బిజినెస్

కీలక వడ్డీరేట్లు పావుశాతం తగ్గొచ్చు: సిటి గ్రూప్ అంచనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దిగివచ్చిన ద్రవ్యోల్బణం గణాంకాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యం 3.5 శాతంగా నిర్ణయించడం మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రాబోయే ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించవచ్చని సిటి గ్రూప్ అంచనా వేసింది. కీలక వడ్డీరేట్లయిన రెపో, రివర్స్ రెపోలను 25 బేసిస్ పాయింట్ల చొప్పున ఆర్‌బిఐ తగ్గించవచ్చని మంగళవరం అభిప్రాయపడింది. సోమవారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడం, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం మైనస్‌లోనే కదలాడటం, పారిశ్రామికోత్పత్తి గణనీయంగా క్షీణించడం, ఎగుమతులు పతనమవుతుండటం మధ్య ఆర్‌బిఐ వడ్డీరేట్ల తగ్గింపునకు అవకాశాలున్నాయంది.

మరిన్ని హంగులతో..

దేశీయ మార్కెట్‌లోకి
సరికొత్త సుజుకి యాక్సెస్ 125

న్యూఢిల్లీ, మార్చి 15: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్.. మంగళవారం ఇక్కడ సరికొత్త సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 53,887 రూపాయలు. 2020 నాటికి భారతీయ మార్కెట్‌లో ఏటా 10 లక్షల ద్విచక్ర వాహన అమ్మకాలను జరపాలని చూస్తున్నట్లు సంస్థ ఈ సందర్భంగా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో 3.45 లక్షల టూవీలర్లను అమ్మిన సుజుకి.. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో 3.2 లక్షల యూనిట్ల అమ్మకాలు జరగవచ్చని అంచనా వేస్తోంది. కొత్త వెర్షన్ యాక్సెస్ విడుదల ఆలస్యం కావడం వల్లే ఈసారి అమ్మకాలు గతంతో పోల్చితే తగ్గాయంది. కాగా, 125సిసి, అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన స్కూటర్లను, 150సిసి, అంతకంటే అధిక సత్తా కలిగిన బైకులను మార్కెట్‌కు పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఔట్‌గోయింగ్ ఎండి మసయోషి ఇటో విలేఖరులకు తెలిపారు.

తెలంగాణ మార్కెట్‌లోకి
నయా టివిఎస్ విక్టర్

హైదరాబాద్, మార్చి 15: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టివిఎస్ మోటార్.. మంగళవారం ఇక్కడ నూతన టివిఎస్ విక్టర్ 110సిసి మోటార్‌సైకిల్‌ను తెలంగాణ మార్కెట్‌కు పరిచయం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో భారతీయ ద్విచక్ర వాహన అమ్మకాలు 5-6 శాతం పెరగవచ్చని, ఈ క్రమంలో సంస్థ అమ్మకాలు 10 శాతం వృద్ధి చెందుతాయన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా టివిఎస్ మోటార్ సేల్స్ అండ్ సర్వీస్ ఉపాధ్యక్షుడు జెఎస్ శ్రీనివాసన్ ఓ ప్రకటనలో తెలిపారు. 2002లో టివిఎస్ విక్టర్ మార్కెట్‌లోకి విడుదలవగా, దేశీయంగా ఇది సంస్థకు పునాదులు వేసిందని శ్రీనివాసన్ అన్నారు. వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుని మోటార్ సైకిళ్ల అమ్మకాల్లో సంస్థకు మంచి గుర్తింపును తెచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని హంగులతో సరికొత్త విక్టర్‌ను వినియోగదారుల ముందుకు తెచ్చామని ఆయన తెలిపారు. కాగా, ఈ నయా విక్టర్‌తో మోటార్‌సైకిళ్ల విభాగంలో 2 శాతం వాటా పెరుగుతుందని టివిఎస్ భావిస్తోంది.

ఇంజనీరింగ్ చదివితే సరిపోదు...

సకల నైపుణ్యాలను అలవరచుకోవాలి: ఎల్‌అండ్‌టి ఎండి వివేక్ బి గాడ్గిల్

ఆంద్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 15: విద్యార్థులు ఇంజనీరింగ్ చదివితే సరిపోదని, దానికి అనుబంధంగా అనేక కౌశలాలు, నైపుణ్యాలను అలవరచుకోవల్సి ఉంటుందని ఎల్‌అండ్‌టి చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ బి గాడ్గిల్ అన్నారు. ఇక్ఫాయి నిర్వహించిన ప్రాస్పెక్టస్ ఆవిష్కరించేందుకు వచ్చిన గాడ్గిల్ మాట్లాడుతూ ఒకప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీతో అన్ని విషయాలూ తెలిసేవని, కాని నేడు ఇంజనీర్లకు వ్యయ ప్రణాళిక, అంచనాలు, చర్చించి కాంట్రాక్టు కుదర్చడం, ముందస్తు ప్రణాళిక, వనరులు సమకూర్చుకోవడం, బిల్లులు రూపొందించడం, బడ్జెట్‌ను మానిటరింగ్ చేయడం, పేమెంట్ ఇన్వాయిస్‌లు, అసెస్‌మెంట్లు, వివాదాల పరిష్కారం, వ్యయ నియంత్రణ, మొత్తం ప్రాజెక్టు వ్యయం, దశలవారీ ప్రాజెక్టులు ఉంటే వాటికి అయ్యే ఖర్చులు, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, తుది అకౌంట్ల రూపకల్పన వంటి అనేక అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం శ్రీలంక వంటి దేశాల్లో క్వాంటిటీ సర్వేయింగ్ అనేది అందుబాటులోకి వచ్చిందని, కాని భారత్‌లో ఏ ఒక్క విశ్వవిద్యాలయం దీనిని ఆఫర్ చేయడం లేదని అన్నారు. ఇక్ఫాయి వంటి సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి కోర్సులను ప్రారంభించాలని సూచించారు. కాగా, విద్యార్థులు ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ తమ విద్యను కొనసాగించాలని, ఇంజనీరింగ్ విద్యార్థుల కు ఇది ముఖ్యమన్నారు.
మేము సిద్ధం: ప్రొఫెసర్ సుధాకర్
వినూత్నమైన కోర్సులను ఆఫర్ చేయడంలో ఇక్ఫాయి ఎప్పుడూ ముందంజలో ఉంటుందని సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రావు స్పష్టం చేశారు. ఇక్ఫాయి యూనివర్శిటీ అనుబంధ సంస్థ ఇక్ఫాయిటెక్‌లో ఐదు విభాగాల్లో నాలుగేళ్ల బిటెక్ కోర్సును ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. బిబిఎ, ఎల్‌ఎల్‌బి, బిఎ-ఎల్‌ఎల్‌బి, బిబిఎ తదితర కోర్సులను ఆఫర్ చేస్తున్నామని వివరించారు. కాగా, ఐటిఎల్‌ఎ పరీక్షను మే 15న నిర్వహిస్తామని ఆసక్తి ఉన్న వారు వెబ్‌సైట్‌ను పరిశీలించాలని కూడా ఈ సందర్భంగా ఆయన సూచించారు.