బిజినెస్

కొనేందుకు ఒక్కరూ రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 30: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు అప్పులిచ్చిన బ్యాంకర్ల పరిస్థితి ‘మూలిగే నక్క మీద తాటిపండు’ పడ్డ చందంగా మారింది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిలు రావాల్సి ఉన్నది తెలిసిందే. అయితే రుణాల వసూళ్లలో భాగంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తనఖా పెట్టిన ఆస్తులను శనివారం వేలం వేసిన బ్యాంకర్లకు దిమ్మ తిరిగిపోయే స్పందన ఎదురైంది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆస్తుల కొనుగోలుకు ముందుకు రాలేదు మరి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్రాండ్లు, ట్రేడ్‌మార్కులను దక్కించుకునేందుకు ఎవరూ ఆసక్తి కనబరచలేదు. 366.70 కోట్ల రూపాయల రిజర్వ్ ధరతో శనివారం ఉదయం 11:30 గంటలకు మొదలైన ఆన్‌లైన్ వేలం గంట పాటు జరిగింది. రుణాలిచ్చిన బ్యాంకుల తరఫున సర్ఫేసి చట్టం కింద ఎస్‌బిఐక్యాప్ ట్రస్టీ సంస్థ వేలాన్ని నిర్వహించింది. ‘ఫ్లై ది గుడ్ టైమ్స్’ ట్యాగ్ లైన్ కలిగిన కింగ్‌ఫిషర్ లోగో, ఫ్లయింగ్ మోడల్స్, ఫన్‌లైనర్, ఫ్లై కింగ్‌ఫిషర్, ఫ్లయింగ్ బర్డ్ డివైజ్ తదితర ట్రేడ్‌మార్కులను ఈ వేలంలో అమ్మకానికి పెట్టారు. అయితే వీటికి ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. నిజానికి కింగ్‌ఫిషర్ విమాన కార్యకలాపాలు జోరుగా, లాభాల్లో కొనసాగుతున్న 2010లో దాని బ్రాండ్ విలువను 4,000 కోట్ల రూపాయలుగా గ్రాంట్ థ్రోంటన్ అంచనా వేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రకటించిన వార్షిక నివేదికలోనూ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. తమది దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అని, స్కైట్రాక్స్ నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉందని పేర్కొంది. అయితే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిఫర్ ఎయిర్‌లైన్స్ విమాన సేవలు 2012 అక్టోబర్‌లోనే నిలిచిపోగా, 2013 ఫిబ్రవరిలో దాని లైసెన్సు రద్దవడం గమనార్హం. ఇకపోతే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్రాండ్ విలువ అంచనా 4,000 కోట్ల రూపాయల్లో కనీసం పదో వంతు ధరతో వాటి అమ్మకానికి ప్రయత్నించినా ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోవడంతో కనీస ధరను బ్యాంకులు మరింత తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, గతంలోనూ బ్యాంకర్లకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రధాన కార్యాలయమైన కింగ్‌ఫిషర్ హౌస్‌ను 150 కోట్ల రూపాయలకు వేలానికి పెడితే, కొనేందుకు ఎవరూ రాలేదు. నిజానికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి ఎస్‌బిఐ నేతృత్వంలోని బ్యాంకుల కూటమి ఇప్పటిదాకా దాదాపు 1,240 కోట్ల రూపాయలను వసూలు చేయగలిగాయి. అయితే ఈ వ్యవహారంపై వివిధ కోర్టుల్లో కేసులు నడుస్తుండటంతో ఆ సొమ్మంతా కూడా న్యాయస్థానాల వద్దే ఉండిపోయింది. ఇక కొంతమేర చెల్లిస్తానంటూ ఇంతకుముందు మాల్యా చేసిన ఆఫర్‌కు బ్యాంకులు అంగీకరించలేదన్నది తెలిసిందే.
ఎయిర్‌లైన్స్‌కే ఉపయోగించాలి
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్రాండ్లను, ట్రేడ్‌మార్కులను బ్యాంకర్లు వేలానికి పెట్టిన నేపథ్యంలో వీటిని కొనుగోలు చేసినవారు కేవలం విమానయాన రంగంలో మాత్రమే వినియోగించాలని మాల్యాకు చెందిన లిక్కర్ తయారీ దిగ్గజం యునైటెడ్ బ్రూవరీస్ (యుబి) చెబుతోంది. అలాకాకుండా ఇతరత్రా వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు కింగ్‌ఫిషర్ బ్రాండ్లను, లోగోలను, ట్రేడ్‌మార్కులను ఉపయోగిస్తే న్యాయపరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని యుబి గ్రూప్ అధికారి ఒకరు చెప్పారు.
దేశీయ విమానయాన రంగంలో అత్యంత లగ్జరీ సదుపాయాలతో సేవలను అందించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. పరుగులు అనతి కాలంలోనే ఆగిపోయాయి. కింగ్‌ఫిషర్ రుణాల కేసులో పరువును పొగొట్టుకున్న విజయ్ మాల్యా.. ఈ ఏడాది మార్చి 2న విదేశాలకు పారిపోయినది తెలిసిందే. మాల్యాపై బ్యాంకర్లు.. ఉద్దేశపూర్వక ఎగవేతదారు ముద్రను వేయగా, మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ మాల్యా పాస్‌పోర్టును కూడా రద్దు చేయగా, ఆయన పార్లమెంట్ సభ్యత్వానికీ ఇదే గతిపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న మాల్యా.. భారత్‌కు వచ్చే ఉద్దేశం తనకు లేదని తేల్చిపారేశారు. అక్కడ ఆస్తులతోపాటు ఓటు హక్కును కూడా కలిగి ఉన్నారు. తాను, తన కుటుంబం విదేశీ పౌరులమని చెప్పుకొచ్చిన మాల్యా.. తన విదేశీ ఆస్తులను అడిగే హక్కు బ్యాంకులక లేదంటూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ కూడా వేశారు. ప్రభుత్వరంగ బ్యాంకైన ఐడిబిఐ నుంచి 900 కోట్ల రూపాయలకుపైగా రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడ్డారన్న కేసులో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి).. ఐడిబిఐ రుణంలో 430 కోట్ల రూపాయలతో విదేశాల్లో ఆస్తులు కొన్నట్లు కూడా గుర్తించింది. న్యూయార్క్‌లో ట్రంప్ ప్లాజాలో మాల్యాకు ఆస్తులుండగా, వాటికి సంబంధించిన చెల్లింపులు ఈ మార్చిలోనే జరగడం కూడా మాల్యాకు బ్యాంకు రుణాల చెల్లింపుపై ఏపాటి గౌరవముందో చెబుతోంది. మొత్తానికి కోర్టుల ఆదేశాలనూ బేఖాతరు చేస్తున్న మాల్యాకు అప్పులిచ్చిన బ్యాంకుల పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్న తీరుగా తయారైంది.