బిజినెస్

నష్టాల ఊబిలో బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: భారత బ్యాంకింగ్ వ్యవస్థకు ఏమైంది? ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి ఏమిటి? వేల కోట్ల రూపాయల్లో నష్టాలు ఎందుకు?.. ఆర్థిక మంత్రి నుంచి అరక దునే్నవారి వరకు, సాఫ్ట్‌వేర్ నుంచి సామాన్యుడి వరకు ఇప్పుడు అందరి మదిలో ఇవే ప్రశ్నలు. అవును మరి.. వరుసగా ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఆ దేశ బ్యాంకింగ్ వ్యవస్థే బలం. కొంతకాలం క్రిందటిదాకా భారత్‌కూ అంతే. కానీ ఇప్పుడు మాత్రం ఆ బ్యాంకింగ్ వ్యవస్థ మన దేశానికి బలహీనంగా మారింది. తీసుకున్న రుణాలు తిరిగి వసూలు కావడం లేదు. వేల కోట్లలో అప్పులు తీసుకున్న కార్పొరేట్లు చేతులెత్తేస్తున్నారు. చివరకు అవి మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ)గా మారుతున్నాయి. ఫలితంగా భీకర నష్టాలు. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి అంతా.. ఇంతే. బ్యాంకింగ్ లావాదేవీలు ఎక్కువగా ఉన్న సంస్థలకు పెద్ద మొత్తంలో ఈ నష్టాలు వాటిల్లుతుండగా, తక్కువగా ఉన్న సంస్థలకు ఆ నష్టాలు తగ్గడమో లేదా లాభాలు క్షీణించడమో జరుగుతోంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎస్‌బిఐ తర్వాత రెండో అతిపెద్ద బ్యాంకైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధిలో ఏకంగా 5,367 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనేగాదు, బహుశా దేశంలోని ఏ రంగానికి చెందిన బ్యాంకైనా మూడు నెలల్లో ఈ స్థాయిలో నష్టాలను పొందడం ఇంతకుముందెప్పుడూ లేదు ఇదే తొలిసారి. పిఎన్‌బికి ఇంత దారుణంగా నష్టాలు రావడానికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. నిస్సందేహంగా మొండి బకాయిలే. విద్యుత్ డిస్కమ్‌ల బకాయిలతోపాటు పంజాబ్ ఆహారాధారిత రుణాలు.. పిఎన్‌బిని నష్టాల ఊబిలో దించాయి. నిజానికి అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చి త్రైమాసికంలో 306.56 కోట్ల రూపాయల లాభాన్ని బ్యాంక్ అందుకుంది. ఇది తక్కువే అయినప్పటికీ మొండి బకాయిల తీవ్రత అప్పుడు అంతగా లేదు. కానీ ఈసారి మొండి బకాయిలు గతంతో పోల్చితే మూడింతలు పెరిగాయి. దీంతో నష్టాలూ రికార్డు స్థాయిలోనే నమోదయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఇప్పుడు నష్టాల విషయంలో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. స్టాక్ మార్కెట్లలో లిస్టయిన బ్యాంకింగ్ రంగ షేర్లలో పెట్టుబడిగా పెట్టే సొమ్ములో మూడింట ఒక వంతు మొండి బకాయి క్రిందికే వెళ్తుందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వరంగ బ్యాంకుల దుస్థితి. ‘చావుతప్పి కన్ను లొట్టబోయింది’ అన్నట్లు నష్టాల నుంచి తప్పించుకుని లాభాలను తగ్గించుకున్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అలహాబాద్ బ్యాంక్‌లు. ఈ జనవరి-మార్చిలో ఎస్‌బిహెచ్ లాభం 43.2 శాతం క్షీణించి 253 కోట్ల రూపాయలుగా నమోదవగా, అలహాబాద్ బ్యాంక్ లాభం 72 శాతం పడిపోయి 52 కోట్ల రూపాయలుగా ఉంది. ఎస్‌బిఐ కూడా ఈసారి తమపై మొండి బకాయిల ప్రభావం భారీగానే ఉంటుందని ముందుగానే చెప్పడం గమనార్హం. మరోపక్క ప్రైవేట్‌రంగ బ్యాంకులు ఈ విషయంలో చాలావరకు మెరుగ్గా