సాహితి

బహుళత్వం బుచ్చిబాబు కథల తత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో ఎదుర్కొన్న యథార్థాన్ని
సాహిత్యంలో ఎదుర్కొంటే హర్షించడు
పాఠకుడు. అతనికి కావల్సింది
కళానుగుణమైన సత్యం.
నగ్నసత్యం కాదు.
- బుచ్చిబాబు

===============
జీవితపు యథార్థాన్ని యథాతథంగా వ్యక్తపరచడానికి ఇష్టపడని కథకుడు బుచ్చిబాబు. వాస్తవ భ్రాంతి కలిగించేదే ఉత్తమ సాహిత్యం అన్నమాట ఒక్కటే కూడా బుచ్చిబాబు కథల్ని అవగాహనలోకి తెచ్చుకోవడానికి సాయపడదు. యథార్ధ జీవితానికీ కళకీ తగినంత ఎడం పాడించడంవల్ల బుచ్చిబాబు కథల సారం ఇదీ అని చెప్పడం అంత సులువేం కాదు.
బుచ్చిబాబు కథల్లోని కుటుంబ సంబంధాలని పరిశీలించడంలో కూడా ఒక పొసగని తనం ఉంటుంది. నిజానికి బుచ్చిబాబు కుటుంబ సంబంధాలకు ఆవల నిలబడి చాలా కథలు రాసారు. కుటుంబం పూర్తిగా ఒక భౌతిక ప్రాతిపదిక మీద ఏర్పాటైన వౌలిక యూనిట్. ఆదిమ సమాజం నాగరీకం కావడంలో ముఖ్యపాత్ర పోషించిన ఒక నిర్మాణం. నిర్మాణాలు, పితృస్వామిక స్వభావంతో ఉండడం అనేది ఒక అపవాదుగా కుటుంబ వ్యవస్థను ప్రశ్నిస్తూ వస్తోంది. ఆ పని బుచ్చిబాబు కథలు కూడా చేసాయి. అయితే కుటుంబంలోనూ వివాహంలోనూ పేట్రియార్కీ అన్నది కేవలం పురుషుడి స్వభావంలో మాత్రమే ఉంటుందన్నది బుచ్చిబాబు అంగీకరించడు. చాలా కథల్లో స్ర్తిల పక్షాన నిలబడి మొత్తం బాధల్ని పలికించిన బుచ్చిబాబు కొన్ని కథల ముగింపులో అకస్మాత్తుగా స్ర్తిల వ్యక్తిత్వ లోపాలను ప్రశ్నిస్తూ కథల్ని ముగించడం ఆశ్చర్యపరుస్తుంది.
‘వాడిన కొమ్మలు’ కథ మొత్తం ఈ సూత్రం మీదనే నడిచింది. ‘సగం సగం సాగించిన ఆలోచనా నిర్ధారణకు రాని కార్యం మనుషుల్ని పీడించుకు తింటాయి’ అన్న మాటలో ఉన్న లోతుకి ప్రతీక లాంటి పాత్ర సూర్యకాంతం. చెల్లెలి భర్తని అతని సుగుణాలని రహస్యంగా ఇష్టపడుతూ భర్త మొరటుదనాన్ని అయిష్టపడుతున్నట్లుగా కథని నడుపుతూ వస్తారు. సూర్యకాంతం తన మరిదిని కోరడం అతను నిర్ధారణ కాని విధంగా ప్రవర్తించడం చూసినప్పుడు పాఠకులకి సూర్యకాంతం మీద సానుభూతి కలుగుతుంది. తనని కోరి వచ్చిన ఆమెని చూసి ‘‘సంసార సంస్థ సోడిత్యాన్ని నిలబెట్టిన తెర చిరిగింది. ఆమె భార్య కాదు; వొదిన కాదు; అనంత వ్యక్తిత్వంతో మండిపోతున్న నరాల కుప్ప. అమరతకోసం అంతరాయాలని మంటగలిపిన సృష్టికర్త.’’ అనుకుంటాడు. కానీ కథ చివరికి వచ్చేసరికి సూర్యకాంతం భర్త మొరటుదనం శరీరానిదే తప్ప హృదయానిది కాదని తెలియడం, ఒక ఎత్తు అయితే ఉద్యోగం ధనం సంసారం సంఘంలో స్థానం, హాయిగా కావలసినంత విశ్రాంతి ఉండడంవల్ల తగిన కాలక్షేపంకోసం సూర్యకాంతం తనని ఎంచుకున్నదని చెల్లెలి భర్త ఆరోపిస్తాడు. అంతేకాక ఆమె తనని ప్రేమించింది అంటే నమ్మే శుంఠని కానని వేగంగా కదిలిపోయే ఆధునిక ఆర్థిక యంత్రం చక్రాల కింద ప్రేమ సౌందర్యం సత్యం అన్నీ ముక్కలు ముక్కలైపోయాయి అంటాడు.
