బిజినెస్

ఫైబర్ గ్రిడ్‌కు సెట్ టాప్ బాక్సుల సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 7: తక్కువ ఖర్చుతో ప్రతి ఇంటికి వేగవంతమైన ఇంటర్నెట్ సహా టివి, టెలిఫోన్ సౌకర్యాన్ని అందించే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సెట్ టాప్ బాక్స్‌ల ధర వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. ఈ నెలాఖరు నాటికి ఉత్తరాంధ్రలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నారు. దీనికి తోడు భారీ సంఖ్యలో సెట్‌టాప్ బాక్స్‌ల లభ్యత కూడా మరో సమస్యగా మారనుంది. దీనికి తోడు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు రెండో దశకు నిధుల కేటాయింపు వ్యవహారం కూడా ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. 10 నుంచి 15 ఎంపిబిస్ వేగంతో ఇంటర్నెట్, టివి, టెలిఫోన్ సౌకర్యాలను కలిపి 149 రూపాయలకే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును అమలు చేసేందుకు నిర్ణయించడం తెలిసిందే. తొలిదశలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం తగ్గించేందుకు తొలిదశలో విద్యుత్ స్తంభాలను ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్కుకు వినియోగించుకునేందుకు నిర్ణయించారు. రాష్ట్ర మొత్తం మీద దాదాపు 3.75 లక్షల విద్యుత్ స్తంభాలను ఇందుకు ఉపయోగిస్తున్నారు. తొలిదశలో 23500 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్కును ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 12 వేల కిలోమీటర్ల మేర పూర్తయింది. ప్రయోగాత్మకంగా ఈ నెట్‌వర్కు పనితీరును విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో కొన్ని ప్రాంతాల్లో పనితీరును పరిశీలిస్తున్నారు. ఫలితాలు సంతృప్తికరంగా ఉండటంతో ఈ నెలాఖరునాటికి ఉత్తరాంధ్రలో, వచ్చే ఏప్రిల్ నాటికి రాష్టమ్రంతటా అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సెట్‌టాప్ బాక్స్‌ల వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఇప్పటికే డిజిటల్ టివీకి సంబంధించిన సెట్ టాప్ బాక్స్‌లకు అదనంగా మరో బాక్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీని ధర 3000 నుంచి 4000 రూపాయల వరకూ ఉంది. ఇంత ధరపెట్టి సెట్‌టాప్ బాక్స్ కొనుగోలు చేయడం వినియోగదారులపై ఆర్థిక భారంగా పరిణమించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే ఈ బాక్స్‌లను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. వీలైనంత తక్కువ ధరకే ఈ బాక్స్‌ను అందచేసేందుకు ఆయా వర్గాలతో చర్చిస్తున్నట్టు ‘ఆంధ్రభూమి’కి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. త్వరలోనే ఈ అంశంపై స్పష్టత రావచ్చని తెలిపారు. డిజిటల్ టివికి ఎక్స్‌టెన్షన్ బాక్స్, ప్రత్యేక బాక్స్ వంటి అంశాలు పరిశీలనలో ఉన్నాయి. దీనికి తోడు ఒక్కసారిగా వేలాది మందికి సెట్‌టాప్ బాక్స్‌ల సరఫరా కూడా ఒక సమస్యగా మారనుంది. దీంతో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. తొలి దశలో విద్యుత్ స్తంభాలను వినియోగించుకుంటుండగా రెండో దశలో భూగర్భంలో ఆప్టికల్ కేబుల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందుకు దాదాపు 3590 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విశాఖలో ప్రయోగాత్మకంగా భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ఎపిఇపిడిసిఎల్ నిర్ణయించింది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే నగరంలో విద్యుత్ స్తంభాలు ఉండవు, దీంతో రెండో దశలో విశాఖకు సంబంధించి భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థతో ఫైబర్ గ్రిడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్కును అనుసంధానం చేసే అంశం కూడా పరిశీలనలో ఉంది.