బిజినెస్

మాల్యాతో బ్యాంకర్ల వన్-టైమ్ సెటిల్మెంట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 4: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణంపై వన్-టైమ్ సెటిల్మెంట్ కోసం ఎస్‌బిఐ సిద్ధమైందని తెలుస్తోంది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని ఈ దేశీయ ప్రైవేట్‌రంగ ఎయిర్‌లైన్స్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి విమానయాన సేవలకు దూరమైనది తెలిసిందే. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నాయకత్వంలోని 17 బ్యాంకుల కూటమికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయి పడింది. తీసుకున్న రుణాన్ని ఎంతకీ చెల్లించకపోవడంతో విసిగిపోయిన కొందరు బ్యాంకర్లు మాల్యాపై చివరకు ఉద్దేశపూర్వక ఎగవేతదారు ముద్ర కూడా వేయగా, ఈ వ్యవహారం న్యాయస్థానాలదాకా వెళ్లింది. బకాయిల వసూళ్లలో భాగంగా మాల్యా తాకట్టు పెట్టిన పలు ఆస్తులను వేలం వేసిన బ్యాంకులకు ఏమాత్రం మింగుడుపడని విధంగా ధరలు పలకడం కూడా విదితమే. ఈ పరిణామాలన్నింటి మధ్య చెప్పాపెట్టకుండా మాల్యా విదేశాలకు (బ్రిటన్‌కు) జారుకోగా, ఇక ఆయన భారత్‌కు రావడం, అప్పులు తీర్చడం కల్లే అని బ్యాంకులు తలలు పట్టుకుంటున్నాయి ఇప్పుడు. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా సహేతుకమైన వడ్డీరేటుతో రుణాన్ని చెల్లించేందుకు ముందుకు వస్తే ఈ అంశాన్ని ఒకేసారి పరిష్కరించుకునేందుకు ఎస్‌బిఐ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించకపోవడంతో రుణభారం పెరిగినది తెలిసిందే. అయితే వడ్డీపై వడ్డీలు లేకుండా మాల్యాతో ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకునేందుకు బ్యాంకుల కూటమి సానుకూలంగా ఉన్నట్లు ఓ జాతీయ దినపత్రికలో వచ్చిన వివరాల ఆధారంగా తెలిసింది. 2014 ఫిబ్రవరి నాటికి బ్యాంకులకు మాల్యా ఇవ్వాల్సిన మొత్తం 6,963 కోట్ల రూపాయలు (నిర్ణీత వడ్డీతోసహా)గా ఉంది. కానీ వడ్డీని చెల్లించకపోవడంతో వేసిన జరిమానాల కారణంగా ఈ మొత్తం ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలను దాటిపోయింది. రుణాల ఎగవేత కేసులో జైలుపాలవుతానని భయపడిన మాల్యా ఈ ఏడాది మార్చిలో భారత్‌ను వీడగా, కొంత మొత్తాన్ని చెల్లిస్తానని ముందుకు వచ్చినది తెలిసిందే. అయితే నాడు అందుకు నిరాకరించిన బ్యాంకులు.. ఇప్పుడు మెత్తబడుతున్నాయి. బకాయిలు వసూలవడం ఎలాగో అర్థంకాకనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ‘వడ్డీమాట దెవుడెరుగు.. అసలు దక్కితే అదే పదివేలు’ అన్న నిర్ణయానికి బ్యాంకులు వచ్చినట్లు అవగతమవుతోంది. మొత్తానికి బ్యాంకింగ్ రంగాన్ని.. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకులను మొండి బకాయిలు తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో, బాసెల్-3 నిబంధనల అమలు దగ్గరపడుతున్న క్రమంలో నిధుల కొరతను తీర్చడానికి బ్యాంకులు తలొగ్గక తప్పట్లేదు.
కింగ్‌ఫిషర్ హౌజ్ వేలం ధర తగ్గింపు
విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ హౌజ్‌ను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో వేలం ధరను బ్యాంకులు తగ్గించాయి. ఇంతకుముందు 150 కోట్ల రూపాయలకు దీన్ని వేలం వేయగా.. ఒక్కరూ ఆసక్తి కనబరచలేదు. దీంతో ఈసారి 135 కోట్ల రూపాయలతో వేలానికి బ్యాంకర్లు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 8న వేలం వేయనున్నారు. ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమి ఈ ఏడాది మార్చిలో కింగ్‌ఫిషర్ హౌజ్‌ను వేలం వేసి విఫలమైనది తెలిసిందే. ముంబయి దేశీయ విమానాశ్రయానికి దగ్గర్లోగల కింగ్‌ఫిషర్ హౌజ్‌ను 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. కాగా, ఇటీవల సేవా పన్ను అధికారులు కూడా తమకు రావాల్సిన బకాయిల కోసం జప్తు చేసిన మాల్యా వ్యక్తిగత విమానాన్ని వేలం వేయగా, 152 కోట్ల రూపాయల విమానాన్ని కోటి 9 లక్షల రూపాయలకే ఇవ్వాలంటూ బిడ్ దాఖలైంది. అది కూడా ఒక్కటే రావడంతో మాల్యా ఆస్తులపట్ల అందరిలోనూ ఎంత నిరాసక్తి ఉందో తేటతెల్లమవుతోంది.