బిజినెస్

ఇబ్బందుల్లో షిప్పింగ్ రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 29: అంతర్జాతీయ మార్కెట్ ఈ ఏడాది అనేక ఒత్తిళ్లకు గురికావల్సి వస్తుందని మారిటైమ్ గేట్‌వే మాగ్జైన్ ఎడిటర్ అండ్ పబ్లిషర్ రాంప్రసాద్ అన్నారు. ఈస్ట్‌కోస్ట్ మారిటైమ్ బిజినెస్ సమ్మిట్ శుక్రవారం విశాఖలో జరిగింది. ఈ సదస్సును ఏర్పాటు చేసిన రాంప్రసాద్ ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రపంచ మార్కెట్ చాలా ఒడిదుడుకుల్లో ఉందన్నారు. చైనా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోందని, ఆ దేశ ఎగుమతి, దిగుమతుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని గుర్తుచేశారు. దీని ప్రభావం షిప్పింగ్ రంగంపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కంటైనర్ కార్గోకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని అతిపెద్ద దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, ఫలితంగా కంటైనర్ కార్గో రవాణా ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని అన్నారు. 2015లో ఎగుమతి, దిగుమతులు, రవాణా రంగాలు లక్ష్యాలకు మించి ఫలితాలు సాధించాయని రాంప్రసాద్ చెప్పారు. అయతే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు తట్టుకుని నిలబడితే, చైనా కన్నా ఎగుమతి, దిగుమతి, షిప్పింగ్ రంగాల్లో భారత్ మెరుగైన వృద్ధి సాధించగలుగుతుందని అని అభిప్రాయపడ్డారు. భారత్‌లో 15 కొత్త పోర్టులు వస్తున్నాయని, చిన్న పోర్టులు కూడా గత ఏడాది అద్భుతంగా కార్గోను హ్యాండిల్ చేశాయని ఆయన చెప్పారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ సవ్యసాచి హజ్రా మాట్లాడుతూ పశ్చిమ తీరంలో పోర్టుల అభివృద్ధి పతాక స్థాయికి చేరుకుందని, తూర్పు తీరంలోని పోర్టులు ఇంకా వృద్ధి సాధించాల్సి ఉందన్నారు. భారత్‌తో చైనా వర్తక, వాణిజ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయని, మిగిలిన దేశాలతో పోల్చిచూస్తే, భారత్ వృద్ధిరేటు చాలా మెరుగ్గా ఉందన్నారు. తూర్పు తీరంలోని మేజర్ పోర్టులు కార్గో హ్యాండ్లింగ్‌లో పోటీ పడడం ఆశించదగ్గ పరిణామంగా పేర్కొన్నారు. హిందుస్థాన్ షిప్‌యార్డు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎల్‌వి శరత్‌కుమార్ మాట్లాడుతూ మారిటైమ్ బిజినెస్ పెరిగితే, షిప్పింగ్ ఇండస్ట్రీ బలపడుతుందన్నారు. భారత్‌లో షిప్ బిల్డింగ్‌కు చాలా అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వ విధానాలు, వ్యాపారం, అభివృద్ధి రేటు, పొరుగు దేశాలతో వ్యాపార సంబంధాలు అన్నీ ఒకదానికొకటి అనుసంధానమై సరైన మార్గంలో వెళుతున్నాయని చెప్పారు.

సదస్సులో మాట్లాడుతున్న హిందుస్థాన్
షిప్‌యార్డ్ సిఎండి ఎల్‌వి శరత్‌కుమార్

ధర చాలా ఎక్కువ
700 మెగాహెట్జ్‌పై ఎయిర్‌టెల్

న్యూఢిల్లీ, జనవరి 29: స్పెక్ట్రమ్ వేలంలో భాగంగా 700 మెగాహెట్జ్‌కు ప్రతిపాదించిన ధర చాలా అధికమని దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అభిప్రాయపడింది. ఈ ధరలో దాన్ని మేము కొనకపోవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్.. 700 మెగాహెట్జ్ శ్రేణిలో ఒక్క మెగాహెట్జ్ ధరను 11,485 రూపాయలుగా సిఫార్సు చేసినది తెలిసిందే. ఈ క్రమంలో ఈ ధర చాలా ఎక్కువని భారతీ ఎయిర్‌టెల్ ఎండి, సిఇఒ (్భరత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ అన్నారు. మరోవైపు అధిక ధర కారణంగా 700 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ కోసం ప్రధాన టెలికామ్ సంస్థలు పోటీ పడకపోవచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. భారతీ ఎయిర్‌టెల్‌తోపాటు వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ బిడ్లు దాఖలు చేయకపోవచ్చని శుక్రవారం ఓ ప్రకటనలో అభిప్రాయపడింది.

