బిజినెస్

ప్రధాన ఓడరేవులను ప్రైవేటీకరించే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: దేశంలోని మేజర్ పోర్టులను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని మేజర్ పోర్ట్స్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ సమన్వయ కమిటీ ఆరోపించింది. పోర్టుల ప్రైవేటీకరణ అంశంలో ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు దేశంలోని 11 మేజర్ పోర్టుల్లో కార్మికులకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐదు ఫెడరేషన్ల సమన్వయ కమిటీ సమావేశాలు గత రెండు రోజులుగా విశాఖలో జరుగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా ఐక్యవేదిక ప్రతినిధులు సామంత్ రే, మహమ్మద్ హనీఫా, వివి రామారావు, నరేంద్రరావు తదితరులు బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మేజర్ పోర్టుల ప్రైవేటీకరణకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పోర్ట్ డాక్ అండ్ వాటర్ ఫ్రంట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వివి రామారావు మాట్లాడుతూ 1991లో ప్రారంభమైన నూతన ఆర్థిక, సరళీకృత విధానాలు మేజర్ పోర్టులను ప్రైవేటీకరించే దిశగా నడిపిస్తున్నాయన్నారు. ఒకప్పుడు 3 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు ఉండే పోర్టుల్లో ప్రస్తుతం 40 వేల మంది ఉద్యోగులు, కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారన్నారు. యాంత్రీకరణ, పిపిపి విధానాల వల్ల పోర్టుల్లో ప్రైవేటు ప్రాతినిథ్యం పెరుగుతోందని, చివరకు పోర్టులు ప్రైవేటు సంస్థల పరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టులను ప్రైవేటీకరించే కుట్రకు పాల్పడుతున్న ప్రభుత్వ విధానాలను నిలువరించేందుకే దేశంలోని ఐదు ప్రధాన ఫెడరేషన్లు ఐక్య పోరాటానికి సన్నద్ధమయ్యాయన్నారు. ఫెడరేషన్ ప్రతినిధి సామంత్ రే మాట్లాడుతూ మేజర్ పోర్టుల్లో సేవలను పిపిపి విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ విధానం క్రమంగా పోర్టుల ప్రైవేటీకరణకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ఎగుమతులు, దిగుమతుల్లో 47 శాతం మేజర్ పోర్టుల ద్వారానే జరుగుతోందని, విదేశీ మారకద్రవ్య ఆర్జనలో, ఆర్థిక సుస్థిరత, ఉపాధి కల్పనలో మేజర్ పోర్టులు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మేజర్ పోర్టుల ద్వారా రూ. 55 వేల కోట్లు, మైనర్ పోర్టుల ద్వారా రూ. 1,850 కోట్ల మేర ఆదాయం లభించిందని గుర్తుచేశారు. ఇదే సందర్భంలో ప్రైవేటు రంగంలో నడుస్తున్న పోర్టులు.. పన్నులు, టాక్స్‌ల చెల్లింపులో ప్రభుత్వాలను సైతం మభ్యపెడున్నాయని ఆరోపించారు. ఫెడరేషన్ మరో ప్రతినిధి మహమ్మద్ హనీఫా మాట్లాడుతూ టారిఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా పోర్టుల నియంత్రణకు పాల్పడుతోందని, ప్రభుత్వరంగ పోర్టుల కార్గోని ఓవర్ కెపాసిటీ పేరిట ప్రైవేటు పోర్టులకు తరలిస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం తదితర ప్రైవేటు పోర్టులకు ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. దేశవ్యాప్తంగా మేజర్ పోర్టుల్లో 10 కంటైనర్ కార్గో టెర్మినల్స్ ఉండగా, తొమ్మిదింటిని ప్రైవేటు రంగానికి అప్పగించేశారన్నారు. పోర్టుల్లో ప్రైవేటు సేవల వల్ల దేశ భద్రతకు తీరని ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కీలక విభాగాల్లో సైతం ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాల భర్తీకి పూనుకుంటున్నారని ఆరోపించారు. పోర్టుల ఆధునీకరణకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఈ ముసుగులో ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటించారు. టి నరేంద్రరావు మాట్లాడుతూ మేజర్ పోర్ట్స్ అథారిటీ యాక్ట్-2015ను అమలు చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం పోర్టులను కంపెనీ యాక్టు కిందకు తెచ్చే కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనివల్ల మేజర్, మైనర్ పోర్టుల ఆధీనంలోని కీలక విభాగాలతో పాటు విలువైన భూములు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టుల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఈనెల 10న ఐక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.