బిజినెస్

ఇంధన పొదుపులో జివిఎంసికి జాతీయ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 9: ఇంధన పొదుపులో మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జివిఎంసి) జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. ఇంధన పొదుపు, ఖర్చు నియంత్రణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ విభాగం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సంస్థ 2015వ సంవత్సరానికి ఇంధన పొదుపు అవార్డుకు జివిఎంసిని ఎంపిక చేసింది. ఈ నెల 14న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఈ అవార్డును అందుకోనున్నారు. హుదూద్ తుపాను అనంతరం విశాఖ నగర పరిధిలో వీధి దీపాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం రావడంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు నగరంలో ఎల్‌ఇడి లైట్లను అమర్చే ప్రక్రియను చేపట్టింది. సుమారు లక్ష వీధి దీపాలకు గాను ఇప్పటి వరకూ 80 శాతం ఎల్‌ఇడి లైట్లను అమర్చారు. ఎల్‌ఇడి లైట్ల ఏర్పాటుతో జివిఎంసిలో ఇంధన ఛార్జీలు దాదాపు సగం వరకూ నియంత్రించగలిగారు. గతంలో నెలకు రూ.1.5 కోట్ల మేర జివిఎంసి విద్యుత్ ఛార్జీలను చెల్లించేది. ఎల్‌ఇడి లైట్లను అమర్చడం ద్వారా ఈ ఖర్చు రూ.85 నుంచి 90 లక్షలకు తగ్గింది. ఇంధనం పొదుతో పాటు ఖర్చు ఆదా కావడంతో జివిఎంసి ఆర్థికంగా లాభపడింది. ఈ సందర్భంగా జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంధన పొదుపు అవార్డును జివిఎంసి దక్కించుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతేడాది హుదూద్ తుపాను సంభవించడానికి ముందు జనవరి నుంచి అక్టోబర్ వరకూ సాధారణ విద్యుత్ దీపాల నిర్వహణ ద్వారా జివిఎంసి ఇంధన వినియోగం,ఖర్చు, హుదూద్ అనంతరం ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకూ ఎల్‌ఇడి వీధి దీపాలను అమర్చిన తర్వాత ఇంధన వినియోగం, ఖర్చును బేరీజువేసి ఈ అవార్డుకు ఎంపిక చేశారన్నారు. నగరంలో ఇప్పటి వరకూ 80 శాతం మేర ఎల్‌ఇడి వీధి దీపాలను అమర్చామన్నారు. మిగిలిన వాటిని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

స్మార్ట్ వార్డుల పర్యవేక్షణకు
ప్రత్యేక డెస్క్‌లు

రాజమండ్రి, డిసెంబర్ 9: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని స్మార్ట్ వార్డులను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా డెస్క్‌లు ఏర్పాటుచేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా ప్రాంతీయస్థాయిలో రీజనల్ డైరక్టర్లను, అర్బన్ స్థానిక సంస్థల స్థాయిలో కమిషనర్లను డెస్క్ మేనేజర్లుగా నియమిస్తూ ప్రత్యేక వ్యవస్థ ఏర్పడనుంది. పర్యవేక్షణ డెస్క్‌ల్లో పనిచేసేందుకు సిబ్బంది నియామకం కూడా జరుగుతుంది. తొలి దశలో ఆయా అర్బన్ స్థానిక సంస్థల్లోని 20శాతం వార్డులను స్మార్ట్ వార్డులుగా గుర్తించి, వాటిపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఇందులో కూడా మురికివాడలు ఉన్న వార్డులకు ప్రాధాన్యతనివ్వాలని పురపాలకశాఖ ఆదేశించింది. స్మార్ట్ వార్డులుగా గుర్తించిన వార్డుల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, పచ్చదనం, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలని కమిషనర్లకు, రీజనల్ డైరక్టర్లకు పురపాలకశాఖ ఆదేశాలు జారీచేసింది.
ఈ నెల 20నాటికి ప్రాంతీయ, అర్బన్ స్థానిక సంస్థల స్థాయిల్లో మోనిటరింగ్ డెస్క్‌ల ఏర్పాటు, తొలి దశలోని 20శాతం స్మార్ట్ వార్డుల గుర్తింపు కార్యక్రమాన్ని పూర్తిచేసి, వచ్చే ఏడాది 31నాటికి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుందని కమిషనర్లను రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది.
దీని ప్రకారం చూస్తే ఇప్పటివరకు ప్రచారానికి పరిమితమైన స్మార్ట్‌వార్డుల నినాదం, రానున్న రోజుల్లో కార్యాచరణకు నోచుకుంటుందన్న మాట. స్మార్ట్ వార్డులుగా గుర్తించిన వార్డుల్లో ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా, నిబంధనలకు అనుగుణంగా తలసరి తాగునీటి సరఫరా, మురికినీటి పారుదల డ్రెయిన్ల నిర్వహణ, నిర్మాణం, వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం, పార్కులు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ ఐలాండ్ల అభివృద్ధి, పచ్చదనం, చెత్త సేకరణ తదితర ప్రధాన అంశాలపై స్మార్ట్ వార్డుల కార్యక్రమంలో దృష్టి కేంద్రీకరిస్తారు. దీనికోసం స్వచ్చంద సేవా సంస్థలు, కార్పొరేట్ సంస్థలను కూడా భాగస్వామ్యం చేస్తారు.