బిజినెస్

రాజమండ్రి పేపర్ మిల్లులో సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 23: గతకొద్ది రోజులుగా సాగుతున్న కార్మికులు, ఉద్యోగుల ఆందోళన ప్రభావం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం (రాజమండ్రి)లోని ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ పేపర్ మిల్లు ఉత్పత్తిపై పడింది. కొందరు కార్మిక ప్రతినిధులను యాజమాన్యం సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఉద్యోగులు, కార్మికులు ఈనెల 11 నుంచి ఆందోళనబాట పట్టారు. దీంతో ఉత్పత్తి నిలిచిపోగా, గత వారం రోజులుగా కొందరు ఇంజనీర్లు విధులకు హాజరవుతుండటంతో ఉత్పత్తి పాక్షికంగా జరుగుతోంది. వివరాల్లోకి వెళితే... చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో ల్యాండ్ మార్కు అయిన పేపర్ మిల్లులో 33 మంది కార్మిక ప్రతినిధులను యాజమాన్యం సస్పెండ్ చేసింది. దీంతో యాజమాన్యం, కార్మికుల మధ్య వివాదం రాజుకుంది. కార్మికులతో చర్చలు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం దిగిరాలేదు. దీంతో ఆందోళన కొనసాగుతోంది.
రాజమహేంద్రవరంలో ఎపి పేపర్ మిల్స్‌ను 1930లో బ్రిటీష్ ప్రభుత్వం నెలకొల్పింది. 1964 వరకు ప్రభుత్వ హయాంలోనే ఉంది. దరిమిలా భంగూరు గ్రూపు యాజమాన్యం 48 శాతం షేర్లు కొనుగోలు చేసింది. 1993లో 100 శాతం షేర్లు కొన్నది. అయతే 2012లో భంగూరు సంస్థ అమెరికా సంస్థకు పేపరు మిల్లును అమ్మేసింది. అప్పటి నుంచి సంస్థ పేరు ఇంటర్నేషనల్ పేపర్ మిల్లుగా మారింది. కాగా, 1964లో భంగూరు సంస్థ యాజమాన్యం పరిధిలోకి పేపర్ మిల్లు మారిన తర్వాత 1,000 మంది శాశ్వత కార్మికులు ఉండేవారు. 1973 నాటికి ఈ సంఖ్య 3,500కు చేరుకుంది. ప్రస్తుతం ఈ మిల్లులో 900 మంది శాశ్వత కార్మికులు, 2,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వీరుగాక మరో 400 మంది ఉద్యోగులున్నారు. అయతే అమెరికా సంస్థ చేతిలోకి వచ్చిన తర్వాత హక్కులు హరించుకుపోతున్నాయని కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతూ వస్తోంది. 2014లో ఆఫీసర్స్ అసోసియేషన్‌కు చెందిన ఐదుగురు ఇంజనీర్లను యాజమాన్యం సస్పెండ్ చేసింది. కార్మికుల పిల్లలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం ఈ సంస్థలో చాలాకాలంగా సంప్రదాయంగా వస్తోందని కార్మికులు చెబుతున్నారు. కానీ ఇటీవల కాలంలో భీమవరంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 25 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ‘ఇంజనీర్స్ ట్రైనీ’ పేరుతో కాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికచేశారు. ఈ క్రమంలో గత సంప్రదాయాన్ని గుర్తుచేస్తూ కార్మికులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దీంతో కార్మికుల పిల్లల్లో అర్హులైన 13 మందికి ఎంపిక పరీక్షపెట్టారు. ఈ పరీక్షలో ముగ్గురు మాత్రమే క్వాలిఫై అయ్యారు. మిగిలిన వారి మాటేమిటని అడగడానికి 33 మంది కార్మిక ప్రతినిధులు యాజమాన్యంతో చర్చలకు వెళ్ళారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగారంటూ యాజమాన్యం వారిని సస్పెండ్ చేసింది. ఫలితంగా కార్మికులు ఈ నెల 9వ తేదీ నుంచి నిరసనకు దిగారు. దీంతో 900 మంది శాశ్వత కార్మికులను విధుల్లోకి రావొద్దని యాజమాన్యం ఆపేసింది. ఈ నేపథ్యంలో కార్మికుల సస్పెన్షన్ ఎత్తివేయాలని, అందర్ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 11వ తేదీ నుంచి పేపర్ మిల్లు గేటు వద్ద కార్మికులు రిలే దీక్షలతో ఆందోళన చేపట్టారు. అప్పటి నుంచి ఉత్పత్తి ఆగిపోయింది. అయితే సంస్థకు చెందిన కొందరు ఇంజనీర్లు వారం రోజులుగా విధులకు హాజరవుతుండటంతో ఉత్పత్తి పాక్షికంగా జరుగుతోంది. సంస్థ పూర్తి ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 600 టన్నులవగా, ప్రస్తుతం సుమారు 70 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది.
ఈ నేపథ్యంలో యాజమాన్యంతో ప్రభుత్వాధికారులు, వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. అయినా యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన కన్పించడంలేదు.
దీంతో నిత్యం ఉత్పత్తి, కార్మికుల రద్దీతో కళకళలాడే పేపర్ మిల్లులో షిప్టుల సైరన్ మోతకు నోచుకోకుండా బోసిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి, తమకు అండగా నిలవాలని, ప్రతిష్ఠాత్మక సంస్థలో పరిస్థితి యథాస్థితికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుకుంటున్నారు.

చిత్రం,,, పేపర్ మిల్లు బయటే నిలిచిపోయన కార్మికులు