బిజినెస్

స్క్రాపింగ్ పాలసీతో ఆటో పరిశ్రమ టర్నోవర్ పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: కాలుష్యకారక పాత వాహనాలను వదిలించుకోవడం వల్ల ఆటో పరిశ్రమ టర్నోవర్ భారీగా పెరగనుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త విధానంతో సదరు వాహనదారులకు ప్రోత్సాహకాలు లభిస్తాయన్న ఆయన రాబోయే ఐదేళ్లలో నూతన వాహన కొనుగోళ్లు పెరిగి ఆటోరంగ సంస్థల టర్నోవర్ నాలుగింతలు వృద్ధి చెందుతుందని, 20 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని చెప్పారు. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న స్క్రాపింగ్ పాలసీ సిద్ధమైందని, వారం రోజుల్లో దీనిపై వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రక్రియ మొదలు పెడతామని గడ్కరీ తెలిపారు. ‘ప్రజాభిప్రాయ సేకరణార్థం వారం రోజుల్లో కాలుష్యకారక వాహన ఉపసంహరణ విధానాన్ని (స్క్రాపింగ్ పాలసీ) వెబ్‌సైట్‌లో పెడతాం. సాధారణ, వివిధ రంగాల ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతిని కోరతాం. ఆర్థిక శాఖ ఆమోదం పొందితే, కేబినెట్ ఆమోదానికి వెళ్తాం.’ అని గడ్కరీ ఆదివారం పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ విధానం అమల్లోకి వస్తే ప్రస్తుతం దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ టర్నోవర్.. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందన్నారు. అంతేగాక ప్రపంచ అత్యుత్తమ స్థాయి కార్లను విదేశాలకు ఎగుమతి చేయడంలో భారత్ అగ్ర స్థానంలో నిలుస్తుందన్నారు. కాలుష్యం వెదజల్లుతున్న తమ పాత వాహనాలను స్క్రాపింగ్‌కు ఇచ్చినవారు.. మళ్లీ కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే వారికి ఎక్సైజ్ సుంకంలో సుమారు 50 శాతం రిబేటు వస్తుందని చెప్పారు. ఇకపోతే పోర్టుల వద్ద తాము ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నామని, ఇక్కడ తయారు చేసే ఆటోమొబైల్ ఉత్పత్తులు మార్కెట్ ధరలో సగానికే లభిస్తాయని తెలిపారు. ఈ క్లస్టర్లలో రీసైక్లింగ్‌లో భాగంగా స్క్రాపింగ్‌కు ఇచ్చిన పాత వాహనాల నుంచి కాపర్, స్టీల్, ప్లాస్టిక్, అల్యూమినియంను కూడా సేకరిస్తామని గడ్కరీ చెప్పారు. 29 పోర్టు ఆధారిత తీరప్రాంత పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని గత నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటి వల్ల కొత్త కోటి ఉద్యోగవకాశాలు వస్తాయని చెబుతున్న కేంద్రం.. విదేశాలకు ఎగుమతులు 110 బిలియన్ డాలర్లు పెరగవచ్చంటోంది. ఇక పదేళ్లకుపైబడిన వాహనాలను స్క్రాపింగ్‌కు ఇచ్చినవారికి ప్రోత్సాహకంగా 1.5 లక్షల కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి వస్తుందని అంచనా. దీనిపైనా ప్రభుత్వం ఆలోచిస్తోంది. కార్లకు 30,000 రూపాయల వరకు, ట్రక్కులకు 1.5 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపులను కల్పించనున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం దీనిపై ఓ నిర్ణయం తీసుకోనుంది.