బిజినెస్

త్రైమాసిక ఫలితాలు, ద్రవ్యోల్బణం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ప్రకటించే త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం గణాంకాలతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ‘గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చికిగాను వివిధ కార్పొరేట్ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు, వర్షాల సమాచారం మార్కెట్లను నడిపిస్తాయి. సోమవారం ఏప్రిల్ నెలకుగాను విడుదలయ్యే టోకు ద్రవ్యోల్బణం గణాంకాలూ మార్కెట్ పోకడను నిర్దేశించగలదు.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. ఈ వారం పంజాబ్ నేషనల్ బ్యాంక్, లుపిన్, ఐటిసి తదితర ప్రముఖ సంస్థలు తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఇకపోతే అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చెరి రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గురువారం జరగనుంది. దీంతో ఆ ఫలితాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే ఈ వారం ట్రేడింగ్‌లో నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ ఒడిదుడుకులకు లోను కావచ్చని మిడ్‌క్యాప్స్ రిసెర్చ్ మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ ఉపాధ్యక్షుడు రవి షెనాయ్ అన్నారు. ‘త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, వర్షసూచనలు, అంతర్జాతీయ పరిణామాలు.. ఈ వారం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయి.’ అని ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రిసెర్చ్ కొటక్ సెక్యూరిటీస్ సీనియర్ ఉపాధ్యక్షుడు దీపెన్ షా అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల తీరు, ముడి చమురు ధరలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు కూడా మార్కెట్లను శాసిస్తాయని పేర్కొన్నారు. వరుసగా రెండు వారాలు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. గత వారం లాభాలను అందుకున్నది తెలిసిందే. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 261 పాయంట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 81 పాయింట్లు వృద్ధి చెందాయ.
ఎన్‌ఎస్‌ఇలో బాండ్ల వేలం
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) సోమవారం విదేశీ మదుపరులకు ప్రభుత్వ బాండ్లను విక్రయించనుంది. సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటల పాటు 3,340 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ రుణ సెక్యూరిటీలను ఎన్‌ఎస్‌ఇ వేలం వేయనుంది. కాగా, ప్రభుత్వ రుణ సెక్యూరిటీల్లో విదేశీ మదుపరులకున్న పెట్టుబడుల పరిమితి 1,40,000 కోట్ల రూపాయలు. అయితే ప్రస్తుతం ఇది 1,36,660 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో మిగతా మొత్తానికి నేడు వేలం జరుగుతోంది.