బిజినెస్

జిసిసి వ్యాపారానికి నోట్ల రద్దు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 30: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇప్పుడు గిరిజన సహకార సంస్థ (జిసిసి)పై తీవ్రంగా చూపుతోంది. ఏకంగా 150 కోట్ల రూపాయల మేర వ్యాపారం పడిపోయింది. ప్రతిసారి కంటే ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో లక్ష్యాలను అధిగమించాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ప్రధానంగా జిసిసి ఆధ్వర్వంలో నడుస్తున్న పెట్రోల్ బంక్‌లు, వీటికి అనుసంధానంగా నిర్వహించే గిరిజన సూపర్ మార్కెట్లు, కాఫీ పంట, డిపోలు, కుంకుమ తయారీ వంటి వాటి ద్వారా యేటా 250 నుంచి 300 కోట్ల రూపాయల వరకు వ్యాపారం జరిగేది. రాష్ట్రంలో ప్రతి మన్యం ప్రాంతంలో గిరిజనులు, ప్రభుత్వరంగ ఉద్యోగులు, స్థానిక వినియోగదారుల కోసం పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా బంక్‌లు ఏర్పాటు చేసింది జిసిసి. విశాఖ జిల్లాలో హుకుంపేట, జి.మాడుగుల, పెదబయలు, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కెడి పేట, కాకరపాడు, నర్సీపట్నం, అరకు ప్రాంతాల్లో జిసిసి పెట్రోల్ బంక్‌లు విజయవంతంగా నడుస్తున్నాయి. వీటితోపాటు తూర్పు గోదావరి జిల్లాలో అడ్డతీగల, రంప చోడవరం, రాజవొమ్మం ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఇవి కాకుండా విశాఖ జిల్లాలో డుంబ్రిగుడ, ముంచింగిపుట్, కాశీపట్నం, సీలేరు ప్రాంతాల్లో వీటిని ప్రారంభించాల్సి ఉంది. ఈ బంక్‌లకు అనుసంధానం చేస్తూ గిరిజన సూపర్ మార్కెట్లు నిర్వహిస్తున్నారు. దీంతో నిత్యావసర సరకుల కొనుగోలుతోపాటు వినియోగదారులకు తమ వాహనాల్లో పెట్రోల్ పోయించుకునే సౌలభ్యం ఒకేచోట కల్పించినట్టు అయ్యింది. సూపర్ మార్కెట్లలో అటవీ ఉత్పత్తులైన తేనె, కుంకుళ్ళు, పనస, నిమ్మ, చింతపండు, మిరియాలు, చిక్కుళ్ళు, అల్లం తదితర నిత్యావసరాలు లభిస్తున్నాయి. వీటి తరువాత అరకు కాఫీకి ఇటీవల కాలంలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
దీనివల్ల ఇతర రాష్ట్రాల మార్కెట్‌లోకి సైతం ఇది వెల్లగలిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఐటిడిఐ, జిసిసి సంయుక్త ఆధ్వర్యంలో పదేళ్ళ ప్రాజెక్టును నిర్వహించాలని నిర్ణయించగా, తొలి ఏడాదిలోనే రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పంటను గిరిజన రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 1,400 మెట్రిక్ టన్నుల మేర కాఫీ ముడిసరుకును ఎగుమతి చేయగలిగింది. 12 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని రాబట్టగలిగింది. లాభం లేదు-నష్టం రాదు అనే విధానంతో దళారీ వ్యవస్థను నిర్మూలించడంతోపాటు గిరిజన రైతులకు గిట్టుబాటు ధరను కల్పించిన జిసిసి ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల మెట్రిక్ టన్నుల కాఫీని సేకరించి విక్రయించాలని లక్ష్యంగా చేసుకుంది. ఇందులోభాగంగా ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కాఫీ పంటను సేకరించే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఇవే కాకుండా ఇటీవల సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన జిసిసి కుంకుమ తయారీ ద్వారా ఆదాయాన్ని పెంచుకోగలుగుతుంది. రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలకు సహజసిద్ధమైన పసుపును సేకరించి దీని ద్వారా కుంకుమను తయారు చేసి సరఫరా చేయాలని నిర్ణయించి సంస్థ వ్యాపారాన్ని నిర్వహించగలుగుతోంది.
అటవీ ఉత్పత్తులైన ఔషధాల్లో మిశ్రమంగా ఉపయోగించే విలువైన గమ్‌కరియా, నేవీ, ఆర్మీ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల క్యాంటీన్లకు సరఫరా చేసే తేనె, ప్రభుత్వ వసతిగృహాలకు అందించే చింతపండు వంటి వాటి ద్వారా సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతుంది. అయితే, వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో పెంచుకోవాలని పడిన ఆశలపై కేంద్రం ఒక్కసారిగా నీళ్ళు జల్లినట్లయింది. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు, గిరిజనులు, చివరకు సీజనల్ వ్యాపారాలు సాగించే పారిశ్రామికవేత్తల చేతుల్లో డబ్బు లేక, ఉన్నవి బ్యాంకుల్లోనే మూలుగుతున్న పరిస్థితులు జిసిసి వ్యాపారాలను దెబ్బతీశాయి. ఈ ఏడాది 350 నుంచి 400 కోట్ల రూపాయల మేర వ్యాపార లక్ష్యాలను సాధించాలని నిర్ణయించగా, ఇందులో ఇంతవరకు 250 కోట్ల రూపాయల మేర సాధించగలిగినట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. సీజన్ పూర్తయ్యే మరో రెండు మాసాల్లో మరో పది కోట్ల రూపాయల కంటే వ్యాపారం చేయని పరిస్థితులు నెలకొన్నాయి. అందువల్ల దాదాపు 150 కోట్ల రూపాయల మేర వ్యాపారాన్ని నష్టపోక తప్పదని ఈ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.