బిజినెస్

భారత ఆర్థిక వ్యవస్థ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల్లో భారత్ దూసుకెళ్తోందని, ఈ ఏడాది 7.7 శాతం వృద్ధిరేటును అందుకోవచ్చని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ పిడబ్ల్యుసి పేర్కొంది. ఈ ఏడాది కూడా చైనా ఆర్థిక వ్యవస్థలో మందగమనం నడుస్తుందన్న పిడబ్ల్యుసి.. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఏడు దేశాలైన చైనా, ఇండియా, బ్రెజిల్, మెక్సికో, రష్యా, ఇండోనేసియా, టర్కీల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా కనిపిస్తోందని చెప్పింది.

‘ముద్ర’కు స్వయంప్రతిపత్తి కల్పించండి
ప్రభుత్వాన్ని కోరిన సిఎఐటి
ముంబయి, జనవరి 10: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అధీనంలో నుంచి ముద్రను బయటకి తీసుకురావాలని అఖిల భారత వాణిజ్య సంఘాల సమాఖ్య (సిఎఐటి) కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. దేశంలోని చిరు వ్యాపారుల ఆర్థిక అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా వచ్చిన ముద్ర.. ఆర్‌బిఐ పర్యవేక్షణలో ఆ దిశగా పయనించడం లేదని సిఎఐటి ఆరోపించింది. చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలను అందించడానికే సూక్ష్మ సంస్థల అభివృద్ధి మరియు పునర్ ఆర్థిక వ్యవస్థ (ముద్ర)ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేసింది. తమ డిమాండ్‌ను పరిశీలించాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేసిన సిఎఐటి.. ముద్రను ఓ స్వయంప్రతిపత్తిగల సంస్థగా మార్చాలని కోరింది.

మా ప్రకటనలను
ఫేస్‌బుక్ నిరోధిస్తోంది
హైక్ మెసెంజర్ ఆరోపణ
న్యూఢిల్లీ, జనవరి 10: ఫేస్‌బుక్ తమ ప్రకటనల్లో కొన్నింటిని నిరోధిస్తోందని హైక్ మెసెంజర్ ఆరోపించింది. తొలుత సాంకేతిక కారణాల వల్ల జరిగిందని భావించామని, దీనికి సంబంధించి ఫేస్‌బుక్‌ను సంప్రదించడంతో ఆ ప్రకటనల కోసం హైక్ మెసెంజర్‌కు అనుమతి లేదని ఫేస్‌బుక్ తెలిపినట్లు హైక్ మెసెంజర్ అధికార ప్రతినిధి ఒకరు పిటిఐకి చెప్పారు. అయితే దీనిపై ఫేస్‌బుక్‌ను సంప్రదించిన పిటిఐకి ఎలాంటి సమాధానం రాలేదు. కాగా, వాట్సప్‌కు హైక్ మెసెంజర్ ప్రధాన పోటీదారుగా ఉండగా, ఫేస్‌బుక్‌కు చెందినదే వాట్సప్ కావడంతో ఇప్పుడు ఈ వ్యవహారం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైక్ మెసెంజర్‌ను భారతీ ఎంటర్‌ప్రైజెస్, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ సంయుక్తంగా నడిపిస్తున్నాయి. ఈ జాయింట్ వెంచర్‌కు భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ మిట్టల్ కుమారుడైన కవిన్ మిట్టల్ నేతృత్వం వహిస్తున్నారు. 2012 డిసెంబర్‌లో దీన్ని ప్రారంభించగా, 70 మిలియన్ల యూజర్లతో దేశంలోనే ఇది రెండో అతిపెద్ద మెసెజింగ్ యాప్‌గా ఇటీవల నిలిచింది.

కార్ల ధరలను పెంచిన హోండా
న్యూఢిల్లీ, జనవరి 10: హోండా కార్స్ ఇండియా.. కార్ల ధరలను పెంచింది. అన్ని మోడళ్ల ధరలను గరిష్ఠంగా 10,000 రూపాయల వరకు పెంచింది. బ్రియో, అమేజ్, జాజ్, మొబిలియో, సిఆర్-వి ధరలు 2,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెరిగాయి. ఇప్పటికే ఈ నెల ఆరంభం నుంచి టాటా మోటార్స్, టొయోట, స్కోడా సంస్థలు తమ కార్ల ధరలను 20,000 రూపాయల నుంచి 33,000 రూపాయల వరకు పెంచగా, మారుతి సుజుకి, జనరల్ మోటార్స్, హ్యుందాయ్ సంస్థలు 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలదాకా త్వరలో పెంచనున్నట్లు ప్రకటించాయి. అలాగే రెనాల్ట్, నిస్సాన్, బిఎమ్‌డబ్ల్యు సంస్థలు కూడా కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు వెల్లడించాయి.

విజయవాడలో రిలయన్స్ జియో వైఫై సేవలు ప్రారంభం
విజయవాడ, జనవరి 10: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. ఆదివారం విజయవాడలోని ఎమ్‌జి రోడ్డు వద్ద తమ హైస్పీడ్ వైఫై సేవలను ప్రారంభించింది. జియో అమరావతి మారథాన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ జియో నెట్ హైస్పీడ్ వైఫై సేవలను ప్రారంభించినట్లు ఓ ప్రకటనలో రిలయన్స్ జియో తెలిపింది. కాగా, గత నెల డిసెంబర్‌లో తొలుత ఈ సేవలను తమ సంస్థ సిబ్బందికి రిలయన్స్ అందుబాటులోకి తెచ్చినది తెలిసిందే.