బిజినెస్

సింటెక్స్ ఇండస్ట్రీస్ లాభం రూ. 180 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ప్లాస్టిక్, టెక్స్‌టైల్స్ సంస్థ సింటెక్స్ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం 11.14 శాతం పెరిగి 180.09 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 162.03 కోట్ల రూపాయలుగా ఉంది. క్రిందటిసారితో పోల్చితే సంస్థ ఏకీకృత అమ్మకాలు కూడా 1,826.02 కోట్ల రూపాయల నుంచి 2,044.97 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఈ మేరకు సోమవారం సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.

అక్టోబర్-డిసెంబర్‌లో
పెరిగిన టాటా స్టీల్ అమ్మకాలు

న్యూఢిల్లీ, జనవరి 11: టాటా స్టీల్ అమ్మకాలు గత నెల డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో 10 శాతం పెరిగి 2.35 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. ఉత్పత్తి 11 శాతం వృద్ధితో 2.55 మిలియన్ టన్నులుగా ఉంది. 2014 అక్టోబర్-డిసెంబర్‌లో ఈ అమ్మకాలు 2.13 మిలియన్ టన్నులకు పరిమితమవగా, ఉత్పత్తి 2.29 మిలియన్ టన్నులుగా ఉంది. ఇదిలావుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్) సంస్థ అమ్మకాలు 8 శాతం వృద్ధి చెంది 6.83 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ఉత్పత్తి 7 శాతం పెరిగి 7.4 మిలియన్ టన్నులుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) ఏప్రిల్-డిసెంబర్ వ్యవధిలో అమ్మకాలు 6.34 మిలియన్ టన్నులైతే, ఉత్పత్తి 6.89 మిలియన్ టన్నులు జరిగిందని సోమవారం సంస్థ తెలియజేసింది.

గత ఏడాది 11,192 కార్లను
అమ్మిన ఆడీ ఇండియా

న్యూఢిల్లీ, జనవరి 11: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ.. గత ఏడాది దేశీయంగా 11,192 కార్లను విక్రయించింది. 2014 అమ్మకాలతో పోల్చితే ఇది 3.14 శాతం అధికం. నాడు 10,851 యూనిట్లను అమ్మింది. అయినప్పటికీ దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్‌లో అగ్రస్థానాన్ని ఆడీ కోల్పోయింది. 2015లో 13,502 మెర్సిడెస్ బెంజ్ కార్లు అమ్ముడయ్యాయి. 2014లో ఇది 10,201 యూనిట్లను మాత్రమే విక్రయించింది. కాగా, 2015 అమ్మకాలను బిఎమ్‌డబ్ల్యు ప్రకటించాల్సి ఉంది. 2014లో ఇది 6,812 యూనిట్లను అమ్మింది.

ఏడాదిన్నర కనిష్టానికి సెనె్సక్స్

ముంబయి, జనవరి 11: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఏడాదిన్నర కనిష్టానికి పడిపోయింది. పారిశ్రామికోత్పత్తి (ఐఐపి), ద్రవ్యోల్బణం గణాంకాలతోపాటు, దేశీయ ఐటిరంగ దిగ్గజం టిసిఎస్ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలకు ముందు మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఫలితంగా సెనె్సక్స్ 109.29 పాయింట్లు కోల్పోయి 24,825.04 వద్ద స్థిరపడి 19 నెలల కనిష్ట స్థాయికి పతనమైంది.
2014 జూన్ 4న 24,805.83 పాయింట్ల వద్ద సెనె్సక్స్ ముగియగా, మళ్లీ ఈ స్థాయికి సూచీ ఇప్పుడు క్షీణించింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 37.50 పాయింట్లు దిగజారి 7,563.85 వద్ద నిలిచింది. హెల్త్‌కేర్, ఐటి, టెక్నాలజీ, ఫైనాన్స్, బ్యాంకింగ్, టెలికామ్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్ల విలువ 1.37 శాతం నుంచి 0.56 శాతం పడిపోయింది.
అయితే ఇంధనం, యుటిలిటీస్, రియల్టీ రంగాల షేర్ల విలువ 0.70 శాతం నుంచి 0.25 శాతం పెరిగింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా ఆర్థిక మందగమనం ఆందోళనలు కనిపించాయి. చైనా సూచీ షాంగై అత్యధికంగా 5.33 శాతం నష్టపోగా, హాంకాంగ్ సూచీ 2.76 శాతం దిగజారింది. సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు కూడా 1.19 శాతం నుంచి 1.54 శాతం పతనమయ్యాయి.
ఐరోపా మార్కెట్లు మాత్రం లాభాలను అందుకున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.17 శాతం నుంచి 0.78 శాతం పుంజుకున్నాయి. గత వారం సెనె్సక్స్ 1,226.57 పాయింట్లు, నిఫ్టీ 361.85 పాయింట్లు కోల్పోయినది తెలిసిందే.

మనీగ్రామ్‌తో మరోసారి
ఐసిసి కాంట్రాక్టు

దుబాయ్, జనవరి 11: ఈవెంట్ పార్ట్‌నర్‌గా మనీగ్రామ్ సంస్థతో కాంట్రాక్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) పొడిగించింది. తాజా ఒప్పందం 2023 వరకు అమల్లో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్య బదిలీ వ్యాపారంలో విస్తరించిన మనీగ్రామ్ గత ఏడాది కూడా ఐసిసికి ఈవెంట్ పార్ట్‌నర్‌గా వ్యవహరించింది. మరోవైపు స్వదేశంలో జరిగే టి-20 వరల్డ్ కప్‌లో టైటిల్ సాధించే సత్తా టీమిండియాకు ఉందని మాజీ పేసర్ జహీర్ ఖాన్ అన్నాడు. ఐసిసి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జహీర్ మాట్లాడుతూ అన్ని విభాగాల్లోనూ భారత జట్టు పటిష్టంగా ఉందని, అందుకే విజయావకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. టోర్నీ స్వదేశంలో జరుగుతుంది కాబట్టి, స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని జహీర్ అభిప్రాయపడ్డాడు. అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా వంటి మేటి స్పిన్నర్లు భారత్‌ను విజయపథంలో నడిపిస్తారని జోస్యం చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో ఆడడమే గొప్ప అనుభూతిని కలిగిస్తుందని చెప్పాడు. టైటిల్ సాధించడం మరింత ప్రత్యేకంగా ఉంటుందన్నాడు. 2011లో వాంఖడే స్టేడియంలో శ్రీలంకను ఫైనల్‌లో ఓడించి టైటిల్ సాధించిన భారత జట్టులో సభ్యుడినైనందుకు తాను ఎంతో గర్వపడుతున్నానన్నాడు.