బిజినెస్

‘251’ ఇచ్చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ‘ఫ్రీడమ్ 251’.. సంచలనాలకు కేంద్ర బిందువు ఈ 3జి స్మార్ట్ఫోన్. ప్రపంచంలోనే అంత్యంత చౌక స్మార్ట్ఫోన్‌గా దేశీయ మొబైల్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ దీన్ని గతవారం పరిచయం చేయగా, ఈ ఫోన్ ప్రకటన వెలువడిన దగ్గర్నుంచి రోజుకో కొత్త వార్త ఉంటూనే ఉంటోంది. ఇప్పుడు తాజా వార్తేమిటంటే? ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌లో నమోదైన తొలి 30,000 ఆర్డర్ల నుంచి తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లిస్తామని రింగింగ్ బెల్స్ ప్రకటించింది. ఫ్రీడమ్ 251 ఆన్‌లైన్ బుకింగ్స్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో సర్వర్లు డౌనై బుకింగ్స్ నిలిచిపోగా, 24 గంటల తర్వాత మళ్లీ బుకింగ్స్‌ను రింగింగ్ బెల్స్ తీసుకున్నది తెలిసిందే. ఒకేసారి భారీగా అవుతున్న బుకింగ్స్‌తో సర్వర్లపై భారం పడుతున్నందున ఒక ఈ-మెయిల్, మొబైల్ నెంబర్‌తో ఒక్కసారే బుకింగ్ అయ్యేలా రింగింగ్ బెల్స్ చేసింది. అయితే సర్వర్లు డౌన్ కావడానికి ముందు 30,000 ఆర్డర్లు నమోదవగా, వీటికి రింగింగ్ బెల్స్ డబ్బులను తీసుకుంది. తర్వాత మొదలైన బుకింగ్స్‌కు మాత్రం డబ్బులు తీసుకోలేదు. ఈ క్రమంలో ఆ తొలి 30,000 ఆర్డర్లకు సంబంధించి వసూలు చేసిన సొమ్మును తిరిగిచ్చేస్తామని రింగింగ్ బెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ గోయల్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఓ జాతీయ వార్తా చానెల్ తెలపగా, ఫోన్లను అందుకున్నప్పుడే కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకోదలిచామని గోయల్ చెప్పారు. కాగా, బుకింగ్ విజయవంతమయ్యాక 48 గంటల్లోగా ఆ బుకిం గ్ నమోదైనట్లు కస్టమర్ల ఈ-మెయిల్‌కు సందేశం అందినప్పటికీ, దీనికి సంబంధించి జరిపిన చెల్లింపుల వివరాల సందేశం మాత్రం కస్టమర్లకు అందలేదని రింగింగ్ బెల్స్ తెలిపింది. దీంతో ఏ కస్టమర్ల నుంచైతే పేమెంట్ అందుకున్నామో వారికి తిరిగి చెల్లించాలని నిర్ణయించుకున్నామని, ఫోన్ డెలివరీలోనే ఆ డబ్బులు తీసుకోదలిచామనే నిర్ణయానికి వచ్చినట్లు రింగింగ్ బెల్స్ తెలిపింది. దీనివల్ల సంస్థ పారదర్శకతపై నమ్మకం పెరుగుతుందని, ఎలాంటి అపనమ్మకాలకు తావుండదని రింగింగ్ బెల్స్ అధ్యక్షుడు అశోక్ చద్ధా ఓ అధికారిక ప్రకటనలో అన్నారు. తొలి దశలో భాగంగా రెండు రోజులపాటు బుకింగ్స్‌ను కొనసాగించి, ఆపై నిలిపివేసిన రింగింగ్ బెల్స్.. దాదాపు 6 కోట్ల ఆర్డర్లను పొందినట్లు ప్రకటించింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ
మరోవైపు 3జి స్మార్ట్ఫోన్‌ను ఫ్రీడమ్ 251 పేరిట కేవలం 251 రూపాయలకే అందిస్తామని రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటించిన క్రమంలో ఆ సంస్థ, దాని ప్రమోటర్ల ఆర్థికపరమైన అంశాలు, సామర్థ్యం, బ్యాంక్ ఖాతాల వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన విచారణను శనివారం ఈడి ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే రింగింగ్ బెల్స్‌కుగానీ, దాని ప్రమోటర్లకుగానీ ఇప్పటిదాకా దీనిపై ఎలాంటి సమన్లు లేదా నోటీసులు పంపలేదని ఆ వర్గాలు చెప్పాయి. ఇదిలావుంటే ఈ నొయిడాకు చెందిన సంస్థపై ఎక్సైజ్, ఆదాయ పన్ను (ఐటి) శాఖలు కూడా దృష్టి సారించాయి. సంస్థ ఆర్థిక సామర్థ్యం, నిర్మాణం, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, కంపెనీ నమోదు తదితర వివరాలను కనుక్కొంటున్నాయి. 