బిజినెస్

టిసిఎస్ భారీ బైబ్యాక్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశీయ ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) లిమిటెడ్.. సోమవారం 16,000 కోట్ల రూపాయల షేర్ బైబ్యాక్‌ను ప్రకటించింది. భారతీయ క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలో ఈ స్థాయిలో బైబ్యాక్ ఆఫర్ రావడం ఇదే ప్రథమం. కాగా, ఈ బైబ్యాక్‌కు టిసిఎస్ బోర్డు ఆమోదం తెలియపరచగా, దీనివల్ల సంస్థ మిగులు నగదు నిల్వలు భాగస్వాములకు చేరనున్నాయి. అమెరికా నుంచి వచ్చే వ్యాపార ఆదాయం తగ్గిపోతున్నప్పటికీ ఈ షేర్ బైబ్యాక్ ఆఫర్‌కు టిసిఎస్ రావడం గమనార్హం. 155 బిలియన్ డాలర్ల భారతీయ ఐటి పరిశ్రమలో అమెరికా వాటానే 65 శాతం. అయితే ఆ దేశ నూతనాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న రక్షణాత్మక చర్యలు ఇప్పుడు భారతీయ ఐటి సంస్థల ఆదాయానికి గండి కొడుతున్నాయి.
ఈ క్రమంలో మునుపెన్నడూ లేనివిధంగా టిసిఎస్ భారీ షేర్ బైబ్యాక్ ఆఫర్‌కు దిగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలావుంటే తమ షేర్ క్యాపిటల్‌లో 2.85 శాతం లేదా సుమారు 5.61 కోట్ల షేర్లను మదుపరులు, భాగస్వాముల నుంచి తిరిగి కొనుగోలు చేసేందుకు సంస్థ బోర్డు అంగీకారం తెలిపిందని స్టాక్ ఎక్స్‌చేంజ్‌లకు టిసిఎస్ తెలియజేసింది. ఒక్కో షేర్‌ను 2,850 రూపాయల వద్ద కొనుగోలు చేయనుంది. ఈ షేర్ బైబ్యాక్ విజయవంతమైతే.. 2012లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తెచ్చిన 10,400 కోట్ల రూపాయల బైబ్యాక్ ఆఫర్‌ను మించిపోతుంది. టిసిఎస్ షేర్ విలువ సోమవారం 4.08 శాతం పెరిగి 2,506.50 వద్ద ముగిసింది. మొత్తానికి టిసిఎస్ సిఇఒగా ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో జరిగిన చివరి బోర్డు సమావేశం.. సంచలన నిర్ణయానికి వేదికైంది. దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ కూడా 12,000 కోట్ల రూపాయల బైబ్యాక్ షేర్ ఆఫర్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తగిన సమయంలోనే స్పందిస్తామని భారీగా నగదు నిల్వలున్న ఆ సంస్థ చెబుతోంది. మరోవైపు నిరుడు డిసెంబర్ 31న విప్రో సంస్థ 2,500 కోట్ల రూపాయల విలువైన బైబ్యాక్ ఆఫర్‌కు దిగినది తెలిసిందే. విప్రో వద్ద 33,155.3 కోట్ల రూపాయల నగదు నిల్వలున్నాయి. కాగ్నిజెంట్ కూడా 3.4 బిలియన్ డాలర్ల బైబ్యాక్ షేర్ ఆఫర్‌ను ప్రకటించినది తెలిసిందే. ఈ ఆఫర్ టిసిఎస్ కంటే పెద్దది కావడం విశేషం.
టిసిఎస్ చైర్మన్‌గాను చంద్రశేఖరన్
మంగళవారం టాటా గ్రూప్ కొత్త సారథిగా వస్తున్న ఎన్ చంద్రశేఖరన్.. టిసిఎస్ చైర్మన్‌గానూ ఉండనున్నారు. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన, 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా సైరస్ మిస్ర్తి నిరుడు ఉద్వాసనకు గురైన నేపథ్యంలో రతన్ టాటా నేతృత్వంలోని ఉన్నతస్థాయ కమిటీ టిసిఎస్ సిఇఒ చంద్రశేఖరన్‌ను నూతన నాయకుడిగా ఎంపిక చేసినది తెలిసిందే. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు భారతీయ ఐటి రంగాభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్రస్తుత తరుణంలో చంద్రశేఖరన్.. టిసిఎస్ పగ్గాలు తీసుకుంటున్నారు.
టిసిఎస్ సిఎఫ్‌ఒగా వి రామకృష్ణన్
ఇక టిసిఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఒ)గా సోమవారం వి రామకృష్ణన్ నియమితులయ్యారు. సిఎఫ్‌ఒగా ఉన్న రాజేశ్ గోపినాథన్ టిసిఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్నికవడంతో ఆయన స్థానంలోకి రామకృష్ణన్ వస్తున్నారు.