బిజినెస్

డాలర్ల పంటకు ‘పిల్ల’ సమస్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 5: డాలర్ల పంటగా పేరొందిన రొయ్యల సాగుకు నాసిరకం సీడ్ బెడద ఎక్కువైంది. గత కొనే్నళ్లుగా ఆక్వాను ఈ సమస్య వైరస్‌లా వెంటాడుతోంది. ఎక్కడికక్కడ దొడ్డిదారిన హేచరీలు ఏర్పాటుచేసి, నాసిరకం సీడ్ ఉత్పత్తిచేసి, యధేచ్ఛగా అమ్మకాలు చేస్తున్నారు. ఫలితంగా రొయ్య రైతు నష్టాలను చవిచూస్తున్నాడు. ఈ సమస్య ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యల సాగుచేసే అన్ని జిల్లాలకు సోకింది. రాష్ట్రంలో సుమారు 980 కిలోమీటర్ల తీర ప్రాంతముంది. కోస్తా జిల్లాలుగా పేరొందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రొయ్యల సాగు ఎక్కువ జరుగుతుంది. ప్రారంభంలో ఉప్పునీటితోనే ఈ సాగు జరిగేది. రాను రాను మంచినీటి ఆధారిత రొయ్యల సాగు కూడా అందుబాటులోకి వచ్చింది. తొమ్మిది జిల్లాల్లో సుమారు 4 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. వనామీ వెరైటీ రొయ్య అందుబాటులోకి వచ్చిన తరువాత సాగు మరింత విస్తృతమైంది.
పెరుగుతున్న అనధికార హేచరీలు
శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు తీరాన్ని అనుకుని ఉన్న అన్ని జిల్లాల్లో రొయ్యల సాగు విస్తృతంగా సాగుతుండటంతో అనధికార హేచరీలు రోజురోజూకి పెరిగిపోతున్నాయి. విదేశాల్లో భారత రొయ్యలకు గిరాకీ ఉండటం, పెరుగుతున్న సాగు అవసరాలకు అనుగుణంగా సీడ్ లభ్యంకాక అనధికార హేచరీల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రైతులు వనామీ రకం సీడ్‌ను తమిళనాడులోని క్వారంటైన్ నుంచి మాత్రమే తెచ్చుకునే వెసులుబాటు ఉంది. కాని అంత దూరం వెళ్లి తెచ్చుకోవడం ఇబ్బందికావడంతో స్ధానికంగా ఉన్న అనధికారిక హేచరీలను రైతులు ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ అనుమతులు ఉన్న హేచరీలకు వాటి సామర్థ్యాన్ని బట్టి 1000 నుండి 4000 వరకు తల్లి రొయ్యలను సరఫరా చేస్తారు. వీటి నుంచి 4 లేదా 5 సార్లు మాత్రమే పిల్లలను ఉత్పత్తి చేయాలి. కానీ సీడ్‌కు డిమాండ్ ఉండటంతో అంతకంటే ఎక్కువసార్లు ఉత్పత్తి చేస్తున్నారు. ఫలితంగా రొయ్య పిల్లలు బలహీనంగా ఉండటంతో పాటు, వ్యాధి నిరోధకశక్తి తగ్గుతోంది. మరికొందరు హేచరీల నిర్వాహకులు స్ధానికంగానే ఉన్న చెరువుల నుంచి సాంకేతిక నిపుణుల ద్వారా తల్లి రొయ్యలను గుర్తించి యాంటిబయోటిక్స్ వాడి, పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటి నాణ్యతా అంతంతమాత్రంగానే ఉంటోంది. సాగు విస్తీర్ణత అధికంగా ఉండి, సీడ్‌కు గిరాకీ పెరిగిన నేపథ్యంలో రైతుల అవసరాన్ని, ఆదుర్దాను కొందరు హేచరీల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రమాణాలకు విరుద్దంగా సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. చివరికి రొయ్యలకు తెగుళ్లు సోకి, రైతు నష్టపోతున్నాడు. ఒక ఎకరం చెరువుకు కనీసం లక్ష నుంచి 2 లక్షల పిల్లలను వదులుతున్నారు. నెల రోజుల లోపే ఈఎంఎస్ (ఎర్లీ మోటారు సిండ్రోమ్) వ్యాధి సోకి, సగం పిల్లలు చనిపోతున్నాయి. మిగిలిన వాటిలో వైట్‌స్పాట్ సోకి, 10 గ్రాములు పెరిగే లోపు అవికూడా అధికంగా చనిపోతున్నాయి. దీని కారణంగా ప్రతీ సీజన్‌లో 80 శాతం మంది రైతులు నష్టపోతున్నారు. వైరస్ కారణంగా రైతులు కూడా భయంతో 30, 40, 50 కౌంట్‌లలోనే రొయ్యలను అమ్మేస్తున్నారు. మరోపక్క వైరస్ కారణంగా పిల్లలు వదిలిన సమయం నుంచి అధిక మోతాదులో మందులు వినియోగించాల్సి వస్తోంది. దానివల్ల రొయ్యల నాణ్యతకు గండి పడుతోంది.
పట్టించుకోని మత్స్యశాఖ, ఎంపెడా
దేశ ఆర్థిక వ్యవస్థకు సైతం ఎంతో కీలకమైన రొయ్యల సాగులో జరుగుతున్న ఈ విపరిణామాలను అటు రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖగాని, ఇటు కేంద్ర ప్రభుత్వ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(ఎంపెడా) గాని సరైన రీతిలో పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మత్స్యశాఖ తమకు చేపల ఉత్పత్తి మాత్రమే సంబంధం అంటూ చెబుతుంది. ఎంపెడా కూడా రొయ్యల సాగు తమకు పట్టనట్లు వ్యవహరిస్తుందని రొయ్య రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, నాణ్యమైన సీడ్‌ను అందుబాటులోకి తీసుకువస్తే అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందనడంలో ఎటువంటి సందేహంలేదని ఆక్వా రంగ నిపుణులు పేర్కొంటున్నారు.