బిజినెస్

ఎగుమతుల వృద్ధిపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: గత ఏడాదికిపైగా క్రమేణా క్షీణిస్తున్న ఎగుమతులను మళ్లీ వృద్ధిపథంలో నిలిపేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)తోపాటు ఆరు ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించింది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇల బలోపేతం, ఆర్గానిక్ ఉత్పత్తికి ప్రోత్సాహం, వాణిజ్య ప్రగతికి చర్యలు, ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఇసిజిసి) సమస్యల పరిష్కారం తదితర అంశాలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇకపై ప్రత్యేక శ్రద్ధ కనబరచనుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఇక్కడ 70 మందితో మళ్లీ ఏర్పాటైన వాణిజ్య బోర్డు తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రంగాల వ్యాపార, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ ఎగుమతుల బలోపేతానికి కావాల్సిన అన్ని చర్యలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎగుమతుల రంగానికి ఆర్థిక చేయూత అందేలా ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చిస్తామన్నారు. ఎగ్జిమ్ బ్యాంక్ సమస్యలపైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), ఆర్థిక మంత్రిత్వ శాఖలతో మాట్లాడుతామన్నారు. ఈ సమావేశంలో ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి చందా కొచ్చర్, బయోకాన్ ఎండి కిరణ్ మజుందార్ షా, డాక్టర్ రెడ్డీస్ ఎండి సతీశ్ రెడ్డి, టివిఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎఫ్‌ఐఇఒ అధ్యక్షుడు ఎస్‌సి రాల్హన్, సిఐఐ అధ్యక్షుడు నౌషద్ ఫోర్బ్స్, జిజెఇపిసి చైర్మన్ ప్రవీణ్‌శంకర్ పాండ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ ఎగుమతులు 5.66 శాతం దిగజారి 20.73 బిలియన్ డాలర్లకు పరిమితమైనది తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న మందగమనం మధ్య భారతీయ ఎగుమతుల్లో కీలకమైన పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతి పడిపోవడమే దీనికి కారణం. నిజానికి 2014 డిసెంబర్ నుంచి భారతీయ ఎగుమతులు వృద్ధి ముఖాన్ని చూడలేకపోతున్నాయి. అయినప్పటికీ దేశీయ దిగుమతుల్లో కీలకమైన చమురుకు సంబంధించి ధరలు గ్లోబల్ మార్కెట్‌లో తక్కువగా ఉండటంతో వాణిజ్య లోటు ఎగిసిపడటం లేదు. కరెంట్ ఖాతా లోటు కూడా అదుపులోనే ఉంటోంది. ఇకపోతే ఈ సమావేశంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జిజెఇపిసి) చైర్మన్ ప్రవీణ్‌శంకర్ పాండ్య మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 16 శాతం పడిపోవచ్చన్నారు. గడచిన 40 ఏళ్లలో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారిగా ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.
బాగా ఆలోచించాలి: కొచ్చర్
వివిధ దేశాలతో కుదుర్చుకునే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టిఎ)పై బాగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి, సిఇఒ చందా కొచ్చర్ అభిప్రాయపడ్డారు. భారత్, ఎఫ్‌టిఎ కుదుర్చుకున్న దేశాల మధ్య వాణిజ్యం చూస్తే ఆయా దేశాలకు భారత ఎగుమతుల కంటే, అక్కడి నుంచి భారత్‌కు దిగుమతులు అధికంగా ఉంటున్నాయని గుర్తుచేశారు. కాబట్టి ఎఫ్‌టిఎలపై సంతకాలు చేసే ముందు ఆయా దేశాలతో మనకు అధిక ప్రయోజనం ఉండేలా చూసుకోవడం మంచిదన్నారు.
యుఎస్‌ఎఫ్‌డిఎ చర్యలతో
ఎగుమతులకు విఘాతం: డాక్టర్ రెడ్డీస్
అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్‌ఎఫ్‌డిఎ) అవలంభిస్తున్న తీరు భారత ఎగుమతులను దెబ్బ తీస్తోందని దేశీయ ప్రముఖ ఔషధ రంగ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఆందోళన వ్యక్తం చేసింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి మాట్లాడుతూ యుఎస్‌ఎఫ్‌డిఎతో ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఔషధ ఎగుమతులు ప్రస్తుతం 9.7 శాతం వృద్ధిని నమోదు చేసినప్పటికీ, గతంలో రెండంకెల వృద్ధిలో కదలాడిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
ప్రభుత్వ మద్దతు
అవసరం: వేణు శ్రీనివాసన్
విదేశాలకు భారత ఆటోమొబైల్ ఎగుమతులు క్షీణిస్తున్నాయని, కోలుకోవాలంటే ప్రభుత్వ మద్దతు అవసరమని టివిఎస్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వేణు శ్రీనివాసన్ అన్నారు. పన్నులు, తదితర అంశాల్లో ఆటో పరిశ్రమకు వెన్నుదన్నుగా ప్రభుత్వ నిర్ణయాలుంటే బాగుంటుందని సూచించారు. ఎగుమతులు పుంజుకునేలా తగిన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం ఇవ్వాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇడి నిఖిల్ మేస్వాని కూడా కోరారు. నానాటికి పడిపోతున్న ఎగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేస్తోందన్నారు.

