బిజినెస్

తూ.గో. తీరంలో కలవరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జనవరి 10: ఇంతవరకు నదులు, వాగుల్లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను గురించి విన్నాం... కానీ ఇప్పుడు సముద్ర తీరంలోనూ ఇసుకను మింగేస్తున్నారు కొందరు అక్రమార్కులు. గత కొంత కాలంగా పెరిగిన నిర్మాణ రంగ కార్యకలాపాలతో ఇసుక బంగారంగా మారిపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో సరికొత్తగా సముద్ర తీర ప్రాంతంలోని ఇసుకను సైతం అక్రమంగా తవ్వి విక్రయించేస్తున్నారు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో సముద్ర కోత ప్రభావం విపరీతంగా ఉంది. ఉప్పాడ, సఖినేటిపల్లి తదితర ప్రాంతాల్లో గ్రామాలకు గ్రామాలే సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు కోనసీమలోని అల్లవరం మండలంలోని ఓడలరేవు తీర ప్రాంతంలో సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా సమీప గ్రామాల ప్రజల గుండెల్లో సునామీ రేగుతోంది. అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధికి సన్నిహితుడైన వ్యక్తి ఆధ్వర్యంలో నిత్యం ప్రొక్లెయినర్లతో తవ్వి, టిప్పర్లు, ట్రాక్టర్లలో భారీగా ఇసుకను తరలిస్తున్నారు. తీరప్రాంతంలోని ఎందుకూ పనికిరాని ఒకటీ, అరా ఎకరాల భూముల్లో ఇసుక మేటలను తొలగించి, వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకుంటామనే పేరుతో అనుమతులు పొంది.. మొత్తం తీరానే్న తవ్వి పాతరేస్తున్నారు. దీనికి స్థానిక అధికారులూ తమ వంతు సహకారం అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లాలో 13 మండలాల్లో 171 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతానికి సహజ సిద్ధంగా ఏర్పడిన మడ అడవులు, ఇసుక తినె్నలు రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. ఒక పక్క మడ అడవులు మెల్ల మెల్లగా అంతర్థానమవుతుండగా, మరోపక్క ఇసుక తవ్వకాలు ప్రమాదాన్ని మరింతగా పెంచేస్తున్నాయి. సుప్రీం కోర్టు జోక్యంతో 90వ దశకంలోనే సముద్ర తీర ప్రాంత పరిరక్షణకు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సిఆర్‌జడ్) పేరిట కొన్ని కఠినమైన నిబంధనలు విధించారు. దీని ప్రకారం సిఆర్‌జడ్ పరిధిలో ఎటువంటి తవ్వకాలు, నిర్మాణాలు చేపట్టరాదు. అయితే ఈ నిబంధనలు తమకు పట్టనట్టు తూర్పుగోదావరి జిల్లాలో వ్యవహారాలు సాగిపోతున్నాయి. తాజాగా అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండల శివారు ఓడలరేవు, కొమరగిరిపట్నం గ్రామాల పరిధిలోని సముద్రతీరానికి మానవ స్వార్థం నుండి పెను ప్రమాదం ఏర్పడింది. ఓడలరేవు వద్ద ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసి ఇక్కడ 1,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న టెర్మినల్ ప్రదేశాన్ని మెరకచేసే కాంట్రాక్టు దక్కించుకున్న ఒక ప్రజాప్రతినిధి అనుచరగణం ఇందుకు సముద్ర తీరంలో పుష్కలంగా లభించే ఇసుకను వాడేస్తోంది. ఇసుకను సుదూర ప్రాంతాల నుండి కొని తీసుకురావడం భారీ వ్యయంతో కూడుకున్నది కావడంతో తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక తినె్నలను తవ్వేస్తున్నారు. కేవలం రెండున్నర ఎకరాల భూమిలో వ్యవసాయానికి అనువుగా చేసుకోవడానికి ఇసుక మేటలు తొలగించుకుంటామని అనుమతి పొంది, సుమారు ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడీకి తెరలేపారు. దీంతో పరిసర గ్రామాల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీగా ఇసుక తవ్వేస్తే తమ గ్రామాలు సముద్రంలో కలసిపోతాయని వారు వణికిపోతున్నారు. భారీ ప్రొక్లెయినర్లతో ఇసుకను తవ్వి వందలాది వాహనాల్లో తరలిస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధి అన్న ఒకే ఒక్క కారణంగా అధికారులు కళ్లు మూసుకుంటే భవిష్యత్తులో సంభవించే విపరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తక్షణం సముద్ర తీర ప్రాంతంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను నిలువరించాలని కోరుతున్నారు. దీనిపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడానికీ కొందరు సన్నద్ధమవుతున్నారు.
కాగా, తీరంలో ఇసుక తవ్వకాలపై అమలాపురం ఆర్డీవో జి గణేష్‌కుమార్‌ను వివరణ కోరగా, ఇసుక తవ్వకాలపై విచారణ జరుపుతామని, సర్వే జరిపించి, అనుమతి పొందిన ప్రదేశాన్ని మించి తవ్వకాలు జరుగుతున్నాయా? లేదా? అనే అంశాన్ని నిర్ధారించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇసుకను తవ్వి, ట్రాక్టర్లలో నింపుతున్న దృశ్యం

సముద్రానికి చేరువలో ఇసుక తవ్వకాలు