ఆర్థిక అంశాలు ప్రేమభావనని ఎలా అపహాస్యం చేస్తాయో చాలాముందుగానే బుచ్చిబాబు ఊహించాడు. అయితే కథ చాలా భాగం సూర్యకాంతం వాంఛవైపు మొగ్గినట్లుగా కనిపిస్తుంది. పాఠకులు కూడా సహానుభూతికి లోనవుతారు. చివరికి వచ్చేసరికి మొరటు భర్త నవనీత సమానం కావడం ఎంతో వాంఛని రగిల్చిన చెల్లెలి భర్త సూర్యకాంతాన్ని తిరస్కరించి ఉపదేశకుడు కావడం ఈ రెండూ రచయిత స్వరంలోంచి సమర్ధించబడటాన్ని జీర్ణంచుకోవడం పాఠకులకి సులభ సాధ్యంకాదు. ముఖ్యంగా సమాజంలో బాధిత స్థానంలో ఉన్న స్ర్తిల లైంగిక ఇష్టాయిష్టాల మీద ఒక తీర్పులాగా కూడా చూసే ప్రమాదం ఉంది. సౌఖ్యవంతమైన కుటుంబాల్లో స్ర్తిలు ఏమీ తోచనితనంలోనుంచి కాలక్షేపం కోసం ప్రేమలను కోరుకుంటారని జీవన పోరాటాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిన యువతకి అంత తీరుబాటు లేదని చెప్పడం ఒక సాంప్రదాయకమైన కోణం.
కుటుంబం అంటున్నపుడు స్ర్తిపురుష సంబంధాలు మాత్రమేకాక వారసత్వ సంబంధాలు బలీయమైన శక్తిగా ఉంటాయి. అయితే బుచ్చిబాబు కథల్లో వారసత్వపు ఆస్తివల్ల ఏర్పడే ఘర్షణ ఎక్కడా కనపడదు. ‘దేశం నాకిచ్చిన సందేశం’ లాంటి కథల్లో ఆర్థిక అంశాల ప్రాబల్యాన్ని తాత్విక చింతనతో చిత్రించడం కనపడుతుంది. ఇది ప్రత్యక్షంగా కుటుంబ సంబంధాలను ప్రస్ఫుటపరిచే కథ కానప్పటికీ పరోక్షంగా ఆ స్ఫురణ కథని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. కథలోని ప్రధానపాత్ర జీవితంలోని వివిధ దశల్లో అతని ఆర్థిక స్థితిగతుల్ని అంచనా కట్టడంకోసం అనేకమంది అడిగిన ప్రశ్న అతనికి జీతం ఎంత వస్తుంది అన్నది. ఆ ప్రశ్న వెనుక ఉన్న ఫిలాసఫీని బుచ్చిబాబు విశే్లషించిన తీరువల్ల ఆ ప్రశ్న అడగడానికి అతని కుటుంబపు స్థాయిని ఎదుటివారు అంచనా వేయడానికీ మధ్య ఉన్న పోలిక పాఠకునికి అందుతుంది. కుటుంబాన్ని సమర్ధవంతంగా నడపడానికి ఆర్థిక అంశాలు ఎంత ముఖ్యమని లోకం భావిస్తుందో ప్రధాన పాత్ర ఎదుర్కొన్న ప్రశ్నలే బోధపరుస్తాయి.
