బిజినెస్

పెరిగిన నాన్-సబ్సిడీ వంటగ్యాస్ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: నాన్-సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర శుక్రవారం 49.5 రూపాయలు పెరిగింది. అయితే నాన్-సబ్సిడీ కిరోసిన్ ధర మాత్రం లీటర్‌కు 1.05 రూపాయలు తగ్గింది. విమానయాన ఇంధనం (ఎటిఎఫ్) ధర కూడా 10 శాతం తగ్గింది. దీంతో ఢిల్లీలో కిలో లీటర్ ఎటిఎఫ్ ధర 4,428 రూపాయలు దిగి 39,892.32 రూపాయలకు చేరింది. ఇదే క్రమంలో 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర 657.50 రూపాయలుగా ఉంటే, లీటర్ కిరోసిన్ ధర 43.19 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు చమురు సంస్థలు తెలిపాయి.

బిహెచ్‌ఇఎల్ సిఎండిగా సోబ్టీ
న్యూఢిల్లీ, జనవరి 1: మహారత్న హోదా కలిగిన ప్రభుత్వరంగ సంస్థ, దేశంలోనే అతిపెద్ద ఇంజినీరింగ్, ఉత్పాదక దిగ్గజం బిహెచ్‌ఇఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అతుల్ సోబ్టీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బిహెచ్‌ఇఎల్ ఓ ప్రకటనలో ఇక్కడ తెలియజేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో బిహెచ్‌ఇఎల్ సిఎండిగా ఐదేళ్ల పదవీ కాలానికి సోబ్టీని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తెలిసిందే. ఈ క్రమంలో కొత్త సంవత్సరం సందర్భంగా తన కొత్త బాధ్యతలను చేపట్టారు సోబ్టీ. ఇంతకుముందు బిహెచ్‌ఇఎల్‌లో వివిధ హోదాల్లో సోబ్టీ పనిచేశారు.

ఫోక్స్‌వాగన్ పుణె ప్లాంట్‌లో రికార్డు ఉత్పత్తి
ముంబయి, జనవరి 1: జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్‌వాగన్.. పుణె ప్లాంట్ నుంచి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1.23 లక్షల కార్లను ఉత్పత్తి చేసింది. ‘2015లో పుణెలోని చకన్ ప్లాంట్ నుంచి మునుపెన్నడూ లేనివిధంగా 1,23,456 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేశాం. గత ఏడాది కంటే ఇది 10 శాతం అధికం.’ అని ఓ ప్రకటనలో శుక్రవారం ఫోక్స్‌వాగన్ స్పష్టం చేసింది. దేశీయంగా పెరిగిన అమ్మకాలు, విదేశాలకు ఎక్కువైన ఎగుమతులే దీనికి కారణమని చెప్పింది. ఫోక్స్‌వాగన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నిబంధనల ఉల్లంఘనను ఎదుర్కొంటున్నది తెలిసిందే.

అంచనాలు.. ఆశలు..

బ్యాంకింగ్ రంగంపై
మొండి బకాయిల భారం
ముంబయి, జనవరి 1: దేశీయ బ్యాంకింగ్ రంగం.. దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల (66 బిలియన్ డాలర్లు) మొండి బకాయిలతో కొత్త సంవత్సరం 2016లోకి ప్రవేశించింది. ఈ ఏడాది ఈ నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ)న్నింటినీ తొలగించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గడువు పెట్టిన నేపథ్యంలో బ్యాంకర్లు ఆ దిశగా కసరత్తులు చేస్తున్నారు. ఇటీవల ఆర్‌బిఐ విడుదల చేసిన ఓ నివేదికలో గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాకానికి ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్థూల మొండి బకాయిలు 5.1 శాతానికి చేరుకున్నాయి. నికర మొండి బకాయిలు 2.8 శాతంగా ఉన్నాయి. మరోవైపు పేమెంట్, చిన్నతరహా ఆర్థిక బ్యాంకుల నుంచి కూడా ఈ ఏడాది పూర్తిస్థాయి బ్యాంకులకు పోటీ పెద్ద ఎత్తునే ఉంటుందన్న అంచనాలున్నాయి.

సంస్కరణలు, వడ్డీకోతలపై
స్టాక్ మార్కెట్ల పయనం ఆధారం

న్యూఢిల్లీ, జనవరి 1: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), వడ్డీరేట్ల కోతలు, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఆధారంగానే ఈ నూతన సంవత్సరం దేశీయ స్టాక్ మార్కెట్లు నడుస్తాయని మార్కెట్ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. జిఎస్‌టి పన్ను గత ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందుతుందని భావించినప్పటికీ అది కుదరలేదన్నది తెలిసిందే. అయితే ఈ ఏడాదైనా జిఎస్‌టి బిల్లు పాసవుతుందేమోనన్న ఆశలు మార్కెట్ వర్గాల్లో కనిపిస్తున్నాయి. ఇకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్ల కోతలతో బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాలన్న ఆశనూ మదుపరులు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే విదేశీ మదుపరుల పెట్టుబడులు ఈ ఏడాది భారీగా రావాలన్న ఆకాంక్షనూ వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది విదేశీ పెట్టుబడులు నిరాశపరచగా, దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.