బిజినెస్

ఆర్థిక వ్యవస్థకు చక్కని ఉద్దీపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటును పావు శాతం తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం అభిప్రాయపడ్డారు. రుణాలపై వడ్డీరేట్లు తగ్గించడానికి బ్యాంకులను ప్రోత్సహించిందని పేర్కొన్నారు. ‘నేడు ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఓ చక్కని ఉద్దీపన.’ అని ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2016- 17)లో తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను మంగళవారం ఆర్‌బిఐ నిర్వహించగా, రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6.50 శాతానికి తెచ్చింది. దీంతో గృహ, వాహన రుణాలు మరింత చౌక కానున్నా యి. ఇక కొన్ని బ్యాంకులు ఇప్పటికే తమ వడ్డీరేట్లను మార్చే పనిలోపడ్డాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు.
డిఫాల్టర్ల పేర్ల వెల్లడి
వ్యాపారాన్ని దెబ్బ తీస్తుంది: రాజన్
ముంబయి: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడ్డవారందరి పేర్లను వెల్లడించడం వ్యాపారాన్ని దెబ్బ తీస్తుందని ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. వ్యాపార కార్యకలాపాలకు ప్రమాదమేగాక వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో లేనిపోని భయాలకు దారి తీస్తుందని కూడా అన్నారు. మంగళవారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. డిఫాల్టర్ల పేర్లను రహస్యంగానే ఉంచాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కాగా, నేరపూరిత అంశాల అనే్వషణకు మొండి బకాయిల కేసులపై దర్యాప్తు అవసరమని రాజన్ అన్నారు. అలాగే నగదు లావాదేవీలకు బదులుగా ఎలక్ట్రానిక్ లావాదేవీలు జరిగేలా కృషి చేస్తున్నామని 2018 నాటికి కార్డులపైనే అన్ని లావాదేవీలు ఉండాలన్నదే ఆర్‌బిఐ లక్ష్యమని రాజన్ చెప్పారు.

ఎవరేమన్నారు?

‘ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వడ్డీరేట్ల కోత మరింతగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపార నిర్వహణపై వడ్డీరేట్లు చాలా ప్రభావం చూపుతాయి. పెట్టుబడులకు కూడా ఇది దోహదపడతాయి.’
- సిఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీ
‘తయారీ, నిర్మాణ, వౌలిక రంగాల పురోగతికి వడ్డీరేట్లు మరికొంత మేర తగ్గాల్సిన అవసరం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చూడాల్సిన అవసరం ఉంది.’
- అసోచామ్ అధ్యక్షుడు సునీల్ కనోరియా
‘రెపో రేటు 6 శాతానికిపైన ఉండకూడదు. వృద్ధిరేటు పరుగులు పెట్టేందుకు ఇది చాలా అవసరం. రాబోయే రోజుల్లో రెండంకెల వృద్ధికి వడ్డీరేట్లు తక్కువగా ఉండటం ముఖ్యం.’
- పిహెచ్‌డి చాంబర్ అధ్యక్షుడు మహేశ్ గుప్తా
‘ఆర్థిక వృద్ధిరేటు కోసం, పెట్టుబడుల పురోగతి కోసం తగినన్ని నిధులను బ్యాంకులు.. పారిశ్రామిక, వ్యాపార రంగాలకు సమకూర్చాలి. ఇందుకు ఆర్‌బిఐ రెపో రేటును తగిన స్థాయిలో తగ్గించాలి.’
- ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటియా
‘గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయని భావిస్తున్నాం. ఇది నిర్మాణ రంగంలో నెలకొన్న స్తబ్ధతను దూరం చేస్తుందని అనుకుంటున్నాం. 50 బేసిస్ పాయింట్లు తగ్గితే కొనుగోళ్లకు బలం చేకూర్చేది.’
- క్రెడాయ్ అధ్యక్షుడు గీతాంబర్ ఆనంద్
‘ద్రవ్యపరమైన వెసులుబాట్ల వల్ల ఆర్‌బిఐ తగ్గించిన వడ్డీరేట్ల ప్రయోజనాన్ని బ్యాంకులు త్వరగా ఖతాదారులకు అందించగలుగుతాయి.’
- ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య
‘ద్రవ్య నిర్వహణ విషయంలో ఆర్‌బిఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దీనివల్ల ఖాతాదారులకు మేలు జరుగుతుంది. బ్యాంకులకు తగినన్ని నిధులు అందితే ఆర్థిక వ్యవస్థ బలపడినట్లే.’
- ఐసిఐసిఐ చీఫ్ చందాకొచ్చర్

దర్యాప్తులో తేలుతుంది: రాజన్
ముంబయి: పనామా పేపర్స్ వ్యవహారంలో నిజానిజాలు దర్యాప్తులో వెల్లడవుతాయని ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. పనామా పేపర్స్ జాబితాలో బహీర్గతమైన విదేశీ ఖాతాలు సక్రమమైనవేనా? అన్న దానిపై వివిధ దర్యాప్తు సంస్థలు విచారణ చేయనున్నాయని పేర్కొన్నారు. నల్లధనానికి సంబంధించి సోమవారం విడుదలైన పనామా పేపర్స్ జాబితాలో దాదాపు 500 మంది భారతీయులుండగా, వీరిలో సెలబ్రిటీలు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. సిబిడిటి, ఆర్‌బిఐ, ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ అధికారులతో ఏర్పాటైన బృందం ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరపనుంది. నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందమూ విచారించనుంది.