కుటుంబంలోనూ సమాజంలోనూ పురుషుడికి ఉండే ఆర్థిక ఒత్తిళ్ళవల్ల లంచాలకు లొంగిపోయి ఆస్తులు సంపాదించిన కుటుంబాలూ, ప్రభుభక్తివల్ల పేరు తప్ప నాలుగురాళ్ళు వెనకేసుకోలేని కుటుంబాలు వాటి మధ్య ఉండే అంతరాలు, మనుషుల మధ్య అంతరాలుగా ఎలా మారతాయో బుచ్చిబాబు కొన్ని కథల్లో ప్రస్తావించారు. మిగతా విషయాల్లో మనుషులంతా ఒకటే కానీ కొందరికి మాత్రమే ఉండే కార్లూ మేడలవల్ల మనుషులు వేరవుతారనీ ఆ వేరురేఖని పసిగట్టడానికే, కుటుంబాల స్థితిగతుల్ని అంచనా వేయడానికే పదే పదే నీకిప్పుడేమిస్తున్నారని ఆర్థిక ప్రస్తావనలు తెస్తున్నారని ప్రధానపాత్ర గ్రహిస్తాడు. ఆ ప్రశ్ననుంచి తప్పించుకోవడానికి తను పడే తిప్పల గురించి చెప్తూ ‘సత్యం అంటే జీతం ఎంతో కనుక్కోవడం, సౌందర్యం జీతం ఎంతో అందంగా అడగడం, సంస్కారం అంటే అదే చమత్కారంగా అడగడం; ‘కళ’ అంటే ‘అదెంతో చెప్పకపోవడం’గా తన మనస్తత్వం తయారైందని బాధపడతాడు. చివరికి ఆర్థిక విషయాల్లో పరుగుని విరమించి పరుగులు లేని చోట స్థిమితంగా నిలబడటమే శాంతి అని గ్రహించి తన కుటుంబంతో సహా ఒక నది ఒడ్డున చిన్న పాక వేసుకుని సహజ ప్రకృతితో ఎక్కువగా మమేకమై జీవించాలని నిర్ణయించుకుంటాడు. ఇది ఆదర్శవంతమైన ఊహగా కనిపించినప్పటికీ నిరంతర అనే్వషకుడైన కథకుని కలం నుంచి జాల్వారిన శాంతియుత జీవన విధానమది. ఈ కథ ముగింపు చలం మైదానం నవలని గుర్తుకి తెస్తుంది.
లోకానికి ఆసక్తికరంగా ఉండే స్ర్తి పురుష సంబంధాలను అత్యంత ఆకర్షణీయమైన శైలిలో రాయడమే కాకుండా ఫ్రాయిడ్ మనో విశే్లషణా సిద్ధాంతం, రస్సెల్ ‘స్వేచ్ఛాజీవుల ఆరాధన’, తన సమకాలికుడైన జిద్దు కృష్ణమూర్తి తాత్విక భావధారల ప్రభావం బుచ్చిబాబు మీద ఉండడంతో మొదలే సంక్లిష్టమైన స్ర్తి పురుష సంబంధాలు బుచ్చిబాబు కథల్లో మరింత చిక్కుముళ్ళు పడి కనిపిస్తాయి. దానికితోడు భావుకుడు, ప్రకృతి ఆరాధకుడూ, అనే్వషకుడూ అయిన కథకుడు కావడంవల్ల ప్రతి పదమూ శ్రద్ధగా చదివి దాని వెనుక ఉండే సమస్త అర్థాలనూ గ్రహించవలసి ఉంటుంది. పాఠకునికి మధురంగా ఉండే ఈ కథలు విమర్శకులకు ఒక పట్టాన చిక్కవు. బహుశా ఈ గుణంవల్లనే కాబోలు బుచ్చిబాబు శత జయంతి నాటికి కూడా రావలసినంత స్థాయిలో విశే్లషణలు రాలేదు. కాత్యాయని విద్మహే రాసిన ‘చివరకు మిగిలేది, మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా విమర్శ’ బుచ్చిబాబు ఏకైక నవల మీద వచ్చిన సాధికారికమైన విమర్శ గ్రంథం. అందులో కూడా కుటుంబ సంబంధాల విశే్లషణ పెద్దగా లేదు.
నిజానికి బుచ్చిబాబు కథల్లో ప్రధానంగా చర్చకి వచ్చే అంశాలు - ఈస్తటిక్స్, శైలీ శిల్పాలు, తాత్విక దృక్పథం, అస్తిత్వ ధోరణులు, మనిషిని అంతిమంగా ప్రకృతి ఒడిలోకి చేర్చడం లాంటి వాటికి అధిక ప్రాధాన్యతను ఇచ్చాడు. ఇందులో పలు అంశాలు కుటుంబ వ్యవస్థ రూపొందించుకున్న విలువలకు భిన్నంగా సాగేవే. కుటుంబం పట్ల, దానిని కొనసాగించే వివాహ వ్యవస్థ పట్ల ఈ కథకునికి పలు ప్రశ్నలు ఉన్నాయి. చాలా అసహనం ఉంది. ఈ లక్షణాలు కేవలం బుచ్చిబాబుతోనే మొదలుకాలేదు. సమకాలీన, మరి ఒక దశాబ్దం ముందు నుంచీ రాస్తున్న రచయితలైన చలం, కొకుల ప్రభావం బుచ్చిబాబు మీద ఉంది. కొకు కథల్లో ఉండే లాజిక్, చలం రచనల్లో ఉండే రాడికల్ ధోరణి బుచ్చిబాబు కథల్లో సమ్మిశ్రీతం అయ్యాయి. దానికి అదనంగా బుచ్చిబాబుకి తనదైన తాత్విక భావధార పశ్చిమ దేశాల సాహిత్యాన్ని సిద్ధాంతాలను అధ్యయనం చేయడం వంటి సుగుణాల వల్ల బుచ్చిబాబు కథలకి సాంద్రత అమరింది.