251 రూపాయలకే స్మార్ట్ఫోన్‌ను ఎలా అందిస్తారన్న దానిపై విచారణ జరిపించాలని ఇప్పటికే మొబైల్ పరిశ్రమ వర్గాలు టెలికామ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయగా, భారత సెల్యులార్ అసోసియేషన్ దీనిపై రాసిన లేఖలో రాయితీపైనా 3,500 రూపాయల కంటే తక్కువకు స్మార్ట్ఫోన్‌ను అమ్మడం అసాధ్యమని పేర్కొన్నది తెలిసిందే. మరోవైపు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ధ్రువీకరణ లేకుండానే ఫ్రీడమ్ 251ను మార్కెట్‌లో ఎలా అమ్ముతారనే దానిపైనా టెలికామ్ మంత్రిత్వ శాఖ ఆరా తీస్తుండగా, సంస్థ విశ్వసనీయతను పరిశీలించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికీ సూచించింది. ఇదిలావుంటే యాడ్‌కామ్ అనే సంస్థ ఫోన్ మాదిరిగానే ఫ్రీడమ్ 251 ఉందని, ఇందులో ఆఫర్ చేసిన యాప్‌లలో యాపిల్ ఐఫోన్‌లోనివి కూడా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తుండగా, మొబైల్ మార్కెట్‌లోకి వచ్చాక చూడాలని రింగింగ్ బెల్స్ అంటోంది. ఇంకోవైపు ఫ్రీడమ్ 251కు సంబంధించి కస్టమర్ కేర్ సర్వీసులను అందించిన సైఫ్యూచర్ సంస్థ.. తమకు రావాల్సిన డబ్బులను రింగింగ్ బెల్స్ ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. అయితే కస్టమర్ల నుంచి వచ్చే కాల్స్‌ను అందుకోవడంలో సైఫ్యూచర్ విఫలమైందని రింగింగ్ బెల్స్ చెబుతుండగా, తొలుత తమ సేవలపట్ల రింగింగ్ బెల్స్ సంతృప్తి వ్యక్తం చేసిందని, డబ్బులు అడగ్గానే తప్పించుకోవడం మొదలుపెట్టిందని సైఫ్యూచర్ అంటోంది. మొత్తానికి అనేక అనుమానాలు, మరెన్నో ఆరోపణలకు తావిచ్చిన ఫ్రీడమ్ 251పై అంతకుమించి అందరిలోనూ అమితాసక్తి నెలకొందిప్పుడు.
అమితి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన మోహిత్ కుమార్ గోయెల్ రింగింగ్ బెల్స్ సంస్థను ఐదు నెలల క్రితం నెలకొల్పగా, ఇంతకుముందు ప్రపంచంలోనే అత్యంత చౌక 4జి స్మార్ట్ఫోన్‌ను 2,999 రూపాయలకే రింగింగ్ బెల్స్ విడుదల చేసింది. ఈ క్రమంలో 17న ‘ఫ్రీడమ్ 251’ పేరుతో 3జి స్మార్ట్ఫోన్‌ను 251 రూపాయలకే అందుబాటులోకి తీసుకువచ్చారు. దీన్ని 4 అంగుళాల స్క్రీన్, క్వాల్‌కమ్ 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్‌తో రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్ లాలీపప్ ఆధారిత ఈ స్మార్ట్ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం 8 జిబి. దీన్ని 32 జిబి వరకు పెంచుకోవచ్చు. 3.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉన్నాయి. 1,450 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఉమెన్ సేఫ్టీ, స్వచ్ఛ్ భారత్, ఫిషర్‌మెన్, ఫార్మర్, మెడికల్, వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర సౌకర్యాలన్నీ ఇందులో ఉన్నాయి.

చిత్రం... రింగింగ్ బెల్స్ ఫ్రీడమ్ 251
3జి స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న దృశ్యం (ఫైల్ ఫోటో)