బిజినెస్

భారత ఎగుమతులకు ‘యువాన్’ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: భారతీయ ఎగుమతులకు క్షీణిస్తున్న యువాన్ విలువ ప్రధాన అవరోధంగా తయారైందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. చైనా కరెన్సీ అయిన యువాన్ విలువ పడిపోవడంతో చైనాకు భారత ఎగుమతులు ఖరీదైపోయాయన్నారు. ఇదే సమయంలో భారత్‌కు చైనా దిగుమతులు చౌకగా మారిపోయాయన్న సీతారామన్.. చైనాతో భారత వాణిజ్య లోటు పెరిగిపోతోందని పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ వాణిజ్య అభివృద్ధి, ప్రోత్సాహక మండలి తొలి సమావేశం అనంతరం సీతారామన్ విలేఖరులతో మాట్లాడారు. ‘యువాన్ విలువ పతనంతో ఆ దేశం నుంచి వివిధ రకాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాలకు దిగుమతి వ్యయం తగ్గుతోంది. ఇదే సమయంలో వివిధ దేశాల నుంచి చైనా చేసుకుంటున్న దిగుమతుల వ్యయం పెరుగుతోంది. దీనివల్ల చైనాకు పలు దేశాల నుంచి జరిగే ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోంది.’ అన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో భారత్-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 72.3 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య లోటు 49 బిలియన్ డాలర్లుగా నమోదైంది. యువాన్ విలువ పతనమైన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో వాణిజ్య లోటు మరింతగా పెరగవచ్చన్న ఆందోళన ఇటు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి, అటు దేశ పారిశ్రామిక వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. భారత వ్యవసాయ, ఐటి, ఔషధ ఉత్పత్తులకు చైనాలో మంచి డిమాండ్ ఉంది. అయితే ఆ దేశ కరెన్సీ యువాన్ విలువ క్షీణతతో ఈ ఉత్పత్తులు చైనాలోనే చౌక కావడంతో ఆ దేశం నుంచే భారత్‌కు ఇవి దిగుమతి అవుతున్నాయి. ఇది భారతీయ ఎగుమతులకు విఘాతం కలిగిస్తోంది. ఇప్పటికే వివిధ రకాల చైనా ఉత్పత్తులు భారతీయ మార్కెట్‌ను ముంచెత్తుతున్నది తెలిసిందే. దీంతో దేశీయ ఉత్పాదక సామర్థ్యం కూడా దెబ్బతింటుండగా, ఈ అంశంపై ఇప్పుడు ఆర్థిక ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాతో సమావేశం కావాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇప్పటికే 2014 డిసెంబర్ నుంచి దేశీయ ఎగుమతులు క్రమేణా క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మొత్తం అంశాన్ని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీరియస్‌గా తీసుకుంటోంది.
ఉక్కు దిగుమతులపై..
చైనా నుంచి భారత్‌కు భారీగా జరుగుతున్న ఉక్కు దిగుమతుల నేపథ్యంలో భారతీయ ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ ఉక్కు దిగుమతులపై కనీస మద్దతు ధర నిర్ణయంలో తొందరపడటం లేదన్నారు నిర్మలా సీతారామన్. కేవలం ఉక్కు దిగుమతులేగాక, మరెన్నో చైనా దిగుమతులు దేశ పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. అన్నింటిపైనా తగిన నిర్ణయం తీసుకుంటామని భరోసానిచ్చారు. ఇప్పటికే ఈ విషయంపై ఉక్కు, ఆర్థిక మంత్రిత్వ శాఖలతో చర్చించామని కూడా తెలియజేశారు. చైనా నుంచి జరుగుతున్న చౌక ఉక్కు దిగుమతులు దేశ ఉక్కు పరిశ్రమను ఇరకాటంలో పెడుతున్నాయి. ముఖ్యంగా విస్తరణ బాటలో ఉన్న ఉక్కు సంస్థలు భారీ ఎత్తున రుణాలు తీసుకోగా, చైనా ఉక్కు దిగుమతులతో ఇప్పుడీ సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఉక్కు ఉత్పాదక సంస్థలకు ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో గత ఏడాది మార్చి నాటికి 2.67 లక్షల కోట్ల రూపాయలు నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ లేదా మొండి బకాయిలు)గా మారాయంటే చైనా ఉక్కు దిగుమతుల ప్రభావం దేశీయ ఉక్కు తయారీ రంగంపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల రుణాలతో కలిపితే ఎన్‌పిఎ 3.09 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఈ క్రమంలోనే విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఉక్కుకు కనీస దిగుమతి ధరను నిర్ణయించాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది.
బంగారం దిగుమతులపై..
రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు ఊతమిచ్చేలా దేశంలోకి బంగారం దిగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడానికి తమ మద్దతు ఉంటుందని సీతారామన్ తెలిపారు. కరెంట్ ఖాతా లోటును అదుపు చేయడంలో భాగంగా విదేశాల నుంచి దేశంలోకి జరిగే బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం పన్నును పెంచినది తెలిసిందే. దీంతో బంగారం దిగుమతులపై పన్ను 10 శాతానికి చేరగా, ఇది తమ కార్యకలాపాలకు నష్టం చేకూరుస్తోందని రత్నాలు, ఆభరణాల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బంగారం దిగుమతులపై పన్నును తగ్గించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కూడా కోరుతోంది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ జిడిపిలో కరెంట్ ఖాతా లోటు 8.2 బిలియన్ డాలర్లు లేదా 1.6 శాతంగా నమోదైంది. ఏప్రిల్-జూన్ జిడిపిలో ఇది 1.2 శాతంగా ఉంది. కాగా, 2015 ఏప్రిల్-నవంబర్ కాలంలో బంగారం దిగుమతుల విలువ 22.65 బిలియన్ డాలర్లుగా ఉంది. 2014 ఏప్రిల్-నవంబర్‌లో ఇది 24.49 బిలియన్ డాలర్లుగా ఉంది.

విలేఖరులతో మాట్లాడుతున్న సీతారామన్