సింగరేణి జాబ్ మేళాలో
4,920 మంది పేర్ల నమోదు

హైదరాబాద్, జనవరి 29: సింగరేణి సంస్థ పరిధిలో మూడవ రోజు జరిగిన మెగా జాబ్ మేళాలో 4,920 మంది యువత తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇల్లెందు, రామగుండం, మందమర్రిలో నిరుద్యోగ యువత తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. వీరిని ఎంపిక చేసుకునేందుకు హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి 69 కంపెనీలు హాజరై అవసరమైన ఉద్యోగాలను భర్తీ ప్రక్రియ చేపట్టారు.

పన్నుల విధానంపై
జాతీయ సమావేశం

హైదరాబాద్, జనవరి 29: వాణిజ్య, పారిశ్రామిక రంగాలపై ప్రభుత్వం విధిస్తున్న ప్రత్యక్ష, ప్రత్యక్షేతర పన్నుల విధానాలపై అవగాహన కలిగించేందుకుగాను ఫిబ్రవరి 6న జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌ట్యా ప్సీ) తెలిపింది. ఈ సమావేశంలో సిఏ బిమల్ జైన్, సిఏ గోపాలకృష్ణ రాజు, సిఏ భూపేంద్ర షాలు ప్రసంగిస్తారని వివరించింది.

ఎంపెడా సభ్యుడిగా భాస్కరమూర్తి

విశాఖపట్నం, జనవరి 29: సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ ఎంపెడా సభ్యుడిగా విశాఖకు చెందిన తమటాపు భాస్కరమూర్తి నియమితులయ్యారు. ఈ సంస్థలో చైర్మన్ సహా 30 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 20 మంది అఖిల భారత సర్వీసులకు చెందిన కార్యదర్శులు, కమిషనర్లు కాగా.. ముగ్గురు పార్లమెంటు సభ్యులు ఉంటారు. మిగిలిన సభ్యులుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను నియమిస్తారు. ఈ విభాగం కింద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భాస్కరమూర్తిని నియమించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ దేశంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధిలో ‘ఎంపెడా’ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఎంపెడా సభ్యునిగా తనను నియమించడం ఆనందదాయకంగా ఉందన్నారు.

మార్చి 10న ట్రేడ్ యూనియన్ల సమ్మె

న్యూఢిల్లీ, జనవరి 29: కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, కార్మిక సంస్కరణల పేరిట చట్టాల్లో మార్పులను నిరసిస్తూ 11 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు మార్చి 10న సమ్మెకు దిగనున్నాయి. ఈ ట్రేడ్ యూనియన్లలో బిజెపి ఆధ్వర్యంలోని భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎమ్‌ఎస్) కూడా ఉండటం గమనార్హం. ఈ నెల 27న అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు సమావేశమై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సమ్మె చేయాలని తీర్మానించాయ. ఈ మేరకు శుక్రవారం 11 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఓ సంయుక్త ప్రకటన ద్వారా తెలియజేశాయి.

‘పావు శాతం వడ్డీరేట్ల తగ్గింపు’

న్యూఢిల్లీ, జనవరి 29: వచ్చే నెల 2న జరిపే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పావు శాతం చొప్పున తగ్గించే అవకాశాలున్నాయని శుక్రవారం గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అంచనా వేసింది. ఫిబ్రవరి 2న ఆర్‌బిఐ ద్రవ్యసమీక్ష జరపనుండగా, ఈ ఆర్థిక సంవత్సరానికి (2015-16) రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించి ఆర్‌బిఐ ముగింపు పలకవచ్చని ఓ రిసెర్చ్ నోట్‌లో బ్యాంక్ ఆఫ్ అమెరికా అభిప్రాయపడింది.

ఇఐఎల్ వాటా విక్రయానికి విశేష స్పందన

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రభుత్వరంగ సంస్థ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఇఐఎల్)లో 10 శాతం వాటా విక్రయానికి మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. 2.54 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయ్యింది. కాగా, శుక్రవారం జరిగిన ఈ వాటా అమ్మకం ద్వారా ప్రభుత్వానికి దాదాపు 640 కోట్ల రూపాయల నిధులు రానున్నాయి. సంస్థాగత, రిటైల్ మదుపరులు షేర్ల కొనుగోలుకు ఎంతో ఉత్సాహం కనబరిచారు. 3.36 కోట్లకుపైగా షేర్లను అమ్మకానికి పెట్టగా, 8.56 కోట్లకుపైగా బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగత మదుపరులకు 2.69 కోట్ల షేర్లను, రిటైల్ మదుపరులకు 67.38 లక్షల షేర్లను కేటాయించారు. అయితే సంస్థాగత మదుపరుల నుంచి 5.91 కోట్లకుపైగా బిడ్లు, రిటైల్ మదుపరుల నుంచి 2.64 కోట్లకుపైగా బిడ్లు వచ్చాయి. మొత్తం 8.56 కోట్లకుపైగా బిడ్లు అందుకున్నట్లు ఇఐఎల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లకు తెలిపింది. ఒక్కో షేర్ ధరను 189 రూపాయలుగా నిర్ణయించినది తెలిసిందే. ఇఐఎల్‌లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 69.37 శాతం వాటా ఉంది. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది నడుస్తోంది.