బిజినెస్

రూ. 2.5 లక్షల కోట్లు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 2: రాబోయే మూడేళ్లకుపైగా కాలంలో బాసెల్-3 నిబంధనలకు అనుగుణంగా భారతీయ ప్రభుత్వరంగ బ్యాం కులు 2.5 లక్షల కోట్ల రూపాయల మూలధనాన్ని సమీకరించుకోవాల్సి ఉందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పి గ్లోబల్ రేటింగ్స్ మంగళవారం తెలిపింది. ‘బాసెల్-3 నిబంధనలను అందుకోవాలంటే ప్రభుత్వరంగ బ్యాంకులకు 2.5 లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరం.’ అని ఎస్‌అండ్‌పి క్రెడిట్ అనలిస్ట్ గీతా చుగ్ ఇక్కడ విలేఖరులతో అన్నారు.
ప్రమాదకర స్థాయిలో మొండి బకాయిల భారాన్ని మోస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులు.. మార్కెట్ల నుంచి ఇంత పెద్ద మొత్తంలో నిధులను సమీకరించడం కష్టమేనన్న ఆమె ప్రభుత్వంపై ఆధారపడక తప్పదని అభిప్రాయపడ్డారు. ఆదరణ కలిగిన టైర్-1 బాండ్ల జారీతో నిధులను సమీకరించుకోవచ్చని, అయినప్పటికీ నిధుల సమీకరణలో విఫలమైతే మార్కెట్ షేర్ దెబ్బతింటుందని, అది బ్యాంకులకు ఏమాత్రం మంచిది కాదని అన్నారు. ఇదే జరిగితే కొత్తగా క్రెడిట్ డిమాండ్‌ను అందుకునేలా నిధులు ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. నిజానికి పొరుగు దేశం చైనాలో నిరర్థక ఆస్తుల (మొండి బకాయిలు) ప్రభావం బ్యాంకింగ్ వ్యస్థపై భారత్‌తో పోల్చితే చాలా తక్కువగా ఉందని ఆమె తెలిపారు. ఇక డజనుకుపైగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే నెగటివ్ ఔట్‌లుక్ ఉందని అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు వచ్చే నాలుగేళ్లలో 70,000 కోట్ల రూపాయల నిధులను అందిస్తామని నిరుడు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినది తెలిసిందే. మరో 1.1 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులే సమకూర్చుకోవాలని సూచించింది. అయితే బాసెల్-3 నిబంధనలను అందుకోవాలంటే నాడు బ్యాంకులకు 1.80 లక్షల కోట్ల నిధులే అవసరం.
కానీ పెరుగుతున్న మొండి బకాయిలు, వాటి కారణంగా బ్యాంకులకు వాటిల్లే నష్టాలతో ఇప్పుడీ మొత్తం 2.50 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని ఎస్‌అండ్‌పి అంటోంది. ఇకపోతే ఇస్తామన్న 70,000 కోట్ల రూపాయల్లో గత ఆర్థిక సంవత్సరం (2015-16) 25,000 కోట్ల రూపాయలను అందించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మరో 25,000 కోట్ల రూపాయలను అందిస్తోంది. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2017-18, 2018-19) 10,000 కోట్ల రూపాయల చొప్పున మరో 20,000 కోట్ల రూపాయలను ఇవ్వనుంది. అయితే ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే మొండి బకాయిలు ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో అవసరమైతే మరింత ఆర్థిక సాయాన్ని అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే భరోసా ఇచ్చినది తెలిసిందే.
ఈ క్రమంలో బ్యాంకులకు ప్రభుత్వ అండదండలుంటే వాటి ఔట్‌లుక్ స్థిరంగానే ఉంటుందని గీతా చుగ్ స్పష్టం చేశారు. ఇటీవల ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఔట్‌లుక్ తగ్గించినది తెలిసిందే. ఇకపోతే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐలో దాని ఐదు అనుబంధ బ్యాంకుల విలీనంపై స్పందిస్తూ దీనివల్ల ఔట్‌లుక్‌లో పెద్దగా మార్పుండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
10 కార్పొరేట్లు.. 5.73 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎంతకీ చెల్లించని కార్పొరేట్ సంస్థల్లో 10 కార్పొరేట్ సంస్థల మొండి బకాయిల విలువ 5.73 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. 5 కోట్ల రూపాయలకు మించి ఉన్న కార్పొరేట్ మొండి బకాయిదారుల వివరాలను సిఆర్‌ఐఎల్‌సి క్రింద బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సేకరించింది. ఇందులో ఈ ఏడాది మార్చి 31 నాటికి 10 కార్పొరేట్ గ్రూప్‌ల మొండి బకాయిల విలువ 5,73,682 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు మంగళవారం రాజ్యసభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా రుణ ఎగవేతదారుల పేర్లను వెల్లడించవద్దని ఆర్‌బిఐ పేర్కొన్నట్లు ఆయన సభకు వివరించారు.
ఇక మరో ప్రశ్నకు సమాధానంగా గత ఆర్థిక సంవత్సరం (2015-16) ప్రభుత్వరంగ బ్యాంకులు 59,547 కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశాయని, అలాగే ప్రైవేట్‌రంగ బ్యాంకులు 12,017 కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశాయని, విదేశీ బ్యాంకులు 1,057 కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశాయని మంత్రి తెలియజేశారు.