బిజినెస్

ఎల్‌ఇడి బల్బుల తయారీలో ఆదివాసీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 24: తూర్పు కనుమల్లో కాంతి రేఖ విరిసింది.. ఆదివాసీ యువతులు పారిశ్రామికవేత్తలుగా ముందడుగు వేస్తున్నారు.. ఎల్‌ఇడి బల్బులు తయారుచేసే స్థాయికెదిగారు.. రంపచోడవరంలో ఎల్‌ఇడి బల్బులు తయారుచేసే ప్రాజెక్టుకు గిరిజన మహిళలే యజమానులు. రంపచోడవరం గిరిజన మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఐటిడిఏ పెట్టుబడితో, బెంగళూరుకు చెందిన సంస్థ ప్రోత్సాహంతో గిరిజన మహిళలు ఉత్పత్తిదా రులుగా మారారు. రంపచోడవరం మహిళా సమాఖ్య పేరుతో ఎల్‌ఇడి బల్బుల తయారీ ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రథమంగా నెలకొల్పడం విశిష్టతను సంతరించుకుంది. దీనికి అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోశాధికారితో త్రిసభ్య కమిటీని నియమించారు. రా మెటీరియల్‌కు ఐటిడిఎ రూ. 20 లక్షల పెట్టుబడి కల్పించింది. రంపచోడవరంలోని సెట్రాజ్ భవనాన్ని ఆధునికీకరించి ఎల్‌ఇడి బల్బుల తయారీ ప్రాజెక్టును పెట్టారు. ఈ యూనిట్‌కు సాంకేతిక సహకారాన్ని బెంగళూరుకు చెందిన స్పెక్ట్రమ్ టెక్ విజన్ సంస్థ అందించింది. ఈ సంస్థే ఈ యూనిట్‌కు అవసరమైన విడి భాగాలను కూడా సరఫరా చేస్తోంది. నలభై మంది ఆదివాసీ యువతులను ఎంపికచేసి వారికి అవసరమైన శిక్షణ ఈ సంస్థే ఇచ్చింది. ఇంటర్ ఎంపిసి, బైపిసి పాసైన ఈ నలభై మందిని ఎంపిక చేసి స్పెక్ట్రమ్ బెంగళూరులోనే శిక్షణనిచ్చింది. కాగా, ఒక్కో ఆదివాసీ యువతి రోజుకు 100 ఎల్‌ఇడి బల్బులు తయారు చేసే లక్ష్యంగా ఈ యూనిట్‌ను ప్రారంభించారు. రోజుకు 4 వేల బల్బులు తయారుచేసే సామ ర్థ్యం కలిగిన యూనిట్‌ను నెలకొల్పారు. ఈ యూనిట్ ద్వారా ప్రస్తుతం నెలకు 1.20 లక్షల బల్బులు తయారు చేస్తున్నారు. ఒక్కో గృహవసర ఎల్‌ఇడి బల్బుకు రూ. 15 లాభం వస్తోంది. అదే స్ట్రీట్ లైట్ తయారు చేస్తే రూ. 1,500 లాభం వస్తోంది. వచ్చిన లాభాల నుండి ఐటిడిఎ పెట్టిన పెట్టుబడి తిరిగి చెల్లించాలి. అనంతరం లాభమంతా మహిళా సమాఖ్యకే చెందుతుంది. యూనిట్‌ను విస్తరించి మరింత ఉత్పత్తిని సాధించాలన్నా, మరిం త మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా సంస్థను పెంపొందించాలన్నా.. అన్ని నిర్ణయాలపై మహిళా సమాఖ్యకు మాత్రమే అధికారాలున్నాయి. ఈ ఆదివాసీ మహిళా సమాఖ్య ప్రాజెక్టులో తయారు చేస్తున్న ఎల్‌ఇడి ఉత్పత్తులను విధిగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లు, హాస్టళ్లు, కాలేజి, పంచాయతీల స్ట్రీట్ లైటింగ్‌కు వినియోగించేలా మార్కెటింగ్ కల్పించారు. ఈ మేరకు ఐటిడిఏ పిఒ చక్రధరబాబు తెలిపారు. ఐటిడిఏ పరిధిలోని గిరిజనులకు రెండు ఎల్‌ఇడి బల్బులను కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందులో పనిచేసే సిబ్బందికి నెలకు ఆరువేల జీతంతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఎనిమిది గంటల పాటు టెస్టింగ్ చేసే యూనిట్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. ఈ యూనిట్‌లో టెస్టింగ్ పూర్తయిన సరుకును మార్కెటింగ్ చేసేందుకు అనుమతిస్తారు. ఈ పరిశ్రమలో పని చేసే సిబ్బందికి అన్ని రకాల భద్రతా ప్రమాణాలను కూడా పాటించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ పరిశ్రమ ద్వారా ఇక్కడే చదువుకుని, ఇక్కడే ఉద్యోగం సంపాదించే అవకాశం కూడా తమకు కలిగిందని ఎల్‌ఇడి ప్రాజెక్టు సిఇఒ వీరలక్ష్మి అన్నారు. ప్రస్తుతం ఈ ఎల్‌ఇడి ప్రాజెక్టులో 40 మంది స్కిల్డ్ వర్కర్లు, 10 మంది అన్ స్కిల్డ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కొండ కోనల మధ్య ఆదివాసీ యువతకు ట్విలైట్ అనే ఈ ఎల్‌ఇడి ప్రాజెక్టు ఆసరా అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎల్‌ఇడి బల్బుల తయారీలో నిమగ్నమైన గిరిజన యువతులు