chitram...

వాణిజ్య బోర్డు సమావేశంలో పాల్గొన్న చందా కొచ్చర్, సతీశ్ రెడ్డి,
కిరణ్ మజుందార్ షా తదితరులు
బుధవారం న్యూఢిల్లీలో జరిగిన వాణిజ్య బోర్డు తొలి సమావేశం

ఎటిసి ఎఫ్‌డిఐకి గ్రీన్ సిగ్నల్
ౄ వియామ్ నెట్‌వర్క్స్‌లో రూ. 5,857 కోట్లతో
51 శాతం వాటా కొనుగోలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారతీయ టెలికామ్ టవర్ సంస్థ వియామ్ నెట్‌వర్క్స్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు అమెరికన్ టవర్ కార్పొరేషన్ (ఎటిసి)కు బుధవారం కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సిసిఇఎ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 5,857 కోట్ల రూపాయలతో అమెరికన్ టవర్ కార్పొరేషన్ ఈ వాటాను కొనుగోలు చేయనుంది. కాగా, భారత టెలికామ్ రంగం వృద్ధిపథంలో సాగుతోందని భవిష్యత్తులో మరో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడతామని ఈ సందర్భంగా అమెరికన్ టవర్ కార్పొరేషన్ చీఫ్ జేమ్స్ టైస్లెట్ తెలిపారు.
విల్‌ఫుల్ డిఫాల్టర్లపై
కేసులు పెట్టాలి: సిఐఐ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: విల్‌ఫుల్ డిఫాల్టర్ల (ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు)పై కేసులు పెట్టాలని పారిశ్రామిక సంఘం సిఐఐ నూతన అధ్యక్షుడు నౌషద్ ఫోర్బ్స్ బుధవారం విలేఖరులతో అన్నారు. లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడిన నేపథ్యంలో మాల్యా లాంటి విల్‌ఫుల్ డిఫాల్టర్లను దారిలోకి తెచ్చేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు జిడిపి గణన పద్ధతి అస్పష్టంగా ఉందన్నారు. భారత్ జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో దాదాపు 8 శాతంగా ఉండొచ్చన్నారు.
నాస్కామ్ చైర్మన్‌గా సిపి గుర్నాని
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) చైర్మన్‌గా సిపి గుర్నాని, వైస్ చైర్మన్‌గా రమణ్‌రాయ్ ఎన్నికయ్యారు. వీరు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ఈ పదవిలో ఉంటారు. నాస్కామ్ చైర్మన్‌గా ఉన్న ఐటి దిగ్గజం బివిఆర్ మెహన్ రెడ్డి స్థానంలో సిపి గుర్నాని నియమితులైనట్లు నాస్కామ్ బుధవారం ప్రకటించింది. కాగా, గుర్నాని టెక్ మహీంద్ర మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. వైస్ చైర్మన్‌గా ఎన్నికైన రమణ్ రాయ్ క్వాట్రో గ్లోబల్ సర్వీసెస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా నాస్కామ్ నూతన చైర్మన్ సిపి గుర్నాని మాట్లాడుతూ, ఐటి రంగం అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేస్తానన్నారు. ఐటి విద్య, పరిశ్రమ, వౌలిక సదుపాయాల అభివృద్ధికి పాటుపడతానన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్, వౌలిక సదుపాయాల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, నాస్కామ్ అధ్యక్షుడిగా ఆర్ చంద్రశేఖర్ కొనసాగుతారు.
చమురు కొనుగోళ్లపై
ప్రభుత్వ సంస్థలకు స్వేచ్ఛ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: చమురు కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వరంగ చమురు సంస్థలకు స్వేచ్ఛ లభించింది. తమ వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ముడి చమురును దిగుమతి చేసుకునే వెసులుబాటును బుధవారం ప్రభుత్వరంగ చమురు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) తదితర ప్రభుత్వరంగ చమురు సంస్థలు చమురు ఉత్పాదక దేశాలకు చెందిన జాతీయ సంస్థల నుంచి మాత్రమే ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి పది విదేశీ సంస్థలను ప్రభుత్వం 2001 మే 21న స్పష్టంగా సూచించింది కూడా. అయితే ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలుకుతూ చమురు కొనుగోళ్లపై నిర్ణయం చమురు సంస్థలకే అప్పగించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
స్వల్ప లాభాల్లో
దేశీయ స్టాక్ మార్కెట్లు

