బిజినెస్

అగమ్యగోచరంగా షుగర్ ఫ్యాక్టరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి (రూరల్), ఆగస్టు 31: ఆంధ్రప్రదేశ్‌లో 18 షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే, వాటిలో ఆరు కనుమరుగైపోయాయి. 12 ఫ్యాక్టరీల్లోనూ క్రషింగ్ నిలిచిపోయిన ఫ్యాక్టరీలు ఎనిమిది ఉండగా, కేవలం నాలుగు ఫ్యాక్టరీల్లో మాత్రమే ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతోంది. దీంతో షుగర్ ఫ్యాక్టరీల కార్మికులు, రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చిత్తూరు, నెల్లూరు, రేణిగుంట, తెనాలి, తుమ్మపాల, కడప, కొవ్వూరు, ఆముదాలవలసల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీల్లో వేతనాలు చెల్లించకో, మరే ఇతర కారణాలవల్లో క్రషింగ్ నిలిచిపోయింది. కేవలం తాండవ, ఏటికొప్పాక, గోవాడ, భీమసింగి ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీలు మాత్రమే క్రషింగ్ చేస్తున్నాయి. ముఖ్యంగా విశాపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో ఉన్న తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇక్కడి రైతులకు రెండేళ్ల క్రితం బకాయిలు 1.98 కోట్లు ఉండగా, పిఎఫ్ బకాయ 1.50 కోట్ల వరకూ ఉంది. 145 మంది ఎన్‌ఎంఆర్‌లు, 33 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్న ఈ ఫ్యాక్టరీ ఎవరికీ జీతాలు చెల్లించలేదు. దీంతో జీతాలు చెల్లించే వరకు కార్మికులు యధావిధిగా విధులకు హాజరుకావాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఫలితంగా ఫ్యాక్టరీకి రెగ్యులర్‌గా వస్తున్నప్పటికీ జీతాలు మాత్రం లేక అప్పుల ఊబిలోకి కూరుకుపోయామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చి తమను ఉంచడమా, తీయడమా, ఫ్యాక్టరీ నడపడమా, నడపకపోవడమా అనే అంశంపై చర్చించి తగు నిర్ణయం వెల్లడిస్తే బాగుంటుందని కార్మికులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ కార్మికులకు సంబంధించి క్వార్టర్లకు సుమారు 75 లక్షల రూపాయల విద్యుత్ బకాయి ఉండటంతో ఇటీవల విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. దీంతో కార్మికుల కుటుంబాలు జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లి తమగోడు వెళ్లబోసుకోగా విద్యుత్‌ను పునరుద్ధరించారు. మొత్తానికి దుర్భరమైన జీవనాన్ని తుమ్మపాల షుగర్స్ కార్మికులు, రైతులు అనుభవిస్తున్నారు. రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారే తప్ప ఎవరూ తమను ఆదుకోలేదని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.