బిజినెస్

నల్లబెల్లం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: నల్లబెల్లం కొనుగోలుకు మార్క్‌ఫెడ్ సన్నద్దమైంది. దీంతో చెరకు రైతులకు ఊరట లభించినట్లయింది. చిత్తూరు జిల్లాలో నల్లబెల్లంపై ఆంక్షలు, మరో పక్క సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడడంతో చెరకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారినది తెలిసిందే. జిల్లాలో వేరుశనగ తరువాత మామిడి, చెరకు ప్రధాన వాణిజ్య పంటలు. సుమారు 20వేల హెక్టార్లలో చెరకు సాగవుతోంది. గత పదేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేరుశనగ పంట తుడిచిపెట్టుకుపోయింది. ఈ తరుణంలో చెరకు పంటపై రైతులు ఆశలు పెంచుకున్నారు. పంట సాగు కోసం వేలకు వేలు పెట్టుబడులు పెట్టారు. పంట చేతికొచ్చే సమయానికి చిత్తూరు, గాజులమండ్యంలోని సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయ. దీంతో విధిలేక బెల్లం తయారీపై రైతులు మక్కువ చూపాల్సి వచ్చింది. అయితే ఈ విధంగా తయారైన బెల్లంలో 80 శాతం నల్లబెల్లం తయారవగా, నల్ల బెల్లంపై ఆంక్షలున్న కారణంగా రైతులు అమ్ముకోలేని పరిస్థితి తలెత్తింది.
గతంలో ఇలా తయారైయ్యే బెల్లం మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలతోపాటు తెలంగాణకు ఎగుమతి అయ్యేది. అయితే మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో చెరకు సాగు విస్తీర్ణం పెరిగి పోవడంతో అక్కడికి ఎగుమతులు నిలిచిపోయాయి. తెలంగాణలో ఇటీవల నాటుసారా వల్ల అనేక మంది మృత్యువాత పడడంతో ఇక్కడ కూడా బెల్లంపై ఆంక్షలు విధించారు. దీంతో తెలంగాణకూ బెల్లం ఎగుమతులు పూర్తిగా స్థంబించిపోయాయి. ఫలితంగా చెరకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
మరోపక్క వ్యాపారులు కూడా బెల్లం కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో రైతుల వద్దే బెల్లం మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. అష్టకష్టాలు పడి వేలకు వేలు ఖర్చుపెట్టి బెల్లం తయారు చేస్తే కొనేవారు లేక, ఇళ్లలో నిల్వ ఉంచుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల పలువురు రైతులు నల్ల బెల్లాన్ని కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని నల్లబెల్లంను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్‌ను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మార్క్‌ఫెడ్ అధికారులు ఈ ఏడాది వెయ్యి టన్నుల నల్లబెల్లం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కిలో ధరను 27 రూపాయలుగా నిర్ణయించారు. నిజానికి గత ఏడాది 550 టన్నులు కొనుగోలు చేయగా, అంతకుముందు 750 టన్నులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది మాత్రం వెయ్యి టన్నులు కొనుగోలు చేయాలనుకుంటున్నారు. దీనిపై రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, ఇందుకోసం మూడు కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వానికి సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపారు.
త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాల ద్వారా బెల్లం కొనుగోలు చేయాలని కూడా నిశ్చయించారు. తొలి విడత చిత్తూరు, పుంగనూరు, పుత్తూరు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి బెల్లం కొనుగోలు చేయనున్నారు. కాగా, ఇటీవల బెల్లం కొనుగోలుపై జాయింట్ కలెక్టర్, ఎక్సైజ్ శాఖ ఇసి, కేన్ కమిషనర్, వ్యవసాయశాఖ జెడి, మార్కెట్ కమిటి ఎడి, మార్కెట్ డిఎం ఆధ్వర్యంలో కమిటి కూడా ఏర్పాటైంది. ఈ బెల్లం కొనుగోలుపై ప్రత్యేక కార్యచరణను కమిటీ సిద్ధం చేసింది. ఇది రైతులకు ఊరటనిస్తోంది.