరుకు 4 రూపాయల వ్యాట్‌ను వసూలు చేస్తుండటం రవాణా రంగాన్ని మరింతగా కుంగదీస్తోంది. అసలే డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూపోతుంటే అదనంగా దేశవ్యాప్తంగా 22.5 శాతం వ్యాట్ కూడా వసూలు చేస్తున్నారు. అలాంటిది ఏపిలో టిడిపి అధికారంలోకి వచ్చిన గత మూడేళ్లుగా లీటర్ డీజిల్‌పై మరో 4 రూపాయలు వ్యాట్ రూపంలో భారం మోపారు. రాష్ట్రంలో లారీలు, ట్యాంకర్లు, మినీ వ్యాన్‌లు దాదాపు 4 లక్షలకుపైగానే ఉన్నాయి. ఇక ట్రాక్టర్లు భారీ సంఖ్యలో ఉండగా, వ్యవసాయ పంపుసెట్లు కూడా లక్షల సంఖ్యలోనే ఉన్నాయి. 4 రూపాయల వ్యాట్ వల్ల లారీ యజమానులు, ఇతర వాహన యజమానులు, రైతులపై సాలీనా వందల కోట్ల రూపాయల భారం పడుతోంది.
ఈ ఒక్క రాష్ట్రంలోనే అమల్లో ఉన్న 4 రూపాయల వ్యాట్‌ను తొలగించాలంటూ ఏపి లారీ యజమానుల సంఘం నేతల ఆధ్వర్యంలో గడచిన మూడేళ్లుగా అనేకమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిగినా పరిశీలిస్తామనే హామీ మినహా ఫలితం దక్కలేదు. దీంతో నేషనల్ పర్మిట్లు కలిగిన లారీల యజమానులు చెన్నై రూట్‌లో చెన్నైలో, హైదరాబాద్ రూట్‌లో జగ్గయ్యపేట సరిహద్దు తెలంగాణలో, కోల్‌కత్తా రూట్‌లో ఒడిశా సరిహద్దులోని పెట్రోలు బంకుల్లో తమ ట్యాంకర్లను నింపుకుని ముందుకు సాగుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలో డీజిల్ అమ్మకాలు గణనీయంగా పడిపోతున్నాయని పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. లీటరుపై 4 రూపాయల ఆదాయం చూసుకుంటే 22.5 శాతం వ్యాట్, ఇతర పన్నుల రూపేణా లభించే 10 రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తోందని అంటున్నారు.
ఇదిలావుంటే ఐఆర్‌డిఎఐ ఇటీవల ఒక్కసారిగా థర్డ్ పార్టీ బీమా ప్రీమియంను 50 శాతానికి పెంచడంతో దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానులు గత మార్చి 30 నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. ఇదే సమయంలో ఏపి లారీ యజమానులు 4 రూపాయల వ్యాట్ రద్దు డిమాండ్‌ను కూడా చేర్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలానే సానుకూలంగా స్పందించిందేకానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ జోక్యంతో ఐఆర్‌డిఎఐ అధికారులు దిగివచ్చి 28 శాతం మేర ప్రీమియం రేటును తగ్గించడంతో లారీ యజమానులంతా ఏప్రిల్ 8 రాత్రి తమ సమ్మెను విరమించారు. కానీ వ్యాట్ సమస్య మాత్ర కొలిక్కిరాలేదు. దీంతో రాష్ట్రంలో లారీ యజమానుల పాలిట పెనుభారంగా మారిన 4 రూపాయల వ్యాట్ తొలగింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపట్ల లారీ యజమానులు ప్రత్యక్ష పోరుకు సిద్ధమవ్వాలనే నిర్ణయానికి వచ్చారు.

అంతర్జాతీయ స్థాయిలో
పర్యావరణాన్ని పరిరక్షిస్తాం

విశాఖ పోర్టు చైర్మన్ కృష్ణబాబు

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 21: అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా పోర్టులో పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు విశాఖ పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు వెల్లడించారు. మేజర్ పోర్టులో స్వచ్ఛతకు సంబంధించి రెండో స్థానా న్ని దక్కించుకున్న సందర్భంగా విశాఖలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోర్టులో కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా అంతర్జాతీయ కన్సల్టెంట్‌ను నియమించామని, గడచిన ఎనిమిదేళ్లలో 2,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. భవిష్యత్‌లో మరో 2,500 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్టు చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కార్గో హాండ్లింగ్ నిర్వహిస్తున్నామని, దీనివల్ల గతంతో పోలిస్తే పోర్టు ద్వారా ఎదురయ్యే కాలుష్య సమస్యలు అత్యధిక శాతం తగ్గుముఖం పట్టాయన్నారు. ముఖ్యంగా పోర్టులో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటామని, మరో రెండు లక్షల మొక్కలు నాటడం ద్వారా దేశంలోనే అత్యంత పచ్చదనం కలిగిన పోర్టుగా కూడా విశాఖ పోర్టును తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం పోర్టు కార్గో హేండ్లింగ్ సామర్థ్యం 98 మిలియన్ మెట్రిక్ టన్నులవగా, వచ్చే రెండేళ్ల నాటికి 135 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కాగా, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ నిర్వహించిన స్వచ్ఛత మిషన్ అవార్డుల ఎంపికలో విశాఖ పోర్టు 730 పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని దక్కించుకోవడం గర్వకారణమన్నారు. తొలి స్థానంలో ఉన్న హల్దియా పోర్టుకు 760 పాయింట్లు లభించాయని, గతంలో తాను హల్దియా పోర్టులో బాధ్యతలు నిర్వహించానని గుర్తు చేసుకున్నారు.