బిజినెస్

విలువలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా వంటి పలువురు పారిశ్రామికవేత్తలు ఉద్దేశ్యపూర్వకంగా బ్యాంకులకు పెద్ద మొత్తంలో రుణాలను ఎగ్గొడుతుండటం దేశ పారిశ్రామిక రంగ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. నిరర్థక ఆస్తులు లేదా మొండి బకాయిల విషయంలో పారిశ్రామికవేత్తలు నైతిక విలువలను పాటిస్తూ సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని న్యూఢిల్లీలో సోమవారం భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) వార్షిక సమావేశంలో జైట్లీ ఉద్ఘాటించారు. ‘ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు పారిశ్రామిక రంగం విశ్వసనీయతను దారుణంగా దెబ్బ తీశాయి. దీంతో పారిశ్రామిక రంగం తన విశ్వసనీయతను కాపాడుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది’ అని జైట్లీ అన్నారు. దేశంలో వివిధ బ్యాంకులకు ఉద్దేశ్యపూర్వకంగా రూ.9 వేల కోట్లకు పైగా అప్పులను ఎగ్గొట్టి శిక్ష నుంచి తప్పించునేందుకు విదేశానికి పారిపోయిన విజయ్ మాల్యాను పరోక్షంగా ప్రస్తావిస్తూ జైట్లీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా నిరర్థక ఆస్తుల గురించే చర్చ జరుగుతోందని, వ్యాపారంలో ప్రతికూల వాతావరం ఉంటే అది నిరర్థక ఆస్తుల పెరుగుదలకు దారితీస్తుందన్న వాస్తవం తనకు తెలుసని జైట్లీ చెప్పారు. ఈ వలయం తిరోగమన దిశలో ఉంటే నిరర్థక ఆస్తులు కూడా తగ్గుతాయని, పారిశ్రామికవేత్తలు ఎల్లప్పుడూ నైతిక విలువలను పాటిస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగినప్పుడే పారిశ్రామిక రంగ విశ్వసనీయత పెరుగుతుందని జైట్లీ హితవు పలికారు.
వడ్డీ రేట్లు తగ్గించాలి
వడ్డీ రేట్లు అధికంగా ఉంటే దేశ ఆర్థికాభివృద్ధి మందగిస్తుందని, కనుక రిజర్వు బ్యాంకు అనుసరించే ద్రవ్య విధానం సరళమైనదిగా ఉండాలని అరుణ్ జైట్లీ ఉద్ఘాటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి రెండు నెలల్లో అవలంభించిన ద్రవ్య పరపతి విధానంపై రిజర్వు బ్యాంకు మంగళవారం సమీక్ష జరుపనున్న నేపథ్యంలో జైట్లీ ఈ సూచన చేశారు. ‘ద్రవ్యోల్బణాన్ని సమర్ధవంతంగా అదుపులో పెట్టిన ప్రభుత్వం ద్రవ్యలోటును కూడా కొంత మేరకు కట్టడి చేయగలిగింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగి సులభమైన వడ్డీ రేట్లతో మన ఆర్థిక వ్యవస్థ మరింత పోటీతత్వాన్ని సంతరించుకుంటుందని ఆశిస్తున్నా’ అని జైట్లీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో వడ్డీ రేట్ల లాంటి కీలక ఆర్థిక అంశాలపై జరిగే ఏ చర్చలైనా సరైన దిశలోనే సాగాలని ఆయన అన్నారు. బాధ్యతాయుతమైన రాజకీయ గ్రూపులు గతంలో అధిక వడ్డీ రేట్లను సమర్ధించడంతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిన విషయాన్ని జైట్లీ ఈ సందర్భంగా ఉదహరించారు.
కేజ్రీవాల్‌పై ఎదురుదాడి
ఇదిలావుంటే, ఎకైజ్ సుంకం విధింపునకు వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తున్న నగల వర్తకులకు మద్దతు తెలుపుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై అరుణ్ జైట్లీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బంగారంపై తొలుత ఢిల్లీ ప్రభుత్వం ‘వ్యాట్’ను రద్దు చేయాలని జైట్లీ సవాలు విసిరారు. ‘బంగారం లాంటి విలాస వస్తువులపై పన్ను విధించరాదని కేజ్రీవాల్ చెబుతున్నారు. బంగారంపై తొలుత కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యాట్‌ను రద్దుచేస్తే ఆయన సూచనను నేను స్వాగతిస్తా’ అని జైట్లీ స్పష్టం చేశారు.