బిజినెస్

క్షీణించిన ఎస్‌బిహెచ్ నికర లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో గతంతో పోల్చితే 43.2 శాతం క్షీణించి 253 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 445.5 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. వడ్డీ ఆదాయం కూడా ఈసారి 5.64 శాతం తగ్గగా, క్రిందటిసారితో చూస్తే 3,639.85 కోట్ల రూపాయల నుంచి 3,434.63 కోట్ల రూపాయలకు పడిపోయంది. ఈ మేరకు ఎస్‌బిహెచ్ ఎండి శంతను ముఖర్జీ ఆదివారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. కాగా, బ్యాంక్ వ్యాపారం ఈ ఏడాది మార్చి 31 నాటికి 2,54,599 కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. ఎస్‌బిహెచ్ మాతృ సంస్థ ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య అధ్యక్షతన గత నెల 30న ముంబయలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ ఆర్థిక ఫలితాలను ఆమోదించినట్లు తెలిపారు. ఇక మొత్తం 2015-16లో బ్యాంక్ నికర లాభం 19.15 శాతం తగ్గి 1,064.93 కోట్ల రూపాయలుగా నమోదైంది. 2014-15లో 1,317.13 కోట్ల రూపాయలుగా ఉంది. అయతే నిర్వహణ లాభం మాత్రం 13.01 శాతం పెరిగి 2,913.66 కోట్ల రూపాయల నుంచి 3,293 కోట్ల రూపాయలకు చేరింది.
ఇక 2015-16 ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్సుల మంజూరు 5.20 శాతం పెరిగి 1,14,230 కోట్ల రూపాయలకు చేరుకోగా, డిపాజిట్లు 6.22 శాతం పెరిగి 1,40,230 కోట్ల రూపాయలకు చేరుకుందని ముఖర్జీ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1,933 శాఖలను తమ బ్యాంక్ కలిగి ఉందని, రానున్న రోజుల్లో మరో 25 శాఖలను పెంచాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం ద్వారా నిర్వహణ లాభం పెంచుకోగలిగామని పేర్కొన్నారు. 2014-15తో పోల్చితే 2015-16 మార్చికి నిర్వహణ వ్యయం 2.05 శాతం తగ్గిందని, సిబ్బంది వ్యయం కూడా 8.58 శాతం తగ్గించుకోగలిగామని ముఖర్జీ వివరించారు. తద్వారా నిర్వహణ లాభం 13.01 శాతం పెంచుకున్నట్లు తెలిపారు.
ఇదిలావుంటే ఎస్‌బిహెచ్ తెలంగాణ రాష్ట్రంలో లీడ్ బ్యాంక్‌గా పని చేస్తోందన్న ముఖర్జీ.. పంట రుణాల మాఫీ విషయమై స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఐదు వాయిదాల్లో పంట రుణమాఫీ చేసేందుకు అంగీకరించిందన్నారు. ఇందుకు గాను రెండు వాయిదాలకు సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకుకు జమ చేసిందని, దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ఎపి విషయానికొస్తే తమ బ్యాంకుకు సంబంధించినంత వరకు పంట రుణాల మాఫీలో ఒక వాయిదా సొమ్ము చెల్లించడం జరిగిందని, మరో వాయిదా చెల్లించాల్సి ఉందన్నారు.

విలేఖరుల సమావేశంలో ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్న
ఎస్‌బిహెచ్ ఎండి శంతను ముఖర్జీ