ముంబయి, ఏప్రిల్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలను అందుకున్నాయి. మంగళవారం భారీ నష్టాల నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 17 పాయింట్లు పెరిగి 24,900.63 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 11.15 పాయింట్లు లాభపడి 7,614.35 వద్ద నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష మదుపరులను ఆకట్టుకోకపోవడంతో మంగళవారం సూచీలు భారీ నష్టాలకు లోనైనది తెలిసిందే. సెనె్సక్స్ 516 పాయింట్లు, నిఫ్టీ 156 పాయింట్లు పతనమయ్యాయి. ఇకపోతే బుధవారం ట్రేడింగ్‌లో మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీ, టెలికామ్, రియల్టీ, చమురు, గ్యాస్, పవర్, ఎనర్జీ, హెల్త్‌కేర్ రంగాల షేర్ల విలువ 2.33 శాతం నుంచి 0.36 శాతం వరకు పెరిగింది. అయితే ఐటి, బ్యాంకింగ్, టెక్నాలజీ రంగాల షేర్ల విలువ 0.51 శాతం నుంచి 0.29 శాతం వరకు పడిపోయింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించగా, చైనా దాదాపు యథాతథంగా, హాంకాంగ్ స్వల్పంగా 0.15 శాతం లాభపడ్డాయి. అలాగే సింగపూర్, దక్షిణ కొరియా సూచీలు 0.37 శాతం, 0.44 శాతం చొప్పున పెరిగాయి. అయితే తైవాన్, జపాన్ సూచీలు మాత్రం 1.67 శాతం, 0.11 శాతం మేర నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలోనూ బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు లాభపడితే, జర్మనీ సూచీ నష్టపోయింది.

ఫైజర్-అల్లెర్గాన్
160 బిలియన్ డాలర్ల డీల్ రద్దు
న్యూయార్క్, ఏప్రిల్ 6: వయాగ్రా తయారీదారు ఫైజర్, బొటాక్స్ ఉత్పత్తిదారు అల్లెర్గాన్.. తమ 160 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేశాయి. పరస్పర అంగీకార ఒప్పందం ద్వారా విలీన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో ఇరు సంస్థలు ప్రకటించాయి. పన్ను మినహాయింపు ఒప్పందాలపై అమెరికా ఆర్థిక శాఖ సోమవారం కొరఢా ఝుళిపించిన నేపథ్యంలో తాజా నిర్ణయానికి రెండు సంస్థలు వచ్చాయి. గత ఏడాది నవంబర్‌లో ఫైజర్-అల్లెర్గాన్ మధ్య ఈ డీల్ కుదిరింది.