ఉన్నాయి. దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్‌రంగ బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్ ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 2,154 కోట్ల రూపాయల లాభాన్ని పొందగా, నాలుగో స్థానంలో ఉన్న కొటక్ మహీంద్ర బ్యాంక్ 1,055 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. అయితే దేశీయ అతిపెద్ద ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసిఐసిఐ బ్యాంక్ లాభం మాత్రం ఈ జనవరి-మార్చిలో 87 శాతం పతనమై 407 కోట్ల రూపాయలకు పరిమితమైంది. మరి ప్రైవేట్‌రంగ బ్యాంకులకు వాటిల్లని నష్టాలు.. ప్రభుత్వరంగ బ్యాంకులకే ఎందుకిలా? అంటే.. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రుణాల విషయంలో విపరీతంగా పేరుకుపోతున్న ఉదాసీనతే. రుణాల మంజూరు సమయంలో తీసుకునేవారి ఆర్థిక స్థితిగతులపై సరైనా అంచనాలు లేకపోవడమే. ప్రైవేట్‌రంగ బ్యాంకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాయి. లిక్కర్ వ్యాపారి, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా ప్రస్తుత వ్యవహారానే్న మనం చూస్తే.. మాల్యాకు రుణాలిచ్చి నష్టపోయిన బ్యాంకుల్లో మెజారిటీ బ్యాంకులు ప్రభుత్వరంగానివే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలు సైతం భారత బ్యాంకింగ్ వ్యవస్థలోని మొండి బకాయిలపట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే, బ్యాంకింగ్ రంగ ఉనికిని ఎన్‌పిఎ ఏ స్థాయిలో ప్రశ్నార్థకం చేసిందో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు సైతం జోక్యం చేసుకుందంటే ఆ తీవ్రత ఏమిటన్నదానికి అద్దం పడుతోంది. ప్రభుత్వం దివాళా బిల్లుల వంటివి తీసుకొస్తున్నా, బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదారులంటూ ప్రకటించినా, దర్యాప్తు సంస్థలు నాన్ బెయిలబుల్ వారెంట్లతో ఇతరత్రా దర్యాప్తులను చేస్తున్నా.. అంతా చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకున్న చందంగానే ఉంటోంది. మొత్తానికి బ్యాంకింగ్ రంగానికి ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
పూర్తిగా చెల్లించాల్సిందే
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తొలుత కొంత మొత్తంలో చెల్లిస్తామంటున్న విజయ్ మాల్యా అభ్యర్థనను పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉషా అనంతసుబ్రమణ్యన్ తిరస్కరించారు. మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 17 బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడినది తెలిసిందే. ఈ బ్యాంకుల కూటమికి ఎస్‌బిఐ నేతృత్వం వహిస్తుండగా, బకాయిల్లో ఈ సెప్టెంబర్ నాటికి 4,000 కోట్ల రూపాయలను చెల్లిస్తామంటూ మాల్యా ముందుకొచ్చాడు. ఆ తర్వాత మళ్లీ తొలుతే 6,868 కోట్ల రూపాయలను చెల్లిస్తామని సుప్రీం కోర్టుకు చెప్పాడు. అయితే తాజా నష్టాల మధ్య మాల్యా తమకు ఇవ్వాల్సిన 800 కోట్ల రూపాయల రుణాన్ని ఒకేసారి చెల్లించాల్సిందేనని ఉషా స్పష్టం చేశారు. దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా.. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నది తెలిసిందే. మాల్యాను రప్పించేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తుండగా, అప్పులిచ్చిన బ్యాంకులు తిప్పలు పడుతున్నాయ.