భారతీయ కుటుంబాల్లోని స్ర్తిపురుషుల మధ్య ఉండే ఆసమ సంబంధాలకు భిన్నంగా యూరోపియన్ సాహిత్యంలోని ప్రజాస్వామిక సంబంధాల ప్రభావం కూడా బుచ్చిబాబు మీద ఉంది. భార్యాభర్తలు ఏ ఆలోచనలు సాగించేదీ ఒకరికొకరికి తెలిసినప్పటికీ తెలియనట్లుగా నటిస్తామనీ, తమ అన్యోన్యానికి కారణం ఇదేనేమోనని, వివాహం నెగ్గాలంటే ఇటువంటి నటన కాస్త అవసరమేమోనన్న అవగాహన కల భార్య పాత్రని సృష్టించాడు ‘వెనక చూపు- ముందు నడక’ కథలో. భార్యాభర్తలు విడిపోవాల్సి వచ్చినపుడు కుటుంబంలో భాగమైన పిల్లలేమవుతారు వంటి ప్రశ్నలు ఒక పెద్దమనిషి అడిగినపుడు ‘ఎవరు పోషించగలిగితే వారితో ఉంటారు. పోషించే శక్తి ఇద్దరికీ లేకపోతే ప్రభుత్వం భరించాలి’ అన్న అవగాహన ఉన్న స్ర్తి పాత్రల రూపకల్పన చేసాడు బుచ్చిబాబు. స్ర్తిలు చదువుకుని ఉద్యోగాలలోకి రావడం, సామాజిక రంగాల్లో వారి భాగస్వామ్యం పెరగడం, స్ర్తిలపై హింసకి పరిష్కారంగా విడాకుల చట్టాలు రావడం వల్ల కుటుంబ పునాదులు కదిలినట్లు భావించేవారు ఇప్పటికీ ఉన్నారు. అలాంటిది తొలి రోజులనాటి సంచలనాలు ఏ స్థాయిలో ఉంటాయో బుచ్చిబాబు కథల్లో చూడొచ్చు.
కుటుంబ, వివాహ వ్యవస్థలు నిరాఘాటంగా కొనసాగడానికి వీలుగా కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా భార్యాభర్తల మధ్య పారదర్శకత అప్రకటిత విలువగా ఎంచబడే సమాజం మనది. వ్యవస్థీకృత సంబంధాల్లో పరస్పర బాధ్యతలవల్ల స్వేచ్ఛలు కుదించబడతాయి. జంటలో ఎవరికైనా మూడో వ్యక్తిపై కలిగే ఆకర్షణలు ఏర్పడే సంబంధాలు ఏ వ్యవస్థ పరిధిలోకి ఒదగవు గనుక వాటిని రహస్యంగా ఉంచడం కోసం అనేక అబద్ధాలు ఆడాల్సిన స్థితిని అబద్ధాలు కథ ముగింపులో రాజారావు ఏవగించుకుని భార్య ఒడిని చేరి పశ్చాత్తాపాన్ని ప్రదర్శిస్తాడు. ఈ కథలో చివరికి కుటుంబం, వివాహమే అంతిమ ప్రమాణంగా రాజారావు ఎంచుకున్నట్లు కనపడినా నిజానికి తద్వారా అవ్యవస్థీకృత సంబంధాల్లోని అబద్ధాల కూర్పుని అసత్యాల అల్లికనీ నటననీ దగానీ అసహ్యించుకున్నాడు. మానవ సంబంధాల ప్రాతిపదిక స్వేచ్ఛాయుతంగా ఉండాలన్న సూచనని ఈ కథ ద్వారా గ్రహించవచ్చు.
బుచ్చిబాబు, తన కథల్లో కుటుంబాన్ని పూర్తిగా తిరస్కరించలేదు. అలాగని పూర్తిగా అంగీకరించలేదు. ఒక భావవాది తన భావనా ప్రపంచంలో కొత్త సత్యాలను ఆవిష్కరిస్తూ భౌతిక లోకంలోని సమస్త వ్యవస్థల పట్లా చూపే విరాగి తత్వమే బుచ్చిబాబుకి కుటుంబ వ్యవస్థ పట్ల కూడా ఉందని అనిపిస్తుంది. ఈ అస్పష్టత వల్లనే ఆయన కథల్లోని కుటుంబ సంబంధాలను పరిశీలించడానికి ఏ ఒక్క శాస్తమ్రూ సరిపోదనిపిస్తుంది. బహుళ సిద్ధాంత సమన్వయంతో బుచ్చిబాబు కథలపై పరిశోధన సాగాల్సి ఉంది.

- కె.ఎన్.మల్లీశ్వరి, 8885016788