సెంట్రల్ ఎక్సైజ్ పన్ను
విధింపును వెనక్కి తీసుకోవాలి

కేంద్రాన్ని కోరిన తెలంగాణ వర్తక, వాణిజ్య సమాఖ్య

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: బంగారు ఆభరణాలు, రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమపై కేంద్రం ప్రభుత్వం బడ్జెట్‌లో విధించిన సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ డిమాండ్ చేసింది. బంగారు నగలపై ఒక శాతం సెంట్రల్ ఎక్సైజ్, రూ. 1000 దాటిన రెడీమేడ్ గార్మెంట్స్‌పై 2 శాతం విధించడం వల్ల ఈ రెండు రంగాలపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడుతుందని చాంబర్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 35 రోజుల నుంచి ఈ సుంకం విధింపును వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా బంగారు, గార్మెంట్ పరిశ్రమ వర్గాలు సమ్మె నిర్వహిస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని అన్నారు. బుధవారం నాడిక్కడ చాంబర్ ఆధ్వర్యంలో పలు వర్తక సంఘాల ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చాంబర్ అధ్యక్షుడు ప్రకాశ్ అమ్మనబోలు, ఉపాధ్యక్షుడు మురళీకృష్ణ, గార్మెంట్ తయారీ, టోకు వర్తకుల సంఘం అధ్యక్షుడు పవన్ భన్సల్, తెలంగాణ బులియన్ జెమ్స్, జువెల్లరీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మానేపల్లి రామారావు తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్న ఈ రెండు రంగాలపై కేంద్రం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని విధించడం వల్ల కోలుకునే అవకాశం లేదని అన్నారు. ఎలాగు మరికొన్ని నెలల్లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జిఎస్‌టి చట్టం అమల్లోకి రానున్నందున, ఈ కొద్ది నెలలకు సెంట్రల్ ఎక్సైజ్ పన్ను విధింపు అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు. తమ ఆందోళనకు 29 వర్తక వాణిజ్య సంఘాలు మద్దతు ఇచ్చాయని తెలిపారు. 35 రోజుల సమ్మె కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన వేల కోట్ల ఆదాయానికి గండిపడిందన్నారు. ఇప్పటికే బంగారం వర్తకులపై అనేక రకాల పన్నులు విధించడం వల్ల భారంగా మారిన వ్యాపారం సెంట్రల్ ఎక్సైజ్ విధింపు వల్ల మరింత సంక్షోభంలో కూరుకుపోయిందని, ఈ పన్నును సెంట్రల్ ఎక్సైజ్ రూపంలో కాకుండా మరో రూపంలో విధిస్తే తమకు సమ్మతమేనని, కానీ సెంట్రల్ ఎక్సైజ్ చట్టం ప్రకారం చాలా ఇబ్బందులు తమకు ఉంటాయని వివరించారు. ప్రభుత్వం తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఈ పన్ను భారాన్ని విధించకుండా ఉపసంహరించుకోవాలని కోరారు.

కృష్ణా జిల్లాలో జాతీయ పింఛన్లు!

పైలట్ ప్రాజెక్టు అమలుకు ప్రపంచ బ్యాంక్ పరిశీలన

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 6: అటల్ పింఛన్, జాతీయ పింఛన్ విధానాల ద్వారా పింఛన్లను పొందే దిశగా ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమానికి కృష్ణాజిల్లా పైలెట్‌గా ఎంపికయ్యేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాబు.ఎ వెల్లడించారు. ఫర్టిలైజర్స్ అమ్మకాలపై నిర్వాహణను చేపట్టనున్నట్లు మే నెల నుండి పూర్తిస్థాయిలో అమలుకు కార్యాచరణను రూపుదిద్దుతున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు కలెక్టర్ తెలిపారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్‌లో బుధవారం ప్రపంచ బ్యాంకుకు చెందిన పిన్‌బాక్స్ సాల్యూషన్స్ ప్రతినిధులు పరుల్‌ఖన్నా, గౌతమ్ భరద్వాజాలు కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ-పోస్ విధానంలో 2165 ఎఫ్.పి షాపు ద్వారా నిత్యావసర సరుకులను సమర్థవంతంగా పంపిణీ చేయగలుగుతున్నామన్నారు. తొలిదశలో ఈ విధానం పట్ల వ్యతిరేకత ఏర్పడినప్పటికీ ప్రజలు సక్రమమైన రీతిలో నిత్యావసర సరుకులు అందుతున్నందున పూర్తిగా ఈ విధానాన్ని స్వాగతిస్తున్నారన్నారు. ఇ-పి.డి.యస్ వలన చౌకధరల దుకాణాల నిర్వాహకులకు ఆదాయంలో గతంలో మాదిరిగా రావడం లేదని గుర్తించి, వారికి ప్రభుత్వం అందించే కమీషన్‌తో పాటు ఇతర ప్రభుత్వ కార్యకలాపాల ద్వారా వచ్చే కమీషన్‌ను వర్తింపచేయాలనే ఉద్దేశం ఉందన్నారు. చౌకధర దుకాణాలు, బ్యాంక్ సమన్వయకర్తలు, ఎన్‌ఆర్‌ఇజియస్ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే మొత్తాలలో కొంత మొత్తం పొదుపు దిశగా ప్రజలకు అవగాహన కలిగించే చర్యలను చేపడుతున్నామన్నారు. ఆధార్ సంఖ్య, బయోమెట్రిక్, ఐరిస్‌ల ద్వారా సామాజిక భద్రత పింఛన్లను, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామన్నారు. అసలైన లబ్ధిదారుల గుర్తింపులో భాగంగా బయోమెట్రిక్ విధానంలో రోజువారి కూలీ చేసుకునే వ్యక్తుల, వృద్ధుల గుర్తింపు విఫలం అవ్వడం నేపథ్యంలో సౌత్‌కొరియాకు చెందిన సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో ఐరిస్‌ను ప్రవేశపెట్టడం జరిగిందని, 72 గంటల్లో అందుకు తగిన సాంకేతిక పరికరాన్ని సరఫరా చేశారన్నా రు. కంటిపాపకు 3 సెంటిమీటర్ల దూరంలో నుంచి మాత్ర మే ఐరిస్ గుర్తింపు సాధ్యమవుతుందని అందుకోసం ఐరిస్ లెన్స్‌కు సపోర్ట్ ఫ్రేమ్‌ను సూచించడం జరిగిందన్నారు. జిల్లాలో ఎఇపియస్ విధానం అమలు పట్ల కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని 3సార్లు న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రధానమంత్రి కార్యాలయంలోను సంబంధిత వివరాలను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.

