బిజినెస్

మహేశ్వరం మండలంలో విప్రో తయారీ యూనిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టు రానుంది. తెలంగాణలో విప్రో సంస్థ తన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. వరల్డ్ ఐటి కాంగ్రెస్ సందర్భంగా విప్రో సంస్థ చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ రిషద్ ప్రేమ్‌జీతో పరిశ్రమల శాఖా మంత్రి కేటీరామారావు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తాము తెలంగాణలో ఒక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రికి రిషద్‌ప్రేమ్‌జీ తెలిపారు. విప్రో కన్స్యూమర్స్ కేర్ ప్రోడక్ట్ విభాగం ఆధ్వర్యంలో సబ్బులు, ఇతర సౌందర్య సాధనాల తయారీ కేంద్రాన్ని మహేశ్వరం మండలంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం 220 కోట్ల రూపాయిల పెట్టుబడిని విప్రో పెట్టనుంది. మొత్తం 40 ఎకరాల్లో నిర్మించే ఈ తయారీ పరిశ్రమ నేరుగా 300 మందికి పరోక్షంగా మరో 200 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇప్పటికే విప్రో సంస్థ ఇతర విభాగాలు తెలంగాణలో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, నూతనంగా ఈ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన విప్రో సంస్థకు మంత్రి కేటీ రామారావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. టిఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే అనేక మెగా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చామని, ఇపుడు మరో మెగా ప్రాజెక్టు తెలంగాణకు రావడం, రాష్ట్రంలోని పెట్టుబడుల అనుకూల వాతావరణానికి అద్దం పడుతుందని అన్నారు. దీంతో పాటు తెలంగాణలో ఉన్న పలు ఇతర పెట్టుబడి అవకాశాలను మంత్రి ఈ సందర్భంగా రిషద్ ప్రేమ్‌జీకి వివరించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోకి ఐటి పరిశ్రమ తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తుందని, ఇందుకోసం ఇప్పటికే పలు జిల్లాల్లో ఐటి టవర్ల నిర్మాణం, టాస్క్ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రిషద్‌కు మంత్రి వివరించారు. వరంగల్ పట్టణంలో సైయింట్ తమ కార్యకపాలను నిర్వహిస్తోందని, తాజాగా టెక్ మహేంద్ర క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కూడా ఆ సంస్థ ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు. వరంగల్‌లో సంస్థల ఏర్పాటుకు ముందుకు రావాలని విప్రోను కోరారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ దేశంలోనే ముందుకు వరుసలో ఉందని, టిహబ్, టి వర్కు వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే మహిళా ఇంక్యుబేటర్ వి-హబ్ ఏర్పాటు చేస్తామని, అందులో విప్రో భాగస్వామ్యం కావాలని కేటీఆర్ కోరారు.