తెలంగాణలో రూ. 200 కోట్లతో
పాలీహౌస్‌ల నిర్మాణం

ఆర్మూర్‌లో అల్లం, మిర్చి పార్కు ఏర్పాటు
ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామి రెడ్డి వెల్లడి

భీమదేవరపల్లి, ఏప్రిల్ 6: తెలంగాణలో 200 కోట్ల రూపాయల వ్యయంతో పాలీహౌస్‌ల (పండ్ల తోటలపై వేసే తడకలు) నిర్మాణం చేపట్టనున్నట్టు రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కట్కూరు గ్రామంలో గూడ నర్సింహారెడ్డికి చెందిన మామిడి తోటను ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలకు చెందిన రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూరగాయల సాగుపై ప్రభుత్వం గత సంవత్సరం వంద కోట్లు కేటాయించగా ఈ యేడు 200 కోట్లు కేటాయించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులు పాలీహౌస్‌లు ఏర్పాటు చేసుకునేందుకు 90 శాతం సబ్సిడీ అందిస్తుందన్నారు. తెలంగాణలో రెండు లక్షల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయన్నారు. కరీంనగర్, వరంగల్, మెదక్ రైతుల అభివృద్ధి కోసం నాబార్డ్ నీడ సంస్థ ద్వారా వెయ్యి కోట్ల రూపాయల రుణం చేసుకునేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అంగీకారం తెలిపారన్నారు. కాగా, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో అల్లం, మిర్చి, గరం మసాలాల కోసం స్పైసీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సతీష్‌కుమార్ మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువులు వాడి అధిక దిగుబడులు సాధించాలన్నారు. యువకులు సాంకేతిక రంగాల్లో కాకుండా వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సూచించారు.

బెంజ్ రికార్డు స్థాయి అమ్మకాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. 13,558 కార్లను అమ్మింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో బెంజ్ తెలియజేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15)తో పోల్చితే ఇది 20.91 శాతం అధికం. 2014-15లో 11,213 యూనిట్ల విక్రయాలతోనే బెంజ్ సరిపెట్టుకుంది. కాగా, ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో బెంజ్ అమ్మకాలు 3,622 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 3,566 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

ఏడాది ఆఖరుదాకా వడ్డీరేట్లు యథాతథం: నొమురా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ ఏడాది ఆఖరుదాకా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచవచ్చని జపాన్‌కు చెందిన బ్రోకరేజ్ సంస్థ నొమురా ఓ రిసెర్చ్ నోట్‌లో బుధవారం అంచనా వేసింది. మంగళవారం నిర్వహించిన తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించిన ఆర్‌బిఐ.. రివర్స్ రెపోను పావు శాతం పెంచినది తెలిసిందే. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో మరో పావు శాతం రెపో రేటును ఆర్‌బిఐ తగ